లేడీ డైరెక్ట‌ర్ల‌పై `మేల్ టాక్సికాల‌జీ`ని వివ‌రించిన న‌టి!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్` చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హుమా ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-07-07 03:21 GMT

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్` చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హుమా ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు. `ది లల్లన్‌టాప్` పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, పురుషాధిక్యత ఎక్కువగా ఉండే కమర్షియల్ సినిమా రంగంలో ఒక మహిళా దర్శకురాలి కింద పనిచేయడానికి సాధారణంగా చాలా మంది మేల్ స్టార్స్ (హీరోలు) ఇష్టపడరని ఓపెన్‌గా కామెంట్ చేశారు. ఒక మ‌హిళ నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికి హీరోలు వెనుకాడుతుంటారని.. కానీ యష్ లాంటి పాన్-ఇండియా సూపర్‌స్టార్ మాత్రం ఎలాంటి ఈగోలు లేకుండా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.

హుమా ఖురేషి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారితీశాయి. అసలు లేడీ డైరెక్టర్లతో పనిచేయడానికి స్టార్ హీరోలు ఇబ్బంది పడతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా కమర్షియల్ సినిమాలలో ఉండే హీరోయిన్లతో రొమాన్స్ మ్యాటర్.. రక్తికట్టించే రోమాంచిత సన్నివేశాలు లేదా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు పండించడంలో మహిళా దర్శకులతో ఏవైనా జెండర్ ఇష్యూస్ (చిక్కులు) ఎదురవుతాయా. అనే అపోహలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అందుకే లేడీ డైరెక్టర్లు గొప్ప కథలు చెప్పినా వినేందుకు హీరోలు సిద్ధంగా ఉండరనే టాక్ కూడా ఉంది. ఇండ‌స్ట్రీలో మేఘనా గుల్జార్, ఫరా ఖాన్, మీరా నాయిర్, జోయా అక్త‌ర్, రీమా క‌గ్తి వంటి మేటి మహిళా దర్శకులు ఉన్నప్పటికీ.. ఈ రేంజ్‌లో రొమాన్స్, కమర్షియల్ యాక్షన్‌ను బ్యాలెన్స్ చేయలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ఈ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ గీతూ మోహన్‌దాస్ `టాక్సిక్` చిత్రంలో ఎక్కడా రాజీ పడకుండా రొమాంటిక్ టేల్స్ ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ మలయాళ ఆర్ట్-హౌస్ దర్శకురాలి విజన్‌ను నమ్మే తాను ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నానని హుమా ఖురేషి స్పష్టం చేశారు. ఈ భారీ యాక్షన్ చిత్రంలో రొమాంటిక్ టేల్స్, ఎమోషన్స్‌ను గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన తీరు చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారని.. హీరో యష్‌తో లేడీ డైరెక్ట‌ర్ కు కుదిరిన బాండింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆమె కొనియాడారు.

ఈ సినిమా అవుట్‌పుట్‌పై హుమా ఖురేషి ఎంతో ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇప్పటివరకు వెండితెరపై `టాక్సిక్` లాంటి సరికొత్త సినిమాను చూసి ఉండరని.. కాబట్టి ఎలాంటి ముందస్తు విమర్శలు చేయకుండా కొద్దిగా ఓపిక పట్టాలని ప్రేక్షకులను కోరారు. ఈ చిత్రంలో నటించిన తనతో పాటు ప్రధాన నటీమణులందరూ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచారని కితాబిచ్చారు. థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యాక అందులోని కంటెంట్- యాక్షన్ ప్రతి ఒక్కరినీ క‌చ్చితంగా కదిలిస్తుందని హ్యూమా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

KVN ప్రొడక్షన్స్ - మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `టాక్సిక్` చిత్రం ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హుమా ఖురేషి ఇచ్చిన ఈ ఎలివేషన్స్ - గీతూ మోహన్‌దాస్-యష్ కాంబినేషన్‌పై కురిపించిన ప్రశంసలతో ఈ చిత్రంపై అంచనాలు -హైప్ మరింత స్కై-హైకి చేరుకున్నాయి.

Tags:    

Similar News