‘ఇరుముడి’లో భయపెట్టిన ఆ టీచరమ్మ ఎవరు?

‘ఇరుముడి’లో రవితేజతో పాటు కొన్ని పాత్రలు కూడా ఆడియన్స్‌కు బాగా గుర్తుండిపోతున్నాయి.

Update: 2026-08-24 03:50 GMT

‘ఇరుముడి’లో రవితేజతో పాటు కొన్ని పాత్రలు కూడా ఆడియన్స్‌కు బాగా గుర్తుండిపోతున్నాయి. అందులో ధనలక్ష్మి టీచర్ క్యారెక్టర్ ఒకటి. సినిమాలో ఆ పాత్రను చూసిన చాలామందికి ఆమె కొత్త నటిలా అనిపించొచ్చు. కానీ ధనలక్ష్మిగా కనిపించింది స్వాసిక విజయ్. మలయాళం ఇండస్ట్రీని ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం ఈ పేరు కొత్త కాదు.

స్వాసిక కెరీర్ ఈమధ్య మొదలైంది కాదు. 2009లో తమిళ సినిమా ‘వైగై’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంతో పాటు మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. టెలివిజన్‌లో కూడా పనిచేయడంతో కేరళలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ‘వసంతి’ సినిమాలో చేసిన పాత్రకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ క్యారెక్టర్ నటిగా అవార్డు కూడా అందుకుంది.

ఈమధ్య స్వాసిక పేరు ఎక్కువగా వినిపించింది మాత్రం ‘లబ్బర్ పందు’తోనే. తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందులో యశోద పాత్రలో స్వాసిక నటించింది. హీరోకు జోడీగా నాలుగు పాటల్లో కనిపించే పాత్ర కాకుండా, కథలోనే ఆమెకు మంచి స్పేస్ ఉంటుంది. ఆ పాత్రకు పాజిటివ్ కామెంట్స్ తో పాటు అవార్డులు కూడా దక్కాయి. అప్పటివరకు మలయాళంలో ఎక్కువగా తెలిసిన స్వాసికను తమిళ ప్రేక్షకులకు కూడా ‘లబ్బర్ పందు’ మరింత దగ్గర చేసింది.

ఇప్పుడు తెలుగులో ‘ఇరుముడి’తో ఆమెకు మంచి పాత్ర పడింది. ధనలక్ష్మి టీచర్‌గా తన ఫస్ట్ ఎంట్రీతోనే హారర్ ఫీల్ కలిగించింది. ఆ చూపులతో ఒక్కసారిగా మూడ్ ను మార్చేసే సైకోలా హైలెట్ అయ్యింది. ఆమెనే మెయిన్ విలన్ అనుకునేలా దర్శకుడు శివ నిర్వాణ క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అందుకే సినిమా పూర్తయ్యాక రవితేజ ప్రధాన కథతో పాటు టీచర్‌గా చేసింది ఎవరు అనే సెర్చ్ కూడా మొదలైంది.

ఇక 2024లో నటుడు ప్రేమ్ జాకబ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా స్వాసిక సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు. హీరోయిన్‌గానే ఉండాలనే లెక్క పెట్టుకోకుండా తనకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తోంది. అందుకే ఒక సినిమాలో భార్యగా, మరో సినిమాలో టీచర్‌గా.. ఇలా వేర్వేరు పాత్రల్లో కనిపిస్తోంది. ‘లబ్బర్ పందు’ తర్వాత ఇప్పుడు ‘ఇరుముడి’ కూడా ఆమెకు మరో మంచి గుర్తింపు ఇచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఇప్పటివరకు స్వాసిక పేరు పెద్దగా వినిపించలేదు. ఈ సినిమా తర్వాత మాత్రం ధనలక్ష్మి టీచర్‌గా ఆమెను గుర్తుపట్టే ఆడియన్స్ పెరిగారు. మరి అమ్మడికి తెలుగులో ఇంకా ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News