ఫ్రాంచైజ్ సినిమాలు: ఆల్రెడీ హిట్ట‌యిన వాటిపై సేఫ్ బెట్‌నా? లేక క్యాలిక్యులేటెడ్ రిస్కునా?

ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఒక కొత్త కథతో ప్రేక్షకుడి ముందుకు రావడం కంటే అప్పటికే హిట్టయిన ప్రపంచాన్ని ఫ్రాంఛైజీగా లేదా సినిమాటిక్ యూనివ‌ర్శ్ గా కొనసాగించడమే అత్యంత సులువైన మార్గంగా కనిపిస్తోంది.

Update: 2026-08-24 22:30 GMT

ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఒక కొత్త కథతో ప్రేక్షకుడి ముందుకు రావడం కంటే అప్పటికే హిట్టయిన ప్రపంచాన్ని ఫ్రాంఛైజీగా లేదా సినిమాటిక్ యూనివ‌ర్శ్ గా కొనసాగించడమే అత్యంత సులువైన మార్గంగా కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న చిత్రాలను గమనిస్తే ఎక్కువ భాగం సీక్వెల్స్, ఫ్రాంచైజ్ చిత్రాలే ముందు వరుసలో నిలుస్తున్నాయి. కొత్త కథలకు ప్రేక్షకుడిని మొదటి నుంచి పరిచయం చేయాల్సి వస్తే.. ఫ్రాంచైజీకి ఆ పనిని మొదటి భాగమే ముందే పూర్తి చేసి ఉంటుంది. అప్ప‌టికే ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్లు, కథా ప్రపంచం ఉండటం వల్ల ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తి పెరిగి.. ప్రమోషన్ వ్యయం కూడా భారీగా తగ్గుతుంది. అందుకే ప్రొడ్యూసర్లకు ఇది మొదటి చూపులోనే ఒక సేఫ్ బెట్‌లా కనిపిస్తోంది.

వ్యాపార కోణంలో చూస్తే ఫ్రాంచైజ్ మోడల్ నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్లకు ఒక బలమైన సేఫ్టీ నెట్‌ను అందిస్తుంది. మొదటి భాగం ఘనవిజయం సాధిస్తే.. రెండో భాగానికి సంబంధించిన థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ హక్కులు విడుదలకు ముందే భారీ ధరలకు అమ్ముడవుతాయి. బయర్స్ కూడా ఆల్రెడీ ప్రూవైన‌ బ్రాండ్‌పై పెట్టుబడి పెట్టడానికి వెనుకాడరు. దీనికి తోడు స్టార్ హీరో ఇమేజ్.. సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ ఇమేజ్ కలిస్తే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమవుతాయి. ఒకప్పుడు హాలీవుడ్‌కే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు భారతీయ చిత్రసీమలో బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, స‌లార్, క‌ల్కి 2898 ఏడి, స్త్రీ, దురంధ‌ర్‌ సినిమాలతో పాటు ఎల్‌సియు, YRF స్పై యూనివర్స్ వంటి మోడళ్లతో బిలియన్ డాలర్ల వ్యాపారంగా రూపాంతరం చెందింది.

అయితే ఈ ఫ్రాంచైజ్ మోడల్ కేవలం లాభాల బాట మాత్రమే కాదు.. అందులో రెండు వైపులా పదునున్న కత్తి లాంటి ప్రమాదం కూడా దాగి ఉంది. మొదటి భాగం సాధించిన విజయం సీక్వెల్‌పై ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఒకవేళ రెండో భాగం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైతే నిరాశ అంతకంటే దారుణంగా ఉంటుంది. కేవలం మొదటి సినిమా జ్ఞాపకాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలవు కానీ కథలో కొత్తదనం లేకపోతే.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మేకింగ్ క్వాలిటీ లేక‌పోతే సినిమాను కాపాడలేవు. పార్ట్-2 ప్లాప్ అయితే అది కేవలం ఆ ఒక్క సినిమాకే కాకుండా మొత్తం ఫ్రాంచైజ్ బ్రాండ్ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బతీసి భవిష్యత్తు భాగాల అవకాశాలను మూసివేస్తుంది.

ఈ ఫ్రాంచైజ్ విప్లవం పరిశ్రమలోని క్రియేటివిటీకి కూడా పెద్ద సవాలుగా మారుతోంది. నిర్మాతలు, ఫైనాన్సియర్లు కేవలం రిస్క్ తగ్గించుకునే ఆలోచనతో సీక్వెల్స్- యూనివర్స్‌ల వెనుకే పడితే సరికొత్త కథలు.. కొత్త దర్శకుల ప్రయోగాత్మక ఆలోచనలకు అవకాశాలు తగ్గిపోయే ముప్పు ఉంది. ప్రశాంతమైన కథా విస్తరణకు బదులుగా ప్రతి హిట్ సినిమాకు బలవంతంగా సీక్వెల్ ప్రకటిస్తున్న ధోరణి వల్ల క్రియేటివ్ ఫ్రీడమ్ పరిమితమై సినిమాలు ఒకే మూసలో తయారయ్యే ప్రమాదం ఉందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

అంతిమంగా ఫ్రాంచైజ్ సినిమా అనేది సులువైన సేఫ్ బెట్‌ కానే కాదు. అది ఇప్పటికే ప్రూవ్ అయిన విజయంపై మరింత పెద్ద పెట్టుబడి పెట్టే అత్యంత సమర్థవంతమైన క్యాలిక్యులేటెడ్ రిస్కు మాత్రమే. మొదటి భాగం తెచ్చిపెట్టిన ఉచిత పబ్లిసిటీ ప్రారంభ కలెక్షన్లను అందించవచ్చు కానీ.. ఆ తర్వాత థియేటర్లలో సినిమా నిలబడాలన్నా.. బ్రాండ్ వాల్యూ కొనసాగాలన్నా ఫ్రాంచైజ్ వెనుక బలమైన కథ.. స్పష్టమైన కథనం ఉండాల్సిందే. గతాన్ని గౌరవిస్తూనే భ‌విష్య‌త్ లో రాబోవు భాగానికి సరికొత్త ఎమోషన్‌ను అందించినప్పుడే ఏ ఫ్రాంచైజీ అయినా కాలపరీక్షకు నిలబడగలదు.

బాహుబ‌లి 3, పుష్ప 3, దురంధ‌ర్ 3 వంటి సీక్వెల్స్ తెర‌కెక్కించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దృశ్యం 4 ని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఇవేవీ బ‌ల‌వంత‌పు కొన‌సాగింపు క‌థ‌ల‌తో కాకుండా, వంద‌శాతం స‌రిపోయే యాప్ట్ క‌థ‌ల‌తో చేసే ప్ర‌య‌త్నాలు అయితేనే అవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌ల‌వు. ఫ్రాంఛైజీ లేదా సినిమాటిక్ యూనివ‌ర్శ్ క్రేజ్ ని ఎన్‌క్యాష్ చేసుకోవ‌డానికి మాత్ర‌మే సినిమాలు చేయ‌కూడ‌దు. మునుప‌టి క‌థ‌కు క‌నెక్ష‌న్ ఉన్న‌ వాస్త‌విక‌ క‌థ‌తో క‌నెక్టెడ్‌ క‌థ‌ల్ని మాత్ర‌మే ద‌ర్శ‌కులు తెర‌కెక్కించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News