ప్రయోగం విఫలమై 1350 కోట్ల నష్టం.. సూపర్‌స్టార్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్!
భారీ సాహసవిన్యాసాలు.. గాల్లో భీకరమైన పోరాటాలు.. విమానాల్లోంచి జంప్ లు.. అదిరిపోయే యాక్షన్ విన్యాసాలతో కట్టి పడేసే హాలీవుడ్ దిగ్గజ హీరో టామ్ క్రూజ్ ఈసారి భారీ ప్రయోగానికి దిగాడు.
భారీ సాహసవిన్యాసాలు.. గాల్లో భీకరమైన పోరాటాలు.. విమానాల్లోంచి జంప్ లు.. అదిరిపోయే యాక్షన్ విన్యాసాలతో కట్టి పడేసే హాలీవుడ్ దిగ్గజ హీరో టామ్ క్రూజ్ ఈసారి భారీ ప్రయోగానికి దిగాడు. కానీ ఈ ప్రయోగం ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీని నష్టం దాదాపు 1350 కోట్లు. ఆ మేరకు వార్నర్ బ్రదర్స్ తన హిస్టరీలోనే అతి పెద్ద ఫ్లాప్ ని మూటగట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ - ఆస్కార్ అవార్డు గ్రహీత అలెజాండ్రో ఇనారిట్టు కలయికలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం `డిగ్గర్` బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ ఏకంగా 125 నుండి 150 మిలియన్ డాలర్ల నిర్మాణ వ్యయంతో పాటు మరో 100 మిలియన్ డాలర్ల మార్కెటింగ్ ఖర్చుతో తెరకెక్కించిన ఈ డార్క్ ఎకో-సెటైర్ చిత్రం.. స్టూడియో చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 మిలియన్ డాలర్ల డెబ్యూతో సరిపెట్టుకున్న ఈ సినిమా.. స్టూడియోకు ఏకంగా 150 మిలియన్ డాలర్ల (1350 కోట్లు) మేర నష్టాన్ని మిగుల్చుతుందని డెడ్‌లైన్ నివేదిక అంచనా వేసింది.
ఈ చిత్రంలో టామ్ క్రూజ్ విభిన్నమైన లుక్‌లో డిగ్గర్ రాక్‌వెల్ అనే పిచ్చివాడైన బిలియనీర్ ఆయిల్ టైకూన్ పాత్రలో కనిపించారు. గ్రీన్‌ల్యాండ్‌లో అతడు చేసిన ప్రమాదకరమైన డ్రిల్లింగ్ ఆపరేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విపత్తు సంభవించడం.. దానిని కప్పిపుచ్చుకోవడానికి అతడు చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథాంశం. రిజ్ అహ్మద్, జాన్ గుడ్‌మాన్, శాండ్రా హులర్ వంటి భారీ తారాగణం ఉన్నా సినిమా కథనం గందరగోళంగా ఉండటం.. ఆశించిన కిక్కు లేకపోవడంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.
టామ్ క్రూజ్ కెరీర్‌లోనే గత రెండు దశాబ్దాలలో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా `డిగ్గర్` నిలిచింది. 3,300లకు పైగా నార్త్ అమెరికన్ స్క్రీన్‌లపై అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా.. కేవలం 8 మిలియన్ డాలర్ల దేశీయ వసూళ్లను మాత్రమే సాధించింది. మామూలుగా యాక్షన్ ఫ్రాంచైజీలు.. హై-ఫ్లయింగ్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించే టామ్ క్రూజ్ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి భారీ ప్రయోగానికి తెరలేపడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సల్మాన్ ఖాన్ `ట్యూబ్‌లైట్` లేదా షారుఖ్ ఖాన్ `ఫ్యాన్` చిత్రాలు ఎలాంటి ప్రయోగాత్మక వైఫల్యాలను ఎదుర్కొన్నాయో.. హాలీవుడ్‌లో వార్నర్ బ్రదర్స్‌కు `డిగ్గర్` రూపంలో అలాంటి ఘటనే ఎదురైంది.
మరోవైపు ఈ భారీ వైఫలయం నుంచి తేరుకునేందుకు టామ్ క్రూజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గత ఆగస్టు 2026లో ఆయన తన క్లాసిక్ సినిమా సీక్వెల్ అయిన `డేస్ ఆఫ్ థండర్ 2`ను ప్రకటించారు. ప్రముఖ నటి ఆన్నా హాతవేతో కలిసి నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒరిజినల్ చిత్రం వచ్చి 38 ఏళ్లవుతున్న సందర్భంగా 2028 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.