హైద‌రాబాద్‌లో అన్ని బ్యాండ్ పార్టీల‌ను ట‌చ్ చేసారు: దిల్ రాజు

దర్శకుడు ఆదిత్య గురించి దిల్ రాజు మాట్లాడుతూ .. అత‌డి నేపథ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.;

Update: 2026-03-25 17:06 GMT

ఆశిష్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న‌ చిత్రం `దేత్తడి`. ఈ సినిమా గ్లింప్స్ విడుదల వేడుకను హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా విశేషాలపై మాట్లాడుతూ.. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య, హీరో ఆశిష్ ఈ ప్రాజెక్ట్ కోసం పడిన కష్టాన్ని కొనియాడారు. కేవలం వినోదం కోసమే కాకుండా.. హైదరాబాద్‌లోని అసలైన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

దర్శకుడు ఆదిత్య గురించి దిల్ రాజు మాట్లాడుతూ .. అత‌డి నేపథ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదిత్య హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ పూర్తి చేసినా.. తన మూలాలను మర్చిపోకుండా ఇక్కడి నేల మీద ఉన్న మక్కువతో తిరిగి వచ్చి ఈ సినిమా కథను రాశారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ గల్లీల్లో వినిపించే బ్యాండ్ శబ్దాలు, ఇక్కడి పండుగల్లో ఉండే ఉత్సాహం ఆదిత్యను బాగా ప్రభావితం చేశాయని.. ఆ ప్రేరణతోనే ఒక బ్యాండ్ కొట్టే కుర్రాడి జీవితంలోని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేశారని దిల్ రాజు వెల్లడించారు.

ఈ సినిమా కోసం జరిగిన పరిశోధన గురించి దిల్ రాజు ఆసక్తికర విషయాలు చెప్పారు. గడిచిన ఏడాది కాలంగా ఆదిత్య - ఆశిష్ ద్వ‌యం హైదరాబాద్‌లోని దాదాపు అన్ని బ్యాండ్ పార్టీల చుట్టూ తిరిగారని ఆయన తెలిపారు. ఇక్కడి ఎల్లమ్మ లగ్గం, బోనాలు, వినాయక చవితి, సదర్ వంటి ప్రతి వేడుకలో బ్యాండ్ కళాకారుల పాత్ర ఎంత ఉంటుందో.. వారి జీవితాల్లో ఉండే సాధకబాధలు ఏమిటో తెలుసుకుని ఈ స్క్రిప్ట్‌ను ఎంతో నిజాయితీగా తయారు చేశారని ప్రశంసించారు. ఈ క్రమంలోనే సుమారు 600 మంది బ్యాండ్ కళాకారులు స్వచ్ఛందంగా ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చి మద్దతు తెలపడం మ‌రో విశేషం.

హీరో ఆశిష్ ఈ పాత్ర కోసం తీసుకున్న శిక్షణను దిల్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా.. ఒక ప్రొఫెషనల్ బ్యాండ్ ప్లేయర్ లాగా కనిపించేందుకు ఆశిష్ గత ఏడాది కాలంగా కఠినంగా శ్ర‌మించార‌ని చెప్పారు. అసలు బ్యాండ్ ఎలా కొట్టాలి? అందులో ఎన్ని రకాల రిథమ్స్ ఉంటాయి! వివిధ సందర్భాల్లో బ్యాండ్ స్టైల్ ఎలా మారుతుంది వంటి సాంకేతిక అంశాలను కూడా ఆశిష్ క్షుణ్ణంగా నేర్చుకున్నారని.. ఈ డెడికేషన్ సినిమా స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ చిత్రం హైదరాబాద్ స్థానిక సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిత్యతో పాటు రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ స్క్రిప్ట్‌ను మరింత పక్కాగా తీర్చిదిద్దారని.. జునేద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అచ్చమైన హైదరాబాద్ కల్చర్‌ను.. ఇక్కడి ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా `దేత్తడి` సినిమా ఉండబోతోందని.. ఈ క్రమంలో చిత్ర యూనిట్ చేస్తున్న ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తన ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News