గ్లామర్ ప్రపంచం వెనుక చీకటి నిజం: ఒకప్పుడు ఏలిన నటి నడిరోడ్డుపై బెగ్గర్‌గా!
సినీ పరిశ్రమ అనేది దూరం నుంచి చూసేవారికి ఎంతో విలాసవంతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే నటీనటులకు లభించే స్టార్‌డమ్, డబ్బు, కీర్తి ప్రతిష్టలను చూసి చాలామంది ఈ గ్లామర్ ఫీల్డ్ వైపు ఆకర్షితులవుతుంటారు.
సినీ పరిశ్రమ అనేది దూరం నుంచి చూసేవారికి ఎంతో విలాసవంతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే నటీనటులకు లభించే స్టార్‌డమ్, డబ్బు, కీర్తి ప్రతిష్టలను చూసి చాలామంది ఈ గ్లామర్ ఫీల్డ్ వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ వెలుగుల వెనుక ఎవరూ ఊహించని ఎన్నో చీకటి నిజాలు, గుండెల్ని పిండేసే విషాద గాథలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు వెండితెరపై వెలిగిపోయి భారీ చిత్రాలలో నటించిన ఒక ప్రముఖ నటి.. కాలక్రమేణా మతిస్థిమితం కోల్పోయి వీధుల్లో అడుక్కుంటూ పోలీసులకు దొరికిన హృదయవిదారక ఘటన చిత్ర పరిశ్రమలోని అస్థిరతకు అద్దం పడుతోంది.
ఒకప్పుడు సినిమా అవకాశాలతో లగ్జరీ జీవితాన్ని గడిపిన ఈ నటి కాలం కలిసిరాక చిత్ర పరిశ్రమకు క్రమంగా దూరమైంది. సరైన ఆర్థిక స్థోమత లేకపోవడం.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్రమైన ఒడిదొడుకుల కారణంగా చివరికి తీవ్ర సంఘర్షణకు గురై మెంటల్ సమస్యల్ని ఎదుర్కొంది. ముంబై వీధుల్లో అత్యంత దయనీయ స్థితిలో చిరిగిన బట్టలతో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్న ఆమెను స్థానిక పోలీసులు గుర్తించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ని అలా గుర్తుపట్టలేనంత స్థితిలో రోడ్డుపై చూసిన పోలీసులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీస్తున్న ఆ నటి పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే మానవత్వంతో స్పందించారు. ఆమెకు కనీస అవసరాలైన ఆహారం, బట్టలు అందించి ప్రాథమిక సహాయం చేశారు. అనంతరం తన మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు.. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను కోర్టు అనుమతితో ఆమెను ఒక ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ నటికి చికిత్స అందుతోంది.
చిత్ర పరిశ్రమలో ఇటువంటి విషాదాలు కొత్తేమీ కావు. గతంలోనూ ఎంతోమంది తారలు, దర్శకులు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించి ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేక... ఉన్న డబ్బును కోల్పోయి రోడ్డున పడ్డ సందర్భాలు అనేకంఉన్నాయి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, ఇండస్ట్రీలో ఒంటరితనం, .. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని విశ్లేషిస్తుంటారు. సక్సెస్ ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకునే ఈ రంగుల ప్రపంచం.. పరాజయం ఎదురైనప్పుడు ఎంతటి దారుణమైన ఒంటరితనంలోకి నెట్టేస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ నటి భోజ్ పురి పరిశ్రమకు చెందిన నటి. పేరు మిథాలి శర్మ. ముంబై లోఖండ్ వాలా పరిసరాల్లో అడుక్కుంటూ కనిపించడం హృదయాలను కలచివేసింది.
ఈ హృదయవిదారక ఉదంతం సోషల్ మీడియాలో.. సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతటి స్టార్ హోదా ఉన్నా.. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడం కష్టమనే నిజాన్ని ఈ నటి జీవితం గుర్తుచేస్తోంది. నటీనటులు కేవలం గ్లామర్ - సంపాదనపైనే కాకుండా, తమ మానసిక ఆరోగ్యం , భవిష్యత్తు ఆర్థిక భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.