రక్షణ కమిటీలున్నా గ్లామర్ ఇండస్ట్రీలో ఆగని కాస్టింగ్ కౌచ్ దారుణాలు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాల్లోని పలు ఫ్లాట్లు, లాడ్జీలు వేదికగా నకిలీ నిర్మాతలు, కోఆర్డినేటర్లు ఆడిషన్ల పేరిట అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
గ్లామర్ ప్రపంచంలో నాయికలుగా రాణించాలనే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేటగాళ్లు సాగిస్తున్న అరాచకాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక షాకింగ్ ఘటన కోలీవుడ్‌ను తీవ్రంగా కలవరపెట్టింది. ఒక సినిమా అవకాశం ఇస్తామంటూ నమ్మించి.. నగ్న ఫోటోషూట్‌కు బలవంతం చేసినందుకు గాను 65 ఏళ్ల తమిళ సినిమా నిర్మాత సహా ఇద్దరు మహిళా కెమెరామెన్లను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ఆడిషన్ పేరుతో ఒక లాడ్జిలో నటిపై జరిగిన ఈ వేధింపుల ఉదంతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలైన 31 ఏళ్ల సహాయ నటిని సదరు వ్యక్తి సినిమా నిర్మాతగా పరిచయం చేసుకుని.. కొత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశమిస్తామని ఆశ చూపించి ఆడిషన్స్ కోసం సాలిగ్రామంలోని ఒక లాడ్జికి పిలిపించాడు. అక్కడ ఒక దేవత పాత్ర కోసం శరీరంపై ఎటువంటి మచ్చలు ఉండకూడదంటూ.. ఒంటిపై బట్టలు లేకుండా ఫోటోలు తీయడానికి ఇద్దరు మహిళా ఫోటోగ్రాఫర్లు ఒత్తిడి చేశారు. దీంతో అనుమానం వచ్చిన నటి వారి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి.. వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన విరుగంబాక్కం పోలీసులు సదరు నిర్మాతను, అతడితో పాటు ఉన్న ఇద్దరు లేడీ ఫోటోగ్రాఫర్లను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వాస్తవానికి ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఘటనలు కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాలేదు. టాలీవుడ్ (తెలుగు), కోలీవుడ్ (తమిళ), శాండల్‌వుడ్ (కన్నడ), మాలీవుడ్ (మలయాళం) పరిశ్రమలలో ఇలాంటి మోసాలు నిత్యకృత్యంగా మారాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాల్లోని పలు ఫ్లాట్లు, లాడ్జీలు వేదికగా నకిలీ నిర్మాతలు, కోఆర్డినేటర్లు ఆడిషన్ల పేరిట అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. గతంలో కూడా పలువురు సహాయ నటీమణులు తమకు జరిగిన అన్యాయంపై నేరుగా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం... ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం వంటి వార్తా కథనాలు నిత్యం సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి.
సినిమా రంగంలో ఔత్సాహిక నటీమణులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు, పరిశ్రమ పెద్దలు ఎన్ని మహిళా కమిటీలు (హేమ కమిటీ తరహా ప్రత్యేక ప్యానెల్స్), న్యాయవ్యవస్థలను ఏర్పాటు చేసినా కాస్టింగ్ కౌచ్ భూతాన్ని పూర్తిగా అదుపు చేయలేకపోతున్నారు. పరిశ్రమలో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించే యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లైంగిక దోపిడీకి పాల్పడే ఇలాంటి ముఠాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న అంతర్గత లాబీయింగ్... భయాల వల్ల చాలా మంది బాధితులు పోలీసుల వరకు వెళ్లలేకపోవడం కూడా ఈ నేరస్థులకు వరంగా మారుతోంది.
ఈ తరహా వేధింపులకు శాశ్వత అడ్డుకట్ట పడాలంటే సినిమా పరిశ్రమలో అధికారిక, పారదర్శకమైన కాస్టింగ్ ఏజెన్సీల ద్వారా మాత్రమే ఆడిషన్స్ జరిగేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. లాడ్జీలు లేదా ప్రైవేట్ గదులలో జరిగే అనుమానాస్పద ఆడిషన్ల విషయంలో ఔత్సాహిక నటీమణులు కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడే నిందితులకు కోర్టుల ద్వారా వేగంగా... కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నప్పుడే గ్లామర్ రంగంలో మహిళలకు నిజమైన భద్రత లభిస్తుంది.