యంగ్ హీరో దేశ బహిష్కారం వ్యవహారంపై రచ్చ రచ్చ
సీజేపీ నిరసనల్లోకి బాలీవుడ్ తారల ప్రవేశం కల్లోలంగా మారిన సంగతి తెలిసిందే.
సీజేపీ నిరసనల్లోకి బాలీవుడ్ తారల ప్రవేశం కల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ను అక్టోబరు 28 నాటికి భారతదేశం విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆదేశించడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా , సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది. ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. అమెరికన్ పౌరసత్వం ఉండి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారుడైన ఇమ్రాన్ నిరసనలో పాల్గొనడం నిబంధనల ఉల్లంఘనేనంటూ బిజెపి నేత కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఈ కఠినమైన నోటీసును జారీ చేశారు.
ఈ నోటీసుపై భారతీయ చలనచిత్ర పరిశ్రమ.. సామాజిక వర్గాలలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు.. నటి సబా ఆజాద్ వంటి సినీ ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్కు తమ మద్దతు తెలిపారు. ఇమ్రాన్ తన జీవితంలో మెజారిటీ సమయాన్ని భారతదేశంలోనే గడిపారని.. అలాంటి వ్యక్తిపై ఇటువంటి నిర్ణయం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. మరొకవైపు సమాజ్వాదీ పార్టీ నేత అబు ఆజ్మీ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
అదే సమయంలో అధికార వర్గాల నిర్ణయాన్ని కొందరు ప్రముఖ నటులు సమర్థించారు. సీనియర్ నటుడు రజా మురాద్ - గజేంద్ర చౌహాన్ మాట్లాడుతూ.. ఏ దేశ పౌరులైనా వేరే దేశపు అంతర్గత లేదా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తులు ఇక్కడి నిబంధనలను పాటించాల్సిందేనని... చట్టాన్ని ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఎదుర్కోక తప్పదని వారు వాదించారు.
మరొకవైపు ఈ డిపోర్టేషన్ నోటీసును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ న్యాయ బృందం బొంబాయి హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమైంది. ప్రముఖ న్యాయవాది జుల్ఫికర్ మెమన్ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్లో నివసించే ఓసిఐ కార్డైన్లకు శాంతియుత నిరసనల్లో పాల్గొనడానికి చట్టపరమైన స్పష్టమైన నిషేధాలు లేవని.. ఈ నోటీసును రద్దు చేయాలని వారు తమ పిటిషన్లో పేర్కొననున్నారు.
ఈ వ్యవహారం మూలంగా భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు- ఓసీఐ కార్డైన్ల హక్కులు.. పరిమితులపై కొత్త చర్చ మొదలైంది. ప్రవాస భారతీయులకు ఇచ్చే సాంస్కృతిక - ఆర్థిక స్వేచ్ఛతో పాటు వారి రాజకీయ - సామాజిక హక్కుల సరిహద్దులు ఏమిటనే దానిపై బొంబాయి హైకోర్టు ఇచ్చే తీర్పు అత్యంత కీలకమైన ముగింపును ఇచ్చే అవకాశం ఉంది.