'ఇసక పట్నం' వెబ్ సిరీస్ రివ్యూ

తమిళ.. తెలుగు భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్ర పోషించిన తెలుగు వెబ్ సిరీస్.. ఇస్కపట్నం.

Update: 2026-07-06 06:46 GMT

నటీనటులు: ఐశ్వర్య రాజేష్ - సముద్ర ఖని - నరేష్ అగస్త్య- సునీల్- రాజీవ్ కనకాల- రవివర్మ- జ్వాలా కోటి-రాజా చెంబోలు- సుధాకర్ కోమాకుల- బెనర్జీ తదితరులు

సంగీతం: గ్యారీ బి.హెచ్

నిర్మాతలు : రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు

నిర్మాతలు : రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర

దర్శకత్వం: గ్యారీ బి.హెచ్

తమిళ.. తెలుగు భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్ర పోషించిన తెలుగు వెబ్ సిరీస్.. ఇస్కపట్నం. నిఖిల్ 'స్పై' మూవీతో దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ ఈ సిరీస్ ను రూపొందించాడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ విశేషాలేంటో చూద్దాం పదండి.

ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన సినిమాలు ఎంత ప్ర‌త్యేకంగా ఉంటాయో.. ఆమె న‌టించిన‌ సుళ‌ల్ అనే వెబ్ సిరీస్ కూడా అంతే ప్ర‌త్యేకం. ఆమె మ‌ళ్లీ ఒక సిరీస్ లో న‌టించిందంటే ఎంతో ఎగ్జైట్ అవుతార‌న‌డంలో సందేహం లేదు. కానీ స్పై సినిమా ద‌ర్శ‌కుడు.. ఎడిట‌ర్ గా మంచి పేరున్న గ్యారీ బి.హెచ్.. ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందించిన తెలుగు వెబ్ సిరీస్ ఇస‌క‌ప‌ట్నం మాత్రం అంచ‌నాల‌కు కొంచెం దూరంలో ఆగిపోయింది. ట్రైల‌ర్ చూస్తే ఇదొక ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో సాగే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లా క‌నిపించింది కానీ... ఏడు ఎపిసోడ్ల సిరీస్ లో పెద్దగా ప్రేక్ష‌కుల ఆస‌క్తిని నిల‌బెట్ట‌లేక‌పోయింది. ఐశ్వ‌ర్య.. స‌ముద్ర‌ఖ‌ని లాంటి మంచి పెర్ఫామ‌ర్లు ఉన్నా.. వారికి స‌రిపోయే బ‌ల‌మైన పాత్ర‌లు తీర్చిదిద్ద‌క‌పోవ‌డం.. క‌థ‌లో పెద్ద‌గా మ‌లుపులు లేక‌పోవ‌డం.. డ్రామా కూడా పండ‌క‌పోవ‌డంతో ఇస‌క‌ప‌ట్నం ఒక నార్మల్ సిరీస్ లానే అనిపిస్తుంది.

ముందుగా ఇస‌కప‌ట్నం క‌థ విష‌యానికి వ‌స్తే.. పోర్టును ఆనుకుని ఉండే ఇస‌క‌ప‌ట్నాన్ని నాయుడు (స‌ముద్ర‌ఖ‌ని) ఎన్నో ఏళ్ల నుంచి ఏలుతూ ఉంటాడు. మొద‌ట్లో ఏదైనా ప‌ని ఉందా అని అక్క‌డికి వ‌చ్చిన వాడు.. ఆ ప్రాంతంలో మంచి పేరున్న చిన్నారావు (రాజీవ్ క‌న‌కాల‌)ను చంపి త‌న కుర్చీని ఆక్ర‌మిస్తాడు. త‌న ఎదుగుద‌ల కోసం కుటుంబ స‌భ్యులను కూడా బ‌లి చేయ‌డాడ‌నికి సిద్ధ‌ప‌డే నాయుడు అంటే త‌న కూతురు భార‌తి (ఐశ్వ‌ర్య రాజేష్‌)కు చాలా కోపం. దీంతో తండ్రిని ధిక్క‌రించి ఒక ఎన్జీవో కోసం ప‌ని చేస్తుంటుంది. ఆమెకు ఇష్టం లేకుండా త‌న వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం పెద్ద వ‌య‌స్కుడైన‌ త‌న శ‌త్రువుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు నాయుడు. మ‌రి ఆ చెర నుంచి ఐశ్వ‌ర్య బ‌య‌ట‌ప‌డిందా లేదా.. నాయుడిని మ‌ట్టుబెట్టాల‌ని చూస్తున్న శ‌త్రువుల ప‌న్నాగాలు ఎంత‌మేర ఫలించాయి.. చివ‌రికి ఇస‌క‌ప‌ట్నంపై ఎవ‌రు ఆధిప‌త్యం చ‌లాయించారు అన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఐశ్వ‌ర్య‌.. స‌ముద్ర‌ఖ‌ని ఇద్ద‌రూ ఎలాంటి పాత్ర‌ల‌నైనా పండించ‌గ‌ల స‌మ‌ర్థులైన న‌టులు. వాళ్ల‌కు విష‌యం ఉన్న క్యారెక్ట‌ర్ల‌ను ఇచ్చి ఉంటే చెడుగుడు ఆడుకునేవారు. వాళ్లే క‌థ‌ను ముందుకు లాక్కెళ్లిపోయారు. కానీ ఈ ఇద్ద‌రి ప్ర‌తిభ‌కు ఏమాత్రం స‌రితూగ‌ని సాధార‌ణ పాత్ర‌ల‌ను త‌యారు చేయ‌డంతోనే ఇస‌క‌ప‌ట్నం నిస్సారంగా తయారైంది. పోర్టు ప్రాంతంలో గూండాగిరీ.. రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే సిరీస్ లో డ్రామా పండ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన పాత్ర‌ల‌ను స‌రిగా తీర్చిదిద్ద‌క‌పోవ‌డ‌మే కార‌ణం. ప‌ని కోసం వ‌చ్చి త‌న‌కు ప‌నిచ్చిన‌వాడినే చంపి ఒక ప్రాంతాన్ని గుప్పెట్లోపెట్టుకునే పాత్ర‌లు సినిమాల్లో కోకొల్ల‌లుగా చూశాం. పాత విష‌యాన్నయినా కొంచెం కొత్త‌గా ప్రెజెంట్ చేసే ప్ర‌య‌త్నం ఏదీ జ‌ర‌గ‌లేదు. ఏ మ‌ర్మం లేని నాయుడి (స‌ముద్ర‌ఖ‌ని) పాత్ర ఏ ద‌శ‌లోనూ ఎగ్జైటింగ్ గా అనిపించ‌దు.

ఐశ్వ‌ర్య క్యారెక్ట‌ర్ మొద‌ట్లో కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. రాను రాను అదీ మామూలైపోతుంది. ఆ పాత్ర‌కు అవ‌స‌ర‌మైన ట్రాన్స్ఫ‌ర్మేష‌న్ క‌నిపించ‌లేదు. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య వైరాన్ని స‌రిగా ఎస్టాబ్లిష్ చేయ‌క‌పోవ‌డంతో ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ కాలేదు. కూతురినే పెళ్లి పేరుతో బ‌లిపెట్ట‌డానికి తండ్రి చూడ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఏదీ క‌నిపించ‌దు. అలాగే తాను అప్ప‌టికే ఒక వ్య‌క్తిని ప్రేమించినా స‌రే.. తండ్రి ఒక మ‌ధ్య వ‌య‌స్కుడితో పెళ్లి నిర్ణ‌యిస్తే ఏమీ అడ్డ‌కు చెప్ప‌కుండా త‌లొంచుకుని తాళి క‌ట్టించుకోవ‌డంలో ఆంత‌ర్య‌మేంటో అర్థం కాదు. తండ్రి చ‌ర్య‌ల్లో కానీ.. హీరోయిన్ ప్ర‌వ‌ర్త‌న‌లో కానీ లాజిక్ మిస్ కావ‌డంతో బ‌లంగా పేలాల్సిన ఎపిసోడ్ కూడా మంచి అనుభూతిని ఇవ్వ‌లేక‌పోయింది. దీన్ని మించి ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్లేమీ లేవు ఈ సిరీస్ లో. పోర్టులో వ‌ర్గాలు.. వారి మ‌ధ్య ఎత్తులు పైఎత్తులు.. రాజ‌కీయాలు.. వేటినీ ఆస‌క్తి రేకెత్తించేలా ప్రెజెంట్ చేయ‌లేక‌పోయారు.

ఐశ్వ‌ర్య‌.. స‌ముద్ర‌ఖ‌నిల‌కే కాదు.. సునీల్.. న‌రేష్ అగ‌స్త్య.. సుధాక‌ర్ కోమాకుల‌... బెన‌ర్జీ.. రాజా చెంబోలు.. ఇలా ఏ ఒక్క‌రికీ సిరీస్ లో స‌రైన పాత్ర ప‌డ‌లేదు. అస‌లు సునీల్ ఈ సిరీస్ లో ఎందుకున్నాడో అనిపించేలా త‌న పాత్ర‌ను త‌యారు చేశారు. ఏ పాత్ర ఏంటో.. ఎవ‌రి ఉద్దేశాలేంటో.. ఎవ‌రు ఎలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తారో అర్థం కావు. దీంతో స‌న్నివేశాలు చాలా మొక్కుబ‌డిగా న‌డుస్తుంటాయి. ఏదో ఒక ద‌శ‌లో మంచి మ‌లుపులు ఉంటాయ‌ని.. క‌థ ర‌స‌కందాయంలో ప‌డుతుంద‌ని ఎదురు చూస్తూ ఉంటాం కానీ.. ఎంత‌కీ అది జ‌ర‌గ‌దు. ఐశ్వ‌ర్య పాత్ర‌కు సంబంధించి ఒక ట్విస్టు ఉన్నా.. దాన్ని ఆఖ‌ర్లో తేల్చి ప‌డేశారు. పెర్ఫామెన్సుల విష‌యానికి ఐశ్వ‌ర్య‌.. స‌ముద్ర‌ఖ‌ని బాగా పెర్ఫామ్ చేశారు. మిగ‌తా వాళ్లు ప‌ర్వాలేదు. టెక్నిక‌ల్ గా ఇస‌క‌ప‌ట్నం ఓకే అనిపిస్తుంది. రైటింగ్.. డైరెక్ష‌న్ గురించి పెద్ద‌గా చెప్ప‌డానికేమీ లేదు. చివ‌ర్లో రెండో సీజ‌న్ కు లీడ్ ఇచ్చినా.. ఈ సిరీస్ ఇచ్చిన ఫీలింగ్ త‌ర్వాత దాని మీద ఏమాత్రం ఆస‌క్తి ఉంటుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే.

చివరగా: ఇస‌క ప‌ట్నం.. ఆసక్తి రేకెత్తించలేని సాధారణ రాజకీయ థ్రిల్లర్‌గా మిగిలింది.

రేటింగ్ - 2.25/5

Tags:    

Similar News