'బాహుబ‌లి 2' ని ట‌చ్ చేయడానికి ధురంధర్ పోరాటం?

తాజా స‌మాచారం ప్ర‌కారం... ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' సరికొత్త చరిత్ర సృష్టించింది.;

Update: 2026-04-04 06:52 GMT

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన `ధురంధర్ 2: ది రివెంజ్` బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,500 కోట్ల మార్కును దాటి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అయితే భారతీయ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన బాహుబలి 2, దంగల్ వంటి చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను చేరుకోవడానికి ఈ సినిమా ఇంకా కష్టపడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా నెమ్మదించినా.. ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్లతో ముందుకు సాగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం... ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న `బాహుబలి 2` రికార్డును ఇది అధిగమించింది. అమెరికాలో బాహుబలి 2 సాధించిన 20.80 మిలియన్ డాలర్ల వసూళ్లను `ధురంధర్ 2` కేవలం రెండు వారాల్లోనే దాటేసి 24.39 మిలియన్ డాలర్ల పైచిలుకు వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తాను చాటిన ఈ విజయం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

తన సినిమా రికార్డును ధురంధర్ 2 బ్రేక్ చేయడంపై `బాహుబలి` నటుడు రానా దగ్గుబాటి సానుకూలంగా స్పందించారు. రికార్డులు తిరగరాయడం పరిశ్రమ అభివృద్ధికి సంకేతమని రానా పేర్కొన్నారు. ఒక దశాబ్దం తర్వాత అయినా సరే ఈ స్థాయిలో వసూళ్లు రావడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. భారతీయ సినిమా సాధిస్తున్న ఈ విజయాలు కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మన కథలు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానానికి చేరాలంటే ధురంధర్ 2 ముందు పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. ఇది `పుష్ప 2` (రూ. 1742 కోట్లు) రికార్డును ట‌చ్ చేయాల్సి ఉంది. త‌ర్వాత‌ బాహుబలి 2 (రూ. 1820 కోట్లు) రికార్డులను అధిగమించాలంటే ఇంకా సుమారు 320 కోట్ల రూపాయలు రాబట్టాలి. ఒకవేళ అమీర్ ఖాన్ దంగల్ సాధించిన రూ.2,070 కోట్లు ఆల్ టైమ్ రికార్డును సవాలు చేయాలంటే మరో 500 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ నెమ్మదించిన నేపథ్యంలో ఈ లక్ష్యాలను చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.

స్థానిక కథలకు గ్లోబల్ అప్పీల్ ఉంటుందని రానా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కొరియన్ సినిమాల తరహాలో భారతీయ దర్శకులు కూడా తమ సంస్కృతిని ప్రతిబింబించేలా అత్యుత్తమ సినిమాటిక్ లాంగ్వేజ్‌ను ఉపయోగించాలని రానా పిలుపునిచ్చారు. సినిమాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయని మన స్థానిక కథల్లో ఉండే మానవీయ కోణమే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రానా వివరించారు.

Tags:    

Similar News