సెలబ్రిటీస్ పర్సనాలిటీ రైట్స్.. కోర్టు తీర్పులిచ్చినా.. ఆగని వైనం

టెక్నాలజీ మనిషికి ఎంత మేలు చేస్తుందో, దానిని దుర్వినియోగం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని చెప్పడానికి ఇదో నిదర్శనం

Update: 2026-10-03 10:08 GMT

టెక్నాలజీ మనిషికి ఎంత మేలు చేస్తుందో, దానిని దుర్వినియోగం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని చెప్పడానికి ఇదో నిదర్శనం. ‘దేవర’ సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’ను టార్గెట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మారుతున్న ఈ దారుణాలపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అసలు ఈ ఏఐ దుర్వినియోగం ఎక్కడికి దారితీస్తుందో అనే చర్చ జరుగుతుంది..

‘చుట్టమల్లే’ పాటపై ఏఐ మార్ఫింగ్ వివాదం:

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘దేవర’. ఈ చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ "చుట్టమల్లే" ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే కొందరు డిజిటల్ క్రియేటర్లు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, పాటలోని అసలైన దృశ్యాలను మార్చేసి అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వీడియోలను సృష్టిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు క్రియేటివిటీ పేరుతో ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం మరియు హెచ్చరిక:

ఈ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ తీవ్ర విచారం, ఆగ్రహం వెలిగించారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన సంస్కృతిలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ వీడియోలను సృష్టించినా, షేర్ చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నేడు మరొకరితో మొదలైన ఈ దుశ్చర్య రేపు ఎవరి ఇంట్లోని వారికైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తేవాలని కోరారు.

పర్సనాలిటీ రైట్స్ ఉన్నా ఆగని ఉల్లంఘనలు:

సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, గొంతు లేదా పేరును అనుమతి లేకుండా ఏఐ డీప్‌ఫేక్‌‌ల కోసం వాడటాన్ని నిరోధిస్తూ న్యాయస్థానాలు ఎన్నోసార్లు కఠినమైన తీర్పులు ఇస్తున్నప్పటికీ ఉల్లంఘనలు మాత్రం ఆగడం లేదు. మన దేశంలో పర్సనాలిటీ లేదా పబ్లిసిటీ రైట్స్ కోసం ప్రత్యేకమైన పార్లమెంటరీ చట్టం లేకపోవడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణ చర్యలు లేకపోవడం పెద్ద లోపంగా మారుతోంది.

సాంకేతికతను కొత్త ప్రయోగాలకు, విజ్ఞానానికి ఉపయోగించాలి తప్ప సెలబ్రిటీల పర్సనాలిటీని దెబ్బతీయడానికి కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏఐ దుర్వినియోగంపై కఠిన చట్టాలు రావడంతో పాటు, సోషల్ మీడియాను వాడే ప్రతి ఒక్కరిలో నైతిక బాధ్యత పెరిగినప్పుడే ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ఆశిద్దాం..



Tags:    

Similar News