ట్రెండీ టాక్: 'దురంధ‌ర్‌'లో ఆ త‌ప్పుల్ని ప‌ట్టించుకోని ప్రేక్ష‌కులు!

ఇటీవ‌లి కాలంలో యానిమ‌ల్, దురంధ‌ర్, దురంధ‌ర్ 2, ఓ రోమియో ఇలా చాలా సినిమాలు హింస- ర‌క్త‌పాతం కేంద్రంగా తెర‌కెక్కిన తీరుపై చాలా చ‌ర్చ సాగుతోంది.;

Update: 2026-03-25 03:38 GMT

ఇటీవ‌లి కాలంలో యానిమ‌ల్, దురంధ‌ర్, దురంధ‌ర్ 2, ఓ రోమియో ఇలా చాలా సినిమాలు హింస- ర‌క్త‌పాతం కేంద్రంగా తెర‌కెక్కిన తీరుపై చాలా చ‌ర్చ సాగుతోంది. ఆయా సినిమాల్లో క‌థ డిమాండ్ చేయ‌డం వ‌ల్ల‌నే బ్ల‌డ్ బాత్ ని ఫ్యాష‌న్ గా మార్చారా? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది. క్రూర‌త్వం పాళ్లు తెర నిండుగా క‌నిపించ‌డం ఒక ర‌కంగా జుగుప్స‌ను కూడా పుట్టిస్తోంది. అయితే క‌థ డిమాండ్ చేసిన‌ప్పుడు ఈ జుగుప్స‌ను కూడా ప్ర‌జ‌లు ఇష్టంగా స్వీక‌రిస్తున్నారు. చుట్టూ స‌హ‌జ‌త్వంతో కూడుకున్న నిజాయితీతో కూడుకున్న స‌న్నివేశాల‌ను చూపించిన‌ప్పుడు ఆ ఒక్క‌ బ్ల‌డ్ బాత్ సీన్ ప్ర‌జ‌ల్ని మాన‌సికంగా అంగీక‌రించేలా చేసింద‌ని విశ్లేషిస్తున్నారు. అస‌లు ఈ హింస‌- బ్ల‌డ్ బాత్ కి కార‌ణ‌మైన `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఈ స‌రీస్ మొద‌లు సినిమాల్లో హింస మితిమీరిందనేది ఒక విశ్లేష‌ణ‌. ఇటీవ‌లే విడుద‌లైన దురంధ‌ర్ ఫ్రాంఛైజీలో క్రూర‌త్వాన్ని `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్`తో పోల్చిన‌ప్పుడు పాత్ర‌ల మ‌ధ్య వైరుధ్యం స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతుంది.

ఈ బ్లడ్ బాత్ వెనుక అసలు కారణం కథా బలమా లేక కేవలం ప్రేక్షకులను ఆకర్షించే ఎత్తుగడనా? అన్నది చ‌ర్చిస్తే... సినిమాల్లో ఈ స్థాయి హింసకు బీజం వేసింది అనురాగ్ కశ్యప్ రూపొందించిన `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్`. ఈ సిరీస్ భారతీయ సినిమా గ్రామ‌ర్ ని మార్చేసింది. అయితే వస్సేపూర్‌లోని హింసకు ఒక సామాజిక నేపథ్యం ఉంది. అక్కడ హింస అనేది పేదరికం, కుల వివక్ష‌ వారసత్వంగా వచ్చిన బాధ నుండి పుట్టిన ఒక బలమైన భాష. పాత్రలు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయో ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ హింస కేవలం వినోదం కోసం కాదు.. అది ఆ ప్రాంతపు వాస్తవికతను, వ్యవస్థలోని లోపాలను ప్రతిబింబించే ఒక అద్దంలా కనిపిస్తుంది.

దీనికి విరుద్ధంగా.. ఇటీవల విడుదలైన `ధురంధర్` వంటి చిత్రాల్లో హింస అనేది ఒక అవ‌స‌రంలాగా మారుతోంది. వస్సేపూర్‌లో నైతిక సంఘ‌ర్ష‌ణ‌- సంక్లిష్టత ఉంటే.. ధురంధర్‌లో అది కేవలం ఏకపక్షంగా సాగుతుంది. ధురంధర్ వంటి చిత్రాలు జాతీయ ఉద్వేగాలను వాడుకుని హింసను దేశభక్తి ముసుగులో సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ విలన్లు కేవలం స్టీరియోటైప్ పాత్రలుగా మాత్రమే మిగిలిపోతున్నారు. వారికి ఎటువంటి బలమైన నేపథ్యం కానీ.. మనుషులలో ఉండే సహజమైన వైరుధ్యాలు కానీ ఉండవు. ఇది కేవలం ప్రేక్షకుడికి కావాల్సిన `మంచి వర్సెస్ చెడు` అనే మైండ్ గేమ్ మాత్ర‌మే. ఇది ఒక ర‌కంగా కంఫర్ట్ జోన్‌లో ఉంచుతుంది తప్ప.. ఆలోచింపజేసేలా ఉండదు.

ముఖ్యంగా ఈ రెండు చిత్రాల మధ్య స్త్రీ పాత్రల చిత్రీకరణలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. వస్సేపూర్‌లో నగ్మా వంటి పాత్రలు కేవలం అలంకారప్రాయం కాదు.. వారిలో ప్రేమ, అసూయ, అణచివేయబడిన ఆగ్రహం వంటి ఎన్నో కోణాలు ఉంటాయి. అవి చాలా సహజంగా మానవీయంగా ఉంటాయి. కానీ ధురంధర్ వంటి సినిమాల్లో మహిళా పాత్రలు కేవలం కథను ముందుకు తీసుకెళ్లే పరికరాలుగామాత్రమే మిగిలిపోతున్నాయి. దేశభక్తి పేరుతో మహిళలను కేవలం ఒక వస్తువుగా వాడుకోవడాన్ని కూడా ఇక్కడ సమర్థించడం ఆ సినిమాల నైతికతను ప్రశ్నిస్తోంది. అయితే అందుకు భిన్నంగా యానిమ‌ల్ చిత్రంలో మ‌హిళా పాత్ర‌(రష్మిక పాత్ర‌) ను సందీప్ రెడ్డి చాలా బ‌లంగా ఆవిష్క‌రించార‌నేది గ‌మ‌నించాలి. ఓ రోమియోలో మాత్రం మ‌హిళా పాత్ర‌పై రోమియో డామినేష‌న్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తుంది.

నిజమైన కళ అనేది ప్రశ్నలను సంధిస్తుంది... కానీ ప్రచారం అనేది ముందే నిర్ణయించిన సమాధానాలను ప్రేక్షకుడిపై రుద్దుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ తన పాత్రల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ.. మనిషిలోని మంచిని, చెడును సమానంగా చూపిస్తుంది. కానీ `ధురంధర్` వంటి చిత్రాలు తన స్వీయ‌ నీతిని చాటుకోవడంలో మునిగిపోయి సినిమా పరిధిని తగ్గించుకుంటున్నాయనే విశ్లేష‌ణ‌లు ఒక సెక్ష‌న్ క్రిటిక్స్ నుంచి వెలువ‌డుతున్నాయి. అయితే ఇవ‌న్నీ కేవ‌లం విమ‌ర్శ‌కుల కోణంలో విశ్లేష‌ణ‌లు మాత్ర‌మే. దురంధ‌ర్ 1000 కోట్ల క్ల‌బ్ నుంచి 2000 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకుపోవ‌డానికి ఇవేవీ అడ్డంకులు కానే కావు! ప్ర‌జ‌లు ఇలాంటి సునిశిత విష‌యాల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు!

Tags:    

Similar News