స్టార్ట‌ప్‌లకు బూస్ట్ ఇస్తూ సొంత‌ వ్యాపారంలో రాణిస్తున్న స్టార్ హీరో!

ఈ కార్యక్రమం తదుపరి దశకు చేరుకుంటున్న తరుణంలో షార్ట్‌లిస్ట్ చేసిన స్టార్టప్‌లు ఇన్వెస్టర్లు.. వ్యాపార ప్రముఖుల సమక్షంలో పెట్టుబడి రౌండ్లలో పాల్గొనబోతున్నాయి.

Update: 2026-07-12 04:29 GMT

భారతీయ స్టార్టప్‌లు తమ వ్యాపార విస్తరణ.. వ్యూహాత్మక భాగస్వామ్యాలు.. అంతర్జాతీయ పెట్టుబడుల కోసం దేశీయ మార్కెట్లను దాటి గ్లోబల్ వేదికలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన వ్యాపారవేత్తలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఒక ప్రధాన ప్రవేశ ద్వారంగా (గేట్‌వే) వేగంగా ఎదుగుతోంది. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ యూఏఈకి చెందిన స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్ రియాలిటీ సిరీస్ - వ్యవస్థాపక వేదిక అయిన `ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్` కార్య‌క్ర‌మం భారత్, యూఏఈ.. మధ్యప్రాచ్య ప్రాంతాల నుండి ఏకంగా 1500 కంటే ఎక్కువ దరఖాస్తులను ఆకర్షించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ భారీ స్పందన భారతీయ స్టార్టప్ రంగంలో వస్తున్న ఒక పెద్ద మార్పును సూచిస్తోందని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేటి తరం భారతీయ వ్యవస్థాపకులు మొదటి రోజు నుంచే ప్రపంచ స్థాయి వ్యాపారాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారు. భారత్-యూఏఈల మధ్య ఉన్న బలమైన ఆర్థిక భాగస్వామ్యం, అనుకూలమైన వ్యాపార వాతావరణం, విస్తరిస్తున్న వెంచర్ క్యాపిటల్ మార్కెట్.. లోతైన వాణిజ్య సంబంధాలు నూతన తరం హై-గ్రోత్ స్టార్టప్‌లకు మిడిల్ ఈస్ట్‌ను ఒక అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి.

`ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్` అనేది కేవలం ఒక టెలివిజన్ షో మాత్రమే కాదు.. ఇది ఆర్బిట్ ఈవెంట్స్-ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించిన ఒక వినూత్నమైన ఎకోసిస్టమ్-బిల్డింగ్ ప్లాట్‌ఫామ్. విజనరీ వ్యవస్థాపకులను.. యూఏఈలోని సంపన్న వ్యాపార సమాజాన్ని ఒకే చోటికి చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎంపికైన స్టార్టప్ వ్యవస్థాపకులకు ఇన్వెస్టర్ల ప్యానెల్ ముందు తమ వ్యాపార ఆలోచనలను వ్య‌క్త‌ప‌రిచే అవకాశం లభించడమే కాకుండా... నిపుణుల మార్గదర్శకత్వం (మెంటర్‌షిప్) .. వ్యూహాత్మక నెట్‌వర్కింగ్ అవకాశాలు అందుతాయి.

ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త ..`పద్మశ్రీ` అవార్డు గ్రహీత ఆర్. మాధవన్ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కో-క్రియేటర్, హోస్ట్ కం వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. వినోద రంగానికి లభించే గుర్తింపు - ప్రాచుర్యం వ్యాపారవేత్తలకు కూడా లభించాలని ఆయన ఆకాంక్షించారు. దేశ నిర్మాణంలో స్టార్టప్ వ్యవస్థాపకులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారని...తీవ్రమైన ప‌రిస్థితుల్ని తట్టుకుని నిలబడే ఇటువంటి గ్లోబల్ మైండ్‌సెట్ ఉన్న నూతన ఆలోచనలకు పెట్టుబడితో పాటు సరైన గమ్యం, మార్కెట్ యాక్సెస్ కల్పించడమే తమ ప్లాట్‌ఫారమ్ లక్ష్యమని మాధవన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం తదుపరి దశకు చేరుకుంటున్న తరుణంలో షార్ట్‌లిస్ట్ చేసిన స్టార్టప్‌లు ఇన్వెస్టర్లు.. వ్యాపార ప్రముఖుల సమక్షంలో పెట్టుబడి రౌండ్లలో పాల్గొనబోతున్నాయి. ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సీఈఓ రాజేష్ బహ్ల్, ప్రొడ్యూసర్ విపుల్ డి. షా - ఆర్బిట్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజ్ఞా వాయాలు మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్ నుండి అంతర్జాతీయ స్థాయికి విస్తరించగల ఒక అద్భుతమైన ఫ్రాంచైజీగా దీనిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ ప్రయత్నం భారతదేశం- మిడిల్ ఈస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ & ఆస్తులు

న‌టుడు ఆర్‌. మాధ‌వ‌న్ మిడిల్ ఈస్ట్‌లో రియాలిటీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. దుబాయ్ లో ఇప్ప‌టికే అత‌డికి విలాస‌వంత‌మైన ఇల్లు ఉంది. తన కుమారుడు వేదాంత్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల శిక్షణ కోసం ఒకప్పుడు దుబాయ్‌ను బేస్‌గా చేసుకున్న తరుణంలో.. మాధవన్ అక్కడ ఇల్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు కేవలం నివాసంగానే కాకుండా.. మిడిల్ ఈస్ట్‌లో ఆయన వ్యాపార కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా (బేస్) ఉపయోగపడుతోంది.

దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైనదిగా మారింది. మాధవన్ కేవలం నివాస గృహానికే పరిమితం కాకుండా..దుబాయ్ - యూఏఈలోని మరికొన్ని వ్యూహాత్మక ప్రాంతాలలో తెలివైన ఆస్తుల‌లో పెట్టుబడులు పెట్టిన‌ట్లు సమాచారం. స్థిరాస్తి రంగంలో లాభాలను దీర్ఘకాలికంగా అంచనా వేస్తూ ఆయన చేసిన పెట్టుబడులు, ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువను భారీగా పెంచాయి.

Tags:    

Similar News