అనుకరణా? లేక వారసత్వమా?
అయితే అనుకరణ- స్ఫూర్తికి మధ్య సన్నని గీత ఉంది. ఒక సీన్‌ను లేదా విజువల్‌ను ఉన్నది ఉన్నట్లుగా దించేస్తే అది అనుకరణ అవుతుంది.;
సినిమా అనేది అందమైన దృశ్య కావ్యం. ఇక్కడ ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. స్టార్ డైరెక్టర్ వద్ద సంవత్సరాల తరబడి పనిచేసిన శిష్యుడు సహజంగానే గురువు ఆలోచనా విధానాన్ని, టేకింగ్ స్టైల్‌ను వంటబట్టించుకుంటాడు. దీనిని కేవలం అనుకరణ అని కొట్టిపారేయలేము. ఒక విద్యార్థి గురువు నుండి విద్యను అభ్యసించినప్పుడు ఆ ప్రభావం అతని పనిలో కనిపించడం సహజం. దీనిని ఒక రకమైన సినీ వారసత్వం గా చూస్తాం. గురువు వదిలిన చోటు నుండి శిష్యుడు కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ పంథాను ముందుకు తీసుకెళ్తుంటాడు.
రెండవ కోణంలో చూస్తే దీనిని స్ఫూర్తి గానూ భావించొచ్చు. దర్శకులందరూ తమకు నచ్చిన పూర్వ దర్శకుల నుండి స్ఫూర్తి పొందినవారే. షాట్ కంపోజిషన్ లేదా క్యారెక్టర్ మేకప్ గెటప్ ఒకేలా ఉన్నప్పుడు అది గురువు పట్ల శిష్యుడికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. గురువు తన సినిమాతో సాధించలేకపోయినా? లేదా అసంపూర్తిగా వదిలేసిన ఒక విజన్‌ను శిష్యుడు తన సినిమాలో మరింత పరిణతితో ఆధునిక సాంకేతికతను జోడించి పూర్తి చేసి విజయం అందుకుంటే? అది గురువుకు ఇచ్చే గొప్ప బహుమతిగానూ భావించొచ్చు.
అయితే అనుకరణ- స్ఫూర్తికి మధ్య సన్నని గీత ఉంది. ఒక సీన్‌ను లేదా విజువల్‌ను ఉన్నది ఉన్నట్లుగా దించేస్తే అది అనుకరణ అవుతుంది. అలా కాకుండా ఆ శైలిని తీసుకుని తనదైన కొత్త కథకు, పాత్రలకు అనుగుణంగా మలుచుకుంటే అది సృజనాత్మకత అవుతుంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. గురువు నీడలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శిష్యులే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. గురువు నేర్పిన పాఠాలకు తన సొంత ఆలోచనలు తోడైనప్పుడే అద్భుతమైన సినిమా ఆవిష్కృతమవుతుంది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల చిన్న పోలిక కనిపించినా నెటిజన్లు కాపీ అనే ముద్ర వేస్తున్నారు. కానీ కళాకారుల దృష్టిలో ఇదొక నిరంతర ప్రక్రియ. శంకర్ లాంటి దర్శకులు విజువల్ గ్రాండియర్‌కు ప్రాధాన్యత ఇస్తే వారి శిష్యులు కూడా అదే స్థాయిలో ఆలోచించడం వల్ల విజువల్స్ పరంగా పోలికలు రావచ్చు. కానీ కథనం ,భావోద్వేగం పండించడంలో శిష్యుడు తన ప్రత్యేకతను చాటుకున్నంత కాలం ఆ పోలికలు సినిమా విజయానికి అడ్డంకి కావు. గురువు బ్రాండ్ ఇమేజ్ శిష్యుడి సినిమాపై ఒక పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది.
వారసత్వం అనేది కేవలం నటులకే పరిమితం కాదు. దర్శకులకు కూడా వర్తిస్తుంది. గొప్ప దర్శకుడి స్కూల్ నుండి వచ్చిన శిష్యులు ఆ దర్శకుడి పేరును నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ వంటి దర్శకుల శిష్యుల్లో కొందరు నేడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీరి సినిమాల్లో అక్కడక్కడా గురువుల ఛాయలు కనిపించినా వారు తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కాబట్టి పోలికలు ఉన్నప్పుడు అది అనుకరణ గా విమర్శించడం కంటే? ఆ వారసత్వం తదుపరి తరానికి ఎలా అందుతోందో? గమనించాల్సిన అంశం.
ఒక స్టార్ డైరెక్టర్ విజన్ తన శిష్యుడి ద్వారా మరింత మెరుగ్గా ఆవిష్కృతం కావడం అనేది సినీ పరిశ్రమకు శుభపరిణామం. అది అనుకరణా లేక స్ఫూర్తియా అన్నది సినిమా ఇచ్చే అనుభూతిని బట్టి ఉంటుంది. గురువు చూపిన బాటలో నడుస్తూనే తనకంటూ ఒక కొత్త శిఖరాన్ని నిర్మించుకున్నప్పుడే ఆ శిష్యుడికి, గురువుకు అసలైన గౌరవం దక్కుతుంది.