భారతదేశాన్ని భారీ యానిమేషన్ హబ్‌గా తీర్చిదిద్దే ప్లాన్?
కొన్ని ప్రయివేట్ యానిమేషన్ శిక్షణ సంస్థలతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ `రావణ - ది లాస్ట్ బ్యాటిల్ విత్ శ్రీరామ` అనే భారీ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందిస్తోంది.;
భారతీయ యానిమేషన్ రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. కొన్ని ప్రయివేట్ యానిమేషన్ శిక్షణ సంస్థలతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ `రావణ - ది లాస్ట్ బ్యాటిల్ విత్ శ్రీరామ` అనే భారీ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి విద్యార్థి నేతృత్వంలోని (స్టూడెంట్స్ తెరకెక్కిస్తారు) థియేట్రికల్ ఫీచర్ చిత్రంగా రికార్డు సృష్టించబోతోంది. వినోద పరిశ్రమ - విద్యా రంగాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ.. విద్యార్థులను నేరుగా ఒక అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులో భాగస్వాములను చేయడం ఈ చిత్ర నిర్మాణ ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన అంశం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన `ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా` (FTII) సహకారం అందిస్తోంది. FTII ఈ చిత్రానికి సృజనాత్మక మార్గదర్శిగా వ్యవహరిస్తూ.. ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. యానిమేషన్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ స్థాయి శిక్షణతో పాటు.. వృత్తిపరమైన నిపుణుల పర్యవేక్షణలో పనిచేసే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తోంది. కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు ఒక భారీ ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా అత్యున్నత నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు.
సాంకేతిక పరంగా ఈ చిత్రం సరికొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థులకు ఇది ప్రయోగశాట అనడంలో తప్పేమీ లేదు. అత్యాధునిక హైబ్రిడ్ AI - 3D యానిమేషన్ సాంకేతికతను ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథాంశం విషయానికి వస్తే.. వాల్మీకి మహర్షి రచించిన అసలైన `శ్రీమద్ వాల్మీకి రామాయణం` ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. రావణుడిని కేవలం ఒక ప్రతినాయకుడిగానే కాకుండా అతనిలోని సంక్లిష్టమైన , లోతైన పార్శ్వాలను కూడా ఆవిష్కరించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతీయ పురాణాలను ఆధునిక ప్రేక్షకులకు సరికొత్త కోణంలో పరిచయం చేయబోతోంది.
గతంలో లిటిల్ కృష్ణ, లిటిల్ సింగం వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ యానిమేషన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఐఐఎం బెంగళూరు మద్దతు ఉన్న పాపులర్ యానిమేషన్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో పనిచేసే విద్యార్థులు తమ చదువు పూర్తి చేసే సమయానికి వృత్తిపరమైన `ప్రొడక్షన్ క్రెడిట్స్`ను సొంతం చేసుకుంటారు. ఇది వారిని గ్లోబల్ యానిమేషన్ మార్కెట్‌కు సరికొత్త సృజనాత్మక శక్తిగా సిద్ధం చేస్తుంది. భారతదేశాన్ని యానిమేషన్ స్టోరి టెల్లింగ్ కి ప్రపంచ కేంద్రంగా మార్చగల సామర్థ్యం ఈ తరహా ప్రాజెక్టులకు ఉందని ఈ సంస్థల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2027 వేసవిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత బుల్లితెర తో పాటు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా. 2025లో వస్తున్న ఇండో-జపనీస్ యానిమేషన్ తో పోటీపడుతూ 2026 నాటి భారీ బడ్జెట్ లైవ్-యాక్షన్ చిత్రాల కేటగిరీలో మన భారతీయ విద్యార్థులు రూపొందించిన `రావణ`కు ప్రత్యేక గుర్తింపు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే తెలంగాణ ప్రభుత్వాలు హైదరాబాద్ లో భారీ యానిమేషన్ హబ్ రూపకల్పనకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం తెలుగు రాష్ట్రాల యువత కోసం ఈ యానిమేషన్ హబ్ ని మరింత పటిష్ఠంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యానిమేషన్ రంగం సహా వినోద రంగంలో మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే లక్ష్యంగా ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఎఫ్.టి.టి.ఐ సంయుక్త సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని బృహత్తర ప్రాజెక్టులను చేపడితే అది ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని మెట్రో నగరాలతో అనుసంధానించి యానిమేషన్ రంగాన్ని విస్తరించాలి. ఈ రంగంలోకి రావాలనుకునే ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించాలి. భారతదేశాన్ని అతి పెద్ద యానిమేషన్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో ఇది భాగం కావాలి.