ఒకే ఫ్రాంచైజీ.. మలయాళంలో కంటిన్యూ.. తెలుగులో క్లోజ్.. హిందీలో లాస్ట్!
కథలోని ట్విస్టుల కంటే.. ఫ్రాంచైజీ ఫ్యూచర్ పై మేకర్స్, హీరోలు తీసుకుంటున్న డెసిషన్సే ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి.
ఇండియన్ సినీ హిస్టరీలో ఆడియన్స్ ను కథతోనే కాకుండా, తమ అంచనాలతో కూడా ఆడుకున్న ఫ్రాంచైజీల్లో దృశ్యంకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకే కథా ప్రపంచం నుంచి వచ్చిన ఈ సిరీస్ మలయాళం, తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ మూడు వెర్షన్లు సీక్వెల్స్ విషయంలో తీసుకుంటున్న డెసిషన్స్ మాత్రం ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. కథలోని ట్విస్టుల కంటే.. ఫ్రాంచైజీ ఫ్యూచర్ పై మేకర్స్, హీరోలు తీసుకుంటున్న డెసిషన్సే ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి.
మలయాళంలో మాత్రం దృశ్యం జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో భాగానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దృశ్యం4 పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో జార్జ్‌కుట్టి కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోహన్‌లాల్ మరోసారి అదే పాత్రలో కనిపించనుండటం ఫ్యాన్స్ లో అంచనాలను పెంచుతోంది. ఈ వెర్షన్‌లో ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లాలనే స్పష్టమైన ఆలోచన కనిపిస్తోంది.
ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన దృశ్యంకు మంచి ఆదరణ లభించినప్పటికీ.. మూడో భాగంతో ఈ కథకు ముగింపు పలకాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే హిందీలో దృశ్యం3నే ఆఖరి చాప్టర్ గా చూడాల్సి రావచ్చు. తెలుగులో అయితే మరో రకమైన పరిస్థితి కనిపిస్తోంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం, దృశ్యం2 సినిమాలు ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ, ఈ సిరీస్‌ను ఇకపై కంటిన్యూ చేసేందుకు ఆయన ఆసక్తిగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగులో దృశ్యం2 తోనే ఈ ఫ్రాంచైజీకి ముగింపు పడినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ పార్ట్ థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజవడం కూడా ఈ వెర్షన్ జర్నీలో ప్రత్యేక అంశంగా నిలిచింది.
మొత్తంగా చూస్తే.. ఒకే ఫ్రాంచైజీకి మూడు భాషల్లో మూడు భిన్నమైన భవిష్యత్తులు కనిపిస్తున్నాయి. మలయాళంలో కథ కంటిన్యూ అవుతుంటే.. హిందీలో ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే తెరపడినట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో జీతూ జోసెఫ్‌తో భారీ యాక్షన్ థ్రిల్లర్లు చేయాలనే ఆసక్తి హీరోల్లో ఉన్నప్పటికీ, దృశ్యం లాంటి లిమిటెడ్ బడ్జెట్ ఫ్రాంచైజీపై అదే ఉత్సాహం లేదనే డిస్కషన్ కూడా మొదలైంది. అందుకే ఇప్పుడు దృశ్యంలో అసలు ట్విస్ట్ కథలో కాదు.. ఒకే ఫ్రాంచైజీకి మూడు భాషల్లో ఏర్పడిన మూడు భిన్న నిర్ణయాల్లోనే ఉందని చెప్పొచ్చు.