గ్యాంగ్‌స్టర్ దావూద్ యంగ్ లుక్ కోసం 3గం.లు ఫోటోషూట్ చేసారట
`ధురంధర్: ది రివెంజ్` చిత్రంలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అంశాలలో బడే సాబ్ పాత్ర ఒకటి.;
`ధురంధర్: ది రివెంజ్` చిత్రంలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అంశాలలో బడే సాబ్ పాత్ర ఒకటి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఛాయలున్న ఈ పాత్రలో నటుడు డానిష్ ఇక్బాల్ ఒదిగిపోయారు. ముఖ్యంగా సినిమాలో అనారోగ్యంతో మంచంపై ఉన్న బడే సాబ్ వెనుక గోడపై ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అది దావూద్ ఇబ్రహీం యువకుడిగా ఉన్నప్పటి అసలు ఫోటో అని.. దానిని క్లిక్ చేసిన జర్నలిస్ట్ షీలా భట్ నుండి అనుమతి తీసుకున్నారా లేదా? అనే చర్చ కూడా సాగింది.
అయితే ఈ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నటుడు డానిష్ ఇక్బాల్ తాజాగా వెల్లడించారు. గోడపై ఉన్న ఆ ఫోటో ఒరిజినల్ కాదని.. దానిని ప్రత్యేకంగా రీక్రియేట్ చేశామని ఆయన చెప్పారు. చాలా మంది ఇది ఏవైనా ఏఐ (AI) టూల్స్ ఉపయోగించి చేశారేమో అని భావించారు.. కానీ అది నిజం కాదని డానిష్ స్పష్టం చేశారు. ఆ లుక్ కోసం ఆయన స్వయంగా మేకప్ వేసుకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నట్లు వివరించారు.
ఆ ఒక్క ఫోటోను పర్ఫెక్ట్‌గా షూట్ చేయడానికి దాదాపు రెండున్నర నుండి మూడు గంటల సమయం పట్టిందని డానిష్ ఇక్బాల్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ ఫోటోలో ఉన్నది నేనే. ఆనాటి పాత ఫోటోలో ఉన్న యాంగిల్.. లుక్ పక్కాగా రావడం కోసం మేకప్ వేసుకుని చాలా కష్టపడ్డాం! అని తెలిపారు. మేకర్స్ తీసుకున్న ఈ జాగ్రత్తలు.. డీటెయిలింగ్ పై నెటిజన్లు ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది అది ఒరిజినల్ ఫోటోనే అనుకున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మార్చి 19న విడుదలైన `ధురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటి సరికొత్త మైలురాయిని అందుకుంది. మొదటి భాగం `కేజీఎఫ్ 2` వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ వసూళ్లను కూడా ఇది అధిగమించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఈ ఫ్రాంచైజీకి పెద్ద విజయమని చెప్పవచ్చు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నా.. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడానికి `ధురంధర్ 2` ఇంకా కొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రస్తుతం మూడో వారంలో వసూళ్ల జోరు తగ్గింది. మరో 300 నుంచి 500 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా బాహుబలి 2, దంగల్ రికార్డులను కూడా చెరిపేయగలదు. కానీ ఆ జోరు ఇప్పుడు లేదు. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియెన్ థియేటర్లకు రావడం వల్లనే ఈ స్థాయి విజయం సాధించిందని చెప్పొచ్చు.