సినిమా అద్భుతమైన రంగం!
సినీ రంగం కమర్షియల్ వేదిక మాత్రమే కాదు .అదొక అద్భుతమైన ప్రపంచం అని సీనియర్ నటుడు జగపతి బాబు అభిప్రాయపడ్డారు.
సినీ రంగం కమర్షియల్ వేదిక మాత్రమే కాదు .అదొక అద్భుతమైన ప్రపంచం అని సీనియర్ నటుడు జగపతి బాబు అభిప్రాయపడ్డారు. బయటి ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ ఉండే కళాత్మకత, భావోద్వేగాలు మనిషిని భిన్నమైన కోణంలో ఆవిష్కరిస్తాయన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను విశ్లేషించుకుంటూ ఈ రంగం తనకు ఇచ్చిన గుర్తింపు, నేర్పిన పాఠాల గురించి ఎంతో స్పష్టంగా వివరించారు. జగపతి బాబు తెరిచిన పుస్తకం లాంటి వారు. ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడుతుంటారు.
తనకు వ్యాపార మెళకువలు తెలియవని ఆ విషయంలో తానో బ్యాడ్ బిజినెస్ మ్యాన్ అని స్వయంగా అంగీకరించారు. సమాజంలో బతకడానికి అవసరమైన లౌక్యం ఎదుటివారి మనోభావాలను బట్టి మాట్లాడే నేర్పు తనకు లేవని ఈ లోపాలు వాస్తవ ప్రపంచంలో మనుగడ సాగించడానికి పెద్ద ఆటంకాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. లౌక్యం లేని మనిషి బయటి సమాజంలో రాణించడం కష్టమని గ్రహించారు. మనుషుల స్వభావాలు, రాజకీయాలు, మాటతీరులోని వ్యత్యాసాలు తనకు అర్థం కాకపోవడంతో తెలిసిన సినిమా అనే సమాజంలోనే తలదాచుకోవడం సురక్షితమని నిర్ణయించుకున్నారు.
తనకు తెలిసిన నటన అనే విద్యే ప్రాణవాయువుగా ..రక్షణ కవచంగా మారిందన్నారు. అదృష్టవశాత్తూ నటుడిగా నిరంతరం అవకాశాలు రావడం వల్లే తాను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానన్నారు. ఈ వృత్తి కేవలం జీవనోపాధిని మాత్రమే కాదని సమాజంలో గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టిందన్నారు. దీంతో తాను నమ్మిన వృత్తికి వంద శాతం న్యాయం చేస్తున్నాననే తృప్తి ఆయన మాటల్లో కనిపిస్తుంది. సినిమా నటుడిగా ఉండటం గొప్ప వరం అని భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా? ప్రజలు ఇచ్చే ఆదరణ, ఎవరి దగ్గరికి వెళ్లినా పనులు వెంటనే జరిగిపోయే వెసులుబాటు సాధారణ వ్యక్తులకు దక్కని విశేషాలు.
నటుడిగా లభించే ఈ ప్రత్యేక గుర్తింపు వెనుక లక్షలాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు ఉంటాయని ఆ ప్రేమను పొందే అవకాశం ఉండటమే నటుడిగా తాను సాధించిన గొప్ప విజయమన్నారు. వృత్తిపరమైన ఎదుగుదలతో పాటు, మనిషిగా తాను ఇంకా నేర్చుకుంటున్నానన్నారు. నిజాయితీగా ఉండటం వల్ల కొన్నిసార్లు నష్టపోయినా? అది ఇచ్చే మానసిక ప్రశాంతత మరేదానికీ సాటిరాదు. లౌక్యం లేని నైజంతోనే సినిమా అనే రంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ చిత్తశుద్ధితో ముందుకెళ్లడమే తన జీవన విధానం అని జగపతి బాబు మరోసారి నిరూపించుకున్నారు. అలాగే ఆయన కుమార్తె విదేశీయుడిని ప్రేమించడంతో? ఎంత మాత్రం నో చెప్పకుండా ప్రేమించిన అబ్బాయికే కుమార్తెనిచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే.