అవార్డుల్లో 'గీత' డామినేషన్.. అల్లు బాస్ విజన్ వల్లేనా?
ముఖ్యంగా ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈసారి అవార్డుల్లో డామినేషన్ చూపించడం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.;
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందించిన గద్దర్ అవార్డులు (2025 చిత్రాలకు) తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈసారి అవార్డుల్లో డామినేషన్ చూపించడం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ సారథ్యంలో వచ్చిన చిత్రాలు కీలక విభాగాల్లో విజయం సాధించడం విశేషం.
కొన్ని రోజుల క్రితం అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా, ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రదానోత్సవం గ్రాండ్ గా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులు అందజేశారు. ఆ సమయంలో గీతా ఆర్ట్స్ సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా తండేల్, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుని తమ సత్తాను చాటుకున్నాయి. యాక్టింగ్ బేస్డ్ డిపార్ట్మెంట్లలో ఆ బ్యానర్ కు చెందిన సినిమాలు డామినేషన్ చూపించడం విశేషం. ప్రత్యేకంగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో తన అద్భుతమైన యాక్టింగ్ కు గాను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉత్తమ నటి అవార్డు అందుకోవడం ఆ వేడుకలో హైలైట్ గా నిలిచింది.
తండేల్ మూవీకి గాను యంగ్ హీరో నాగచైతన్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. గత ఏడాది.. GA2 పిక్చర్స్ నిర్మించిన ఆయ్ చిత్రం బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవార్డును గెలుచుకోవడం గమనార్హం. దీంతో వరుసగా అవార్డుల వేదికపై గీతా ఆర్ట్స్ తన ముద్రను వేస్తూ వస్తోంది. ఆ విజయాల వెనుక ప్రధాన కారణంగా అల్లు అరవింద్ విజన్ అని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
కమర్షియల్ ఎలిమెంట్స్ ను, ఆడియన్స్ టేస్ట్ తోపాటు ప్రిఫరెన్స్ లో వస్తున్న ఛేంజ్ ను పరిశీలిస్తూ ఆయన కథలను ఎంపిక చేసే తీరు ఆ సక్సెస్ లకు దోహదపడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేవలం స్టార్ హీరోలపై ఆధారపడే భారీ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా, కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న కథలను కూడా గీతా ఆర్ట్స్ ప్రోత్సహించడం ప్రత్యేకతగా మారింది.
ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన కథలను సెలెక్ట్ చేయడం ద్వారా ఆ బ్యానర్ ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంటోంది. ఏదేమైనా సరైన ప్లాన్, మంచి కథల ఎంపిక, టాలెంటెడ్ క్యాస్టింగ్ తో కలిసి పనిచేయడం, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల సినిమాలు హిట్స్ అవ్వడంతో పాటు అవార్డులు సాధించడానికి అసలు కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆ బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ చిత్రాలు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.