ఫోటో కోసం వచ్చామని చెప్పి జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి

జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి జరిగింది. అభిమానులమని.. ఫోటో దిగుతామని వచ్చిన ఎనిమిది మంది ఆమెపై దాడికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది.;

Update: 2026-04-02 04:10 GMT

జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి జరిగింది. అభిమానులమని.. ఫోటో దిగుతామని వచ్చిన ఎనిమిది మంది ఆమెపై దాడికి పాల్పడిన ఉదంతం షాకింగ్ గా మారింది. దాడికి పాల్పడిన వారంతా యుక్త వయస్కులే కావటం గమనార్హం. మరో కీలక అంశం ఏమంటే.. దాడికి స్కెచ్ వేసింది.. దాడి చేసింది ఆమెకు అసిస్టెంట్ గా ఉన్న శ్రీనాథ్ కావటం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. కొమురక్క వద్ద శ్రీనాథ్ అనే యువకుడు సహాయకుడిగా ఉంటున్నాడు.

కొద్దికాలం క్రితం కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంలో శ్రీనాథ్ ను నిలదీయగా.. తప్పు ఒప్పుకొని తానే చోరీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దొంగలించిన బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా శ్రీనాథ్ చోరీ చేసిన బంగారాన్ని తిరిగి ఇవ్వకపోవటంతో రెండు రోజుల క్రితం కొమురక్క మరోసారి మందలించారు. కొమురక్క గట్టిగా అడగటంతో శ్రీనాథ్ తన సొంతూరు స్నేహితులకు విషయాన్ని చెప్పాడు. తనపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆమెపై దాడికి పాల్పడేలా ప్లాన్ చేశాడు.

రాత్రి పదకొండు గంటల వేళలో కొమురక్క ఇంటికి వచ్చిన ఎనిమిది మంది.. తాము ఆమె అభిమానులమని.. ఫోటో దిగేందుకు వచ్చామని నమ్మించారు. వారి మాటల్ని నమ్మిన ఆమె ఫోటో దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. రామ్ చరణ్ అనే వ్యక్తి ఆమెకు దగ్గరగా వెళ్లి. .శ్రీనాథ్ ను ఎందుకు తిట్టావంటూ గొడవకు దిగాడు. అదే సమయంలో వంశీక్రిష్ణ అనే యువకుడు రాయితో దాడి చేస్తుండగా.. ఆమె సోదరుడు యాదయ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఇంతలో వికాస్ అనే యువకుడు రాయితో దాడి చేయగా.. చంద్రశేఖర్ అనే యువకుడు కర్రతో కొమురక్క చేతిని గాయపర్చాడు. ఇలా మూకుమ్మడి దాడికి పాల్పడుతున్న వేళ.. వారిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతానికి చెందిన రాము ప్రయత్నించగా.. అతడిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు స్పందించి.. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితులు తమ టూవీలర్ ను వదిలేసి పరారయ్యారు. ఈ దాడి ఉదంతం గురించి కొమురక్క సమాచారం ఇవ్వటంతో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా వారిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనానికి కారణమైంది.

Tags:    

Similar News