కాపీ రైట్ యాక్ట్‌తో పాక్ గాయకుడికి న్యాయం.. అప్పట్లో ఛాన్సే లేదు!
బాలీవుడ్ సినిమా `దురంధర్` విషయంలో తాజా పరిణామం ఇందుకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు పాకిస్థానీ గాయకుడు హసన్ జహంగీర్ పాడిన `హవా హవా` పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.;
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కాపీరైట్ చట్టాలపై గతంలో సరైన అవగాహన ఉండేది కాదు. కానీ కాలక్రమేణా మారుతున్న నిబంధనలు.. ముఖ్యంగా లెజెండరీ కంపోజర్ ఇళయరాజా వంటి వారు తమ పాటల హక్కుల కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటం కారణంగా పరిశ్రమలో ఇప్పుడు సమూల మార్పులు కనిపిస్తున్నాయి. తన బాణీ కట్టిన ప్రతి పాటపై హక్కులు తనవేనని ఇళయరాజా కోర్టుల ద్వారా పోరాడుతుండటం, కొన్ని సందర్భాల్లో ఆయనకు అనుకూలంగా తీర్పులు రావడం వల్ల ఇప్పుడు సంగీత దర్శకులు, నిర్మాతలు కాపీరైట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
బాలీవుడ్ సినిమా `దురంధర్` విషయంలో తాజా పరిణామం ఇందుకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు పాకిస్థానీ గాయకుడు హసన్ జహంగీర్ పాడిన `హవా హవా` పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దశాబ్దాలు గడిచినా ఆ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ క్లాసిక్ సాంగ్‌ను తమ సినిమాలో రీమిక్స్ చేయడానికి `దురంధర్` చిత్ర బృందం పక్కాగా చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. కాపీరైట్ చిక్కుల్లో పడకుండా ఉండాలని ముందే నిర్ణయించుకుని.. ఒరిజినల్ కంపోజర్ నుంచి అధికారికంగా అనుమతి పొందింది.
ఈ క్రమంలో గాయకుడు హసన్ జహంగీర్‌కు ఈ పాట రైట్స్ కోసం చిత్ర నిర్మాతలు సుమారు 40 లక్షల రూపాయలు (సుమారు 50 వేల డాలర్లు) చెల్లించినట్లు సమాచారం. భారతీయ కరెన్సీలో ఇది 40 లక్షలైనా, పాకిస్థానీ రూపాయిల్లో దీని విలువ ఏకంగా 1.19 కోట్లకు సమానం. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పుడు నిర్మాతలు స్వయంగా గాయకుడిని పిలిచి మరీ రాయల్టీ చెల్లించడం సినిమా రంగంలో పెరిగిన బాధ్యతకు.. కాపీరైట్ చట్టాల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది.
గతంలో ఒక భాషలోని హిట్ సాంగ్‌ను మరో భాషలో వాడేటప్పుడు లేదా రీమిక్స్ చేసేటప్పుడు ఒరిజినల్ కంపోజర్‌కు ఎలాంటి క్రెడిట్ లేదా డబ్బులు ఇవ్వకుండానే పని కానిచ్చేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం.. అంతర్జాతీయ స్థాయిలో కాపీరైట్ నిబంధనలు కఠినతరం కావడంతో పరిస్థితి మారింది. మునుపటిలా కాపీరైట్ సమస్యలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా లేము! అని `దురంధర్` చిత్ర నిర్మాతలు ఈ చెల్లింపు ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దీనివల్ల అసలు సృష్టికర్తలకు సరైన గుర్తింపు, ఆర్థికంగా న్యాయం చేకూరింది.
`హవా హవా` పాట నేటికీ చార్ట్‌బస్టర్‌గా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. హసన్ జహంగీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రస్తుతం పరిశ్రమలో అమలవుతున్న స్ట్రిక్ట్ కాపీరైట్ సిస్టమ్ పై హర్షం వ్యక్తం చేశారు. ఇళయరాజా వంటి వారు ప్రారంభించిన ఈ హక్కుల పోరాటం, నేడు పరాయి దేశపు కళాకారులకు కూడా న్యాయం జరిగేలా చేసిందని చెప్పవచ్చు. సృజనాత్మకతకు తగిన మూల్యం లభించినప్పుడే కళాకారులకు నిజమైన గౌరవం లభిస్తుంది.