సినిమా నైతికత - బాలల హక్కులపై సంచలన నిర్ణయం!
సినిమా రంగంలో సృజనాత్మకతకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో? సామాజిక నైతిక బాధ్యత కూడా అంతే ముఖ్యం.
సినిమా రంగంలో సృజనాత్మకతకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో? సామాజిక నైతిక బాధ్యత కూడా అంతే ముఖ్యం. ప్రముఖ జర్మన్ దర్శకుడు విమ్ వెండర్స్ పాత చిత్రం `రాంగ్ మూవ్` ను ప్రదర్శన సహా చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ సినిమా పరిశ్రమలో సరికొత్త చర్చకు తెరలేపింది. దశాబ్దాల క్రితం తానే స్వయంగా తీసిన చిత్రంలో ఉన్న ఓ వివాదాస్పద దృశ్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 1975లో విడుదలైన `రాంగ్ మూవ్` చిత్రంలో ప్రముఖ నటి నాస్తాస్జా కిన్స్కీ నటించారు.
ఆ సమయంలో ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. అయితే సినిమాలో ఆమెపై చిత్రీకరించిన ఒక నగ్న దృశ్యం ప్రస్తుతం నైతిక ప్రశ్నలను లేవనెత్తింది.
నాటి సామాజిక పరిస్థితులు, సినిమా నిర్మాణ పోకడలు ఎలా ఉన్నప్పటికీ.. మైనర్ బాలికపై అలాంటి దృశ్యాన్ని చిత్రీకరించడం ఘోర తప్పిదమని వెండర్స్ ఇప్పుడు గ్రహించారు. కాలం మారుతోన్న కొద్దీ మానవ హక్కులు, ముఖ్యంగా బాలల హక్కుల పట్ల సమాజంలో అవగాహన , సున్నితత్వం పెరిగాయి. విమ్ వెండర్స్ గత తప్పిదాన్ని బహిరంగంగా అంగీకరిస్తూ ఆ దృశ్యాన్ని అప్పట్లో చిత్రీకరించడం పెద్ద పొరపాటని అలా అసలు జరిగి ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సృజనాత్మక ప్రయాణంలో జరిగిన ఈ నైతిక లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ సినిమాను మార్కెట్ నుండి పూర్తిగా తొలగించారు.
గతంలో హాలీవుడ్ -యూరోపియన్ సినిమా పరిశ్రమల్లో మైనర్ నటీనటుల రక్షణ .. వారి మానసిక భద్రత విషయంలో కఠినమైన నిబంధనలు ఉండేవి కావు. కళాత్మక స్వేచ్ఛ .. వాస్తవికత పేరుతో అనేకసార్లు నైతిక పరిధులను దాటడం జరిగింది. కానీ నేటి ఆధునిక కాలంలో నటీనటుల భద్రతకు ముఖ్యంగా పిల్లల హక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత చిత్ర పరిశ్రమలో కోఆర్డినేటర్లు వంటి వ్యవస్థలు రావడం ఈ సానుకూల మార్పుకు నిదర్శనం. ఒక సృష్టికర్తగా తన సినిమాను ప్రజలకు దూరం చేయడం అంత సులువైన విషయం కాదు.
కానీ కళ కంటే మానవీయ విలువలు, నైతికత గొప్పవని నిరూపించడమే వెండర్స్ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం. తన కెరీర్ లోని ముఖ్యమైన సినిమాను పక్కన పెట్టడం ద్వారా ఆయన భవిష్యత్తు తరాల దర్శకులకు -చలనచిత్ర నిర్మాతలకు ఒక బలమైన సందేశాన్ని పంపినట్లు అయింది. కళ ఎప్పుడూ సమాజాన్ని చైతన్యపరచాలి. కానీ అది ఎవరికైనా నష్టం కలిగించేలా .. హక్కులను హరించేలా ఉండకూడదు. విమ్ వెండర్స్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పాత చిత్రాల పునసమీక్షకు మార్గం సుగమం చేస్తోంది. గతాన్ని మార్చలేకపోయినా? దాని నుండి నేర్చు కుని ప్రస్తుత సమాజానికి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పడం ప్రతి కళాకారుడి కనీస కర్తవ్యంగా గుర్తు చేస్తున్నారు.