రూటు మార్చేసిన దిల్ రాజు వారసుడు
హీరోల కుటుంబాల నుంచే కాదు.. దర్శకులు, టెక్నీషియన్ల ఫ్యామిలీస్ నుంచి కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే హీరోలవుతున్నారు.;
హీరోల కుటుంబాల నుంచే కాదు.. దర్శకులు, టెక్నీషియన్ల ఫ్యామిలీస్ నుంచి కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే హీరోలవుతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆయన అన్న శిరీష్ కొడుకు ఆశిష్ కొన్నేళ్ల ముందు రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత లవ్ మి అనే హార్రర్ మూవీలో నటించాడు ఆశిష్. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. దీంతో ఆశిష్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తన మూడో సినిమాగా సెల్ఫిష్‌ను లైన్లో పెట్టాడు ఆశిష్. కానీ కొంత చిత్రీకరణ జరిగాక రష్ చూసుకుని అది వర్కవుట్ కాదన్న ఉద్దేశంతో పక్కన పెట్టేసింది దిల్ రాజు టీం. ఆపై ఆశిష్ హీరోగా వేరే సినిమా తెరపైకి వచ్చింది. సైలెంట్‌గా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఆ చిత్రమే.. దేతడి. దిల్ రాజు బేనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా లాంచ్ అయింది. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రంతో ఆశిష్ రాబోతున్నాడని టీజర్ చూస్తే స్పష్టమైంది.
హైదరాబాద్‌లో పెళ్లి సహా వివిధ రకాల వేడుకలకు బ్యాండ్ కొట్టే బృందంలో ఒకడైన గన్ను అనే కుర్రాడి పాత్రను పోషించాడు ఆశిష్ ఇందులో. పక్కా హైదరాబాదీ మాస్ లోకల్ కుర్రాడి పాత్ర అది. ఇక్కడి భాష, యాస, కల్చర్.. అన్నీ రియలిస్టిగ్గా ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లున్నాడు కొత్త దర్శకుడు ఆదిత్య రావు. కొంతమేర ఇస్మార్ట్ శంకర్ సినిమాను గుర్తు చేసేలా సాగింది ఈ టీజర్. కానీ దాన్ని మించి రా అండ్ రస్టిగ్గా సినిమా తీసినట్లు కనిపిస్తోంది. సినిమాలో ఇలా ఉంటాయో లేదో కానీ.. టీజర్లో డైలాగులు కొంచెం హద్దులు దాటాయి. తన ఫ్రెండు మీద జులుం చూపించిన వ్యక్తిని కొట్టి.. ఏంది తమ్మీ అంత గట్టిగా కొట్టినావ్ అంటే.. బ్యాండ్ కొట్టే వాళ్లం కదన్నా గట్టిగానే కొడతాం అంటూ ఆశిష్ చెప్పిన లాంచ్ పంచ్ బాగానే పేలింది. బాగా ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నట్లుగా గ్లింప్స్ చూస్తే అర్థమైంది. సినిమాలో హీరోయిన్ ఎవరో టీజర్లో రివీల్ చేయలేదు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా లాంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడంతో పాటు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించాడు. సమ్మర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.