60 వయసులో పిల్లలేంటి అనేయకండి.. కనేందుకు టాప్ -5 స్టార్ల ఆసక్తి!
ఆధునిక సాంకేతికత (సరోగసీ) .. దత్తత మార్గాల ద్వారా ఒంటరిగా లేదా ఆలస్యంగా తల్లిదండ్రులైన ప్రముఖ భారతీయ నటీనటుల వివరాలు పరిశీలిస్తే...
భారతీయ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు సాంప్రదాయ వివాహ వ్యవస్థకు దూరంగా ఉన్నా.. పితృత్వం లేదా మాతృత్వ అనుభూతిని పొందేందుకు... లేటు వయసులో పిల్లలను కనేందుకు ధైర్యంగా అడుగులు వేశారు. ఆధునిక సాంకేతికత (సరోగసీ) .. దత్తత మార్గాల ద్వారా ఒంటరిగా లేదా ఆలస్యంగా తల్లిదండ్రులైన ప్రముఖ భారతీయ నటీనటుల వివరాలు పరిశీలిస్తే...
సల్మాన్ ఖాన్:
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60 ఏళ్ల వయసులోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నారు. పెళ్లి చేసుకోకపోయినా, తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని.. సరోగసీ లేదా ఇతర మార్గాల ద్వారా తండ్రి కావాలనే కోరిక ఉందని ఇటీవల `కాఫీ విత్ కరణ్` వంటి టాక్ షోలలో బహిరంగంగా వెల్లడించారు. భారతదేశంలో సింగిల్ పేరెంట్స్కు ఉన్న సరోగసీ నిబంధనల వల్ల ఆలస్యమవుతున్నా.. ఆయన తండ్రి కావడంపై తనకున్న ఆసక్తిని బహిరంగంగా స్పష్టం చేశారు.
షోలో భాగంగా కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ .. తన కుటుంబంలోని మేనకోడళ్లు, మేనల్లుళ్లతో ఎంతో అన్యోన్యంగా ఉండే సల్మాన్.. భవిష్యత్తులో సొంత పిల్లలను కనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. రానున్న 4-5 ఏళ్లలో తనకు పిల్లలు పుట్టినా వచ్చే 20-25 ఏళ్లపాటు వారితో ఆడుకుంటూ ఆ క్షణాలను ఆస్వాధించగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోనూ తాను తండ్రి కావాలనుకున్నానని.. అయితే సింగిల్ వ్యక్తిగా భారతదేశంలో ఉన్న కొన్ని చట్టపరమైన నిబంధనలు (సరోగసీ చట్టాలు) అందుకు అడ్డుగా నిలిచాయని సల్మాన్ గుర్తుచేసుకున్నారు.
సుస్మితా సేన్ :
మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్ వివాహం చేసుకోకుండానే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆమె కేవలం 24 ఏళ్ల వయసులోనే (2000లో) `రేనీ` అనే బాలికను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 2010లో అలీషా అనే మరో పాపను దత్తత తీసుకుని.. పెళ్లి లేకుండానే ఒంటరి తల్లిగా వారిని ఎంతో బాధ్యతాయుతంగా పెంచి పెద్ద చేశారు.
కరణ్ జోహార్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు .. నిర్మాత కరణ్ జోహార్ వివాహం చేసుకోలేదు. ఆయన 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత 2017లో సరోగసీ ద్వారా కవల పిల్లలు (యష్ , రూహి) కు తండ్రి అయ్యారు. ఒక ఒంటరి తండ్రిగా ఆయన వారి బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా పెంచుతున్నారు.
తుషార్ కపూర్ :
నటుడు తుషార్ కపూర్ వివాహం చేసుకోకుండానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నారు. 2016లో (తన 39వ ఏట) ఐవిఎఫ్ (IVF) .. సరోగసీ పద్ధతి ద్వారా `లక్ష్య` అనే బాబుకు తండ్రి అయ్యారు. భారతీయ సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకోకుండా సరోగసీ ద్వారా సింగిల్ ఫాదర్గా మారిన మొదటి ప్రముఖుల్లో ఆయన ఒకరు.
ఏక్తా కపూర్ :
ప్రముఖ టీవీ - సినిమా నిర్మాత ఏక్తా కపూర్ కూడా తన తమ్ముడు తుషార్ కపూర్ బాటలోనే నడిచారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టని ఏక్తా, 2019లో (తన 43వ ఏట) సరోగసీ ద్వారా రవి కపూర్ అనే బాబుకు జన్మనిచ్చి ఒంటరి తల్లిగా మారారు.
శోభన :
దక్షిణాది సీనియర్ నటి- ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి శోభన వివాహం చేసుకోలేదు. కానీ మాతృత్వపు తీపిని అనుభవించేందుకు 2010లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం నటన, నాట్యంతో పాటు తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు.
సమాజం విధించే సాంప్రదాయ నిబంధనలను పక్కన పెట్టి.. ఈ నటీనటులు సరోగసీ లేదా దత్తత ద్వారా పిల్లలను పొంది వారికి మంచి భవిష్యత్తును ఇస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.