గరివిడి లక్ష్మి...ఆమె ఒక సంచలనం !

గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా అదే పేరుతో ఒక సినిమా ప్రస్తుతం రాబోతోంది.

Update: 2026-10-11 22:30 GMT

గరివిడి లక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా అదే పేరుతో ఒక సినిమా ప్రస్తుతం రాబోతోంది. నిజానికి ఆ స్థాయికి చేరుకోవడం గొప్ప విశేషంగా చెప్పాలి. పైగా ఆమె ఎంచుకున్న కళకు కూడా అంతే గౌరవం దక్కినట్లుగా భావించాలి. ఈ తరానికి తెలియదు కానీ ఒకనాడు ఆంధ్ర దేశంలో హరి కధలు బుర్ర కధలు అత్యంత ప్రజాదరణ పొందుతూ వచ్చేవి. ఇవి అచ్చమైన జానపద కళలుగా ఉంటూ జనాలకు చేరువ అయ్యేవి. గంటల తరబడి వేదిక మీద నిలబడి ఆసువుగా పద్యాలు కానీ గేయాలు గీతాలు కానీ పాడుతూ మధ్య మధ్యలో వర్తమాన వ్యవహారాలను చేరుతూ ప్రేక్షకులను కట్టి పడేయడం అంటే మామూలు విషయం కాదు. తమ గొంతుకతో తమ గానంతో తమ మాటల చాతుర్యంతో తమదైన కళా విన్యాసంతో అశేషమైన ప్రేక్షకులను హరికధ బుర్ర కధ కళాకారులు సంపాదించుకున్నారు.

విజయనగరం పెట్టింది పేరు :

కళలకు విజయనగరం పెట్టింది పేరు. దాని అసలు పేరు విద్యల నగరం. పూసపాటి రాజులు వందల ఏళ్ల నుంచి కళలను పోషించారు , ఎంతో మంది కళాకారులను సమాదరించారు. ఎన్నో సంగీత సాహిత్య కళా భవనాల నిర్మాణానికి కూడా వారు చేయూతను ఇచ్చారు. అలా వెనకటి తరంలో హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు విజయనగరం నుంచే వచ్చారు. ఇక ఆ తరువాత బుర్ర కధ కళాకారులు కూడా అక్కడ నుంచే వచ్చి ఆంధ్రదేశమంతా తమ కళా ప్రాభవాన్ని చాటుకున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే బుర్ర కధ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే మొదటి పేరు కుమ్మరి మాస్టారు. ఆయన అసలు పేరు దారా అప్పల నారాయణ. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కోడిదేవుపల్లిలో పుట్టిన ఆయన బుర్ర కధను రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రుల వద్ద కూడా ఆయన బుర్ర కధా గానాన్ని చేసి ప్రశంసలు అందుకున్నారు.

తొంబై దశకంలో :

ఇదిలా ఉంటే కుమ్మరి మాస్టర్ ప్రభ వెలిగిపోతున్న రోజులలో ఎంతో మంది బుర్ర కధను చెబుతూ ముందుకు వచ్చినా ఆయన ముందు రాణించలేకపోయారు. అయితే 1990 దశకంలో ఒక మహిళ బుర్ర కధ కళాకారిణిగా ముందుకు రావడం సాహసమే కాదు అతి పెద్ద విశేషం. ఆమె పేరే రెడ్డి విజయలక్ష్మి. అదే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని గెడ్డపువలసలో రెడ్డి విజయలక్ష్మి జన్మించింది. ఆమె బుర్ర కధలు చెబుతూ కాల గమనంలొ గరివిడి లక్ష్మిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఆనాడు ఆమె బుర్ర కధలకు జనాలు విరగబడి వచ్చే వారు అంటే అతిశయోక్తి కాదు. పురుషులు ఎక్కువగా బుర్ర కధలు చెప్పే ఈ రంగంలో గరివిడి లక్ష్మి రావడమే కాదు దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. ఏడాదిలో మూడు వందల అరవై రోజులూ ఆమె ప్రదర్శనలు ఉండేవి అంటే ఎంత బిజీగా ఆమె గడిపిందో అర్ధం చేసుకోవాల్సిందే.

ఒక బ్రాండ్ గా మారి :

అలా పురుషాధిక్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించి అగ్ర శ్రేణి కళాకారిణిగా నిలవబట్టే ఈ రోజున గరివిడి లక్ష్మి పేరుతో సినిమా వస్తోంది. ఆమె కేవలం బుర్ర కధను మాత్రమే చెప్పడం కాదు పాటలు మధ్యలో హాస్యం ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. గరివిడి లక్ష్మి పాడిన చందమామా, ఓ అత్తరు సాయిబో, నల్లజీలకర్ర మొగ్గ, రాత్రి నల్లోడా, పాలకొండ ఎళ్లిపోతా వంటి పాటలు ఆనాటియువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె బుర్ర కధలు అలాగే పాటలు కూడా మూడు దశాబ్దాల క్రితమే ఆడియో క్యాసెట్లుగా వచ్చి పెద్ద ఎత్తున అమ్ముడు అయ్యాయి అంటే గరివిడి లక్ష్మి క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే. బుర్ర కధ కళాకారులలో ఆమె ఒక బ్రాండ్ గా నిలిచి గెలిచారు అని చెప్పాలి.

సినిమాల్లో సైతం :

ఇక గరివిడి లక్ష్మి రెండు దశాబ్దాల క్రితమే సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో 2012లో వచ్చిన పీపుల్స్ వార్ చిత్రంలో ఆమె ఒక పాట పాడటంతో పాటు చిన్న పాత్రలో నటించారు. దీనికి ముందు 2004 లో ఆయన రూపొందించిన చిత్రం గంగమ్మ జాతరలో కూడా ఒక పాటను గరివిడి లక్ష్మి ఆలపించారు. ఇదిలా ఉంటే 2026లో ఆమె జీవితాధారంగా గౌరీ నాయుడు జమ్ము రూపొందించిన గరివిడి లక్ష్మి కోసం ఉత్తరాంధ్రా వాసులు ప్రత్యేకించి విజయనగరం ప్రజలు ఎంతో ఆసక్తిగ ఎదురుచూస్తున్నారు. గరివిడి లక్ష్మి మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. ఇందులో గరివిడి లక్ష్మి పాత్రను ఆనంది పోషించారు.

Tags:    

Similar News