బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ జగ్గూకి నచ్చలేదా?
సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఆయన.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు మరోసారి తన ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఆయన.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లిటిల్ హార్ట్స్ సినిమా గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
"లిటిల్ హార్ట్స్ ఒక నాన్ సెన్స్ మూవీ. కానీ ఆ దర్శకుడు అద్భుతంగా తీశాడు" అంటూ జగ్గూ భాయ్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ బయటకు వచ్చిన వెంటనే కొందరు నెటిజన్లు ఆయన సినిమాను విమర్శించారని భావించారు. అయితే మొత్తం కామెంట్స్ విన్నవారు మాత్రం జగపతి బాబు ఉద్దేశం వేరే అని చెబుతున్నారు. ఆయన చెప్పిన దాని అర్థం ఏమిటంటే.. లిటిల్ హార్ట్స్ నార్మల్ కమర్షియల్ మూవీ ఫార్మాట్ లో ఉండదని, రెగ్యులర్ కథనం, క్లైమాక్స్‌లకు భిన్నంగా సాగుతుందని.
అయినప్పటికీ దర్శకుడు సాయి మార్తాండ్ తన ఆలోచనను ఎంతో ధైర్యంగా చూపించారని, అదే సినిమా విజయానికి ప్రధాన కారణమైందని ప్రశంసించారు. జగపతి బాబు వెల్లడించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ సినిమాలో రాజీవ్ కనకాల పోషించిన కీలక పాత్ర కోసం మొదట తననే సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర చేయలేకపోయినట్లు చెప్పారు. అయినా సినిమా విడుదలైన తర్వాత దర్శకుడి వర్క్ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
గత ఏడాది విడుదలైన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. కొత్త దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఆ చిత్రం యూత్ ను ఆకట్టుకుంది. కథ చెప్పిన తీరు, రోల్స్ నేచురాలిటీ, ఎమోషన్స్ సినిమాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ సినిమా విజయం తర్వాత దర్శకుడు సాయి మార్తాండ్ పై జగపతి బాబుకు నమ్మకం మరింత పెరిగిందట. అందుకే ఆయన తదుపరి ప్రాజెక్ట్ కు నిర్మాతగా మారినట్లు వెల్లడించారు.
హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో రూపొందనున్న కొత్త చిత్రాన్ని జగపతి బాబు, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ తో కలిసి నిర్మించనున్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే ప్రశ్నకు స్పందించిన జగపతి బాబు.. ప్రస్తుతం ఆ నిర్ణయం దర్శకుడు సాయి మార్తాండ్, నిర్మాతల టీమ్ చేతుల్లోనే ఉందని చెప్పారు. సరైన సమయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సమయంలో డైరెక్టర్ టాలెంట్ ను గుర్తించి ఆయనపై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం విశేషం. ముఖ్యంగా అడివి శేష్ లాంటి కథలకు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో, సాయి మార్తాండ్ లాంటి దర్శకుడు కలిసి పనిచేయడం ఆసక్తిని పెంచుతోంది. ఏదేమైనా లిటిల్ హార్ట్స్ పై జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు విమర్శలు కాదని, సినిమా తీసిన విధానంపై కురిపించిన ప్రశంసలేనని క్లియర్ గా తెలుస్తోంది. దర్శకుడి ఆలోచనా విధానం, కొత్తదనం తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ జగ్గూ భాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.