హీరోల నుంచి విలన్లుగా..టెక్ దిగ్గజాలపై హాలీవుడ్ కొత్త దృక్కోణం!
ఇటీవల ఆరన్ సోర్కిన్ దర్శకత్వంలో వచ్చిన `ది సోషల్ రెకనింగ్` చిత్రం ఫేస్బుక్ విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ కథ ఆధారంగా తెరకెక్కింది.
ఒకప్పుడు సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ దిగ్గజాలను ప్రపంచాన్ని మార్చే గొప్ప నాయకులుగా.. ఆదర్శమూర్తులుగా హాలీవుడ్ సినిమాలు చూపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎలోన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, శామ్ ఆల్ట్మాన్ , బయోటెక్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎలిజబెత్ హోల్మ్స్ వంటి టెక్ నాయకుల నిజ స్వరూపాన్ని.. వారి వెనుక ఉన్న వివాదాలను హాలీవుడ్ చలనచిత్రాలు విలన్ కోణంలో ఆవిష్కరిస్తున్నాయి.
ఈ టెక్ నాయకులు కేవలం నూతన ఆవిష్కరణలతో మార్కెట్లను ఆకట్టుకోవడమే కాకుండా బిలియన్ డాలర్ల సామ్రాజ్యాలను నెలకొల్పి ప్రపంచాన్ని మార్చేస్తున్నట్లు ఒకప్పుడు కనిపించేవారని విమర్శకులు భావిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వారి విధానాలు.. రాజకీయ వైఖరుల వల్ల ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకం సడలి, అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలోని కొందరు ప్రముఖులు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలవడం వంటి పరిణామాలు ఈ మార్పుకు మరింత కారణమయ్యాయి.
ఇటీవల ఆరన్ సోర్కిన్ దర్శకత్వంలో వచ్చిన `ది సోషల్ రెకనింగ్` చిత్రం ఫేస్బుక్ విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ కథ ఆధారంగా తెరకెక్కింది. యూజర్లను నిరంతరం ప్లాట్‌ఫామ్‌పై ఉంచేందుకు ఫేస్బుక్ అల్గారిథమ్‌లు ద్వేషపూరిత ప్రసంగాలను ఎలా వ్యాప్తి చేశాయో? ఈ సినిమా చూపించింది. అలాగు స్పేస్ఎక్స్, టెస్లా అధినేతి ఎలోన్ మస్క్ జీవితం, ఆయన అధికార దాహం, రాజకీయ మైత్రిని విశ్లేషిస్తూ అలెక్స్ గిబ్నీ రూపొందించిన `మస్క్` డాక్యుమెంటరీ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు రక్తపు బొట్టుతో అనేక వైద్య పరీక్షలు చేస్తామని మోసం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న థెరానోస్ అధినేత్రి ఎలిజబెత్ హోల్మ్స్ కథతో `యూ కెన్ సీ ఎవ్వరీథింగ్` అనే డాక్యుమెంటరీ రూపొందింది. హోల్మ్స్ జైలుకు వెళ్లే ముందు ఆమె ఇంట్లో ఉంటూ చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ రియాలిటీ షో తరహాలో సాగుతూ ఆస్కార్ రేసులో నిలిచింది. అలాగే ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మాన్.. చాట్‌జీపీటీ సృష్టి నేపథ్యంతో ఇటాలియన్ దర్శకుడు లూకా గువాడగ్నినో `ఆర్టిఫిషియల్` పేరుతో నిర్మిస్తున్న చిత్రం సాంకేతికత.. ఆధిపత్యం వెనుక ఉన్న భయాందోళనలను ప్రదర్శిస్తోంది.
సినిమా నిపుణుల అభిప్రాయం ప్రకారం సమాజంలో నెలకొన్న ఆందోళనలను సినిమాలు ప్రతిబింబిస్తాయి. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే అపారమైన అధికారం, సంపద కేంద్రీకృతమవడం పట్ల ప్రజల్లో ఏర్పడుతున్న భయాన్ని ఈ సినిమాలు స్పష్టం చేస్తున్నాయి. గత తరాల పారిశ్రామికవేత్తల లాగా ప్రస్తుత టెక్ బిలియనీర్లు సమాజ సేవ లేదా ధార్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడాన్ని కూడా ఈ చిత్రాలు ఎత్తిచూపుతున్నాయి.
మొత్తానికి టెక్ రంగానికి చెందిన ప్రొడక్టుల కంటే కూడా వాటి వెనుక ఉన్న వ్యక్తుల ఆశయాలు.. దురాశ.. అధికారం.. వారి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాలను ప్రశ్నించడమే హాలీవుడ్ ప్రధాన లక్ష్యంగా మారింది. తమ సినిమాల ద్వారా టెక్ బిలియనీర్లను బాధ్యులను చేస్తూ ప్రశ్నించే దిశగా దర్శకులు కొత్త తరహా కథనాలను ఎంచు కుంటున్నారు.