టాప్ స్టోరి: ఆర్థిక వివాదాలతో సర్వం నాశనమైన డైరెక్టర్.. ఔత్సాహిక ఫిలింమేకర్స్‌కి పాఠం!
ఇప్పుడు కోర్టు సమస్యను పరిష్కరించుకున్న ఈ దర్శకుడికి కెరీర్ పరంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.;
సినిమా నిర్మాణం అనేది కేవలం వెండితెరపై మెరిసే రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. అది కోట్లాది రూపాయల పెట్టుబడితో కూడిన క్లిష్టమైన వ్యాపారం. మన దేశంలో గొప్ప సృజనాత్మకత కలిగిన దర్శకులు కూడా ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్నప్పుడు వారి కెరీర్ ఏ విధంగా పతనం అవుతుందో చెప్పడానికి కోలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు స్పష్టమైన ఉదాహరణ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా దాదాపు 9ఏళ్ల తర్వాత విడుదలకు కోర్టు సమస్యను పరిష్కరించుకోవడం కొసమెరుపు. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతడు ఎదుర్కొన్న అడ్డంకులు ఆర్థిక వివాదాలు.. ఔత్సాహిక దర్శకులు నేర్చుకోవాల్సిన పాఠాలుగా మారాయని విశ్లేషిస్తున్నారు.
నిజానికి దర్శకుడి ప్రధాన విధి అద్భుతమైన కథను తెరపై గొప్పగా ఆవిష్కరించడం.. కానీ స్వయంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్నప్పుడు ఆ సృజనాత్మకత పూర్తిగా దెబ్బతింటుందని ఈ దర్శకుడి విషయంలో పదే పదే నిరూపణ అయింది. నిరంతరం అప్పులు, వడ్డీలు, కోర్టు నోటీసుల మధ్య నలిగిపోయే దర్శకుడు తన పనిపై ఏకాగ్రత చూపలేడు. ఇది వారి తదుపరి సినిమాల నాణ్యతను తగ్గించడమే కాకుండా.. మార్కెట్‌లో వారి విలువను కూడా పడిపోయేలా చేస్తుంది. సినిమాను పూర్తి చేయగలడు కానీ విడుదల చేయలేడు అనే ముద్ర పడితే.. పెద్ద హీరోలు లేదా నిర్మాతలు వారితో పని చేయడానికి వెనుకాడతారు. దీనివల్ల గౌతమ్ మీనన్ లాంటి ప్రతిభావంతులైన దర్శకుల కెరీర్‌లో ఐదు నుండి ఆరేళ్ల విలువైన సమయం వృధా అయిపోవడం పరిశ్రమకు తీరని లోటు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల దర్శకులు తమ అసలు శైలికి విరుద్ధంగా అనేక రాజీ పడాల్సి వస్తుంది. బడ్జెట్ కొరతతో సినిమాను హడావిడిగా ముగించడం లేదా ఇష్టం లేకపోయినా ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బు సంపాదించాల్సి రావడం వంటివి వారి గౌరవాన్ని దెబ్బతీస్తాయి. వందలాది మంది టెక్నీషియన్ల శ్రమతో కూడిన చిత్రం విడుదలకు నోచుకోక డబ్బాలో ఉండిపోయినప్పుడు కలిగే మానసిక ఒత్తిడి దర్శకుడి ఆత్మవిశ్వాసాన్ని కుంగదీస్తుంది. ఈ పరిస్థితులే చాలా మందిని పరిశ్రమకు దూరం చేస్తాయి లేదా వారిలోని అసలైన కళాకారుడిని చంపేస్తాయి.
ఇప్పుడు కోర్టు సమస్యను పరిష్కరించుకున్న ఈ దర్శకుడికి కెరీర్ పరంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు ఎదుర్కొన్న ఈ సవాళ్ల నుండి బయటపడటానికి న్యాయస్థానం చూపిన మార్గం చిత్ర పరిశ్రమకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్న చర్చ కూడా సాగుతోంది. పారదర్శకత కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవడం, కోర్టు పర్యవేక్షణలో ఆర్థిక లావాదేవీలు జరపడం వంటివి వ్యవస్థీకృత నిధులు లేని సినీ రంగంలో కొత్త సంప్రదాయానికి తెరలేపాయి. సినిమా విడుదలకు జూన్ 15 లోపు గడువు ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ సినిమా నిర్మాతలకు ఊపిరి పోసింది. చీకటి సొరంగం చివర వెలుగు కనిపిస్తోందని దర్శకుడు చాలా ఆశగా చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఇది నిజంగా ఒక పాఠం అని అంతా భావిస్తున్నారు.
భవిష్యత్తులో ఏ దర్శకుడూ ఇలాంటి సంక్షోభంలో పడకూడదంటే కేవలం మేకింగ్‌పైనే కాకుండా నిర్మాణ వ్యయ నియంత్రణపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. కార్పొరేట్ ఫండింగ్ .. పక్కా ఇన్సూరెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఇలాంటి అప్పుల తిప్పలను నివారించవచ్చు. ప్రతిభ ఉన్న దర్శకులు కేవలం సృజనాత్మకతకే పరిమితమై.. నిర్మాణ బాధ్యతలను ప్రొడక్షన్ హౌస్‌లకు వదిలేయడం లేదా ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవడం ద్వారా తమ కెరీర్‌ను సురక్షితం చేసుకోవచ్చని ఈ కోలీవుడ్ పాపులర్ దర్శకుడి ఉదంతం ఒక పాఠంలా నేర్పుతోందని కోలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రతి దర్శకుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తడానికి వెనకాడటం లేదు. అంతా సవ్యంగా సాగితే సరే కానీ .. ఆర్థికపరమైన అంశాల్లో చిక్కుల్లో పడినప్పుడు అది తీవ్ర రూపం దాలుస్తోంది. భారీ లాభాలు, డబ్బు గురించే ఆలోచించకుండా.. దర్శకులు పూర్తిగా సృజనాత్మక అంశాలపై మాత్రమే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.