భారతదేశంలో రికార్డుల వేట..100 కోట్ల క్లబ్‌లో నోలన్ 'ది ఒడిస్సీ'

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2026-07-20 04:34 GMT

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా వసూళ్లను సాధిస్తోంది. నోలన్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతూ... కేవలం రెండు రోజుల్లోనే అసాధార‌ణ వ‌సూళ్ల‌తో ఈ సినిమా సంచ‌ల‌నాలు సృష్టించింది. బాలీవుడ్ స్టార్ హీర్ ర‌ణ‌బీర్ క‌పూర్ రేంజు వ‌సూళ్ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అతి త్వరలోనే భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడానికి `ది ఒడిస్సీ` సిద్ధంగా ఉంది.

అధికారిక లెక్కల ప్రకారం.. `ది ఒడిస్సీ` చిత్రం భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి మొదటి రోజైన శుక్రవారం రూ. 16.04 కోట్ల నెట్ వసూళ్లతో ఘనంగా ఖాతా తెరిచింది. ఇక రెండో రోజైన శనివారం నాటికి ఈ చిత్రం థియేటర్ల వద్ద మరింత స్ట్రాంగ్ హోల్డ్ సాధిస్తూ సాలిడ్ గ్రోత్ చూపించింది. శనివారం ఏకంగా రూ. 20.68 కోట్లు రాబట్టడంతో కేవలం రెండు రోజుల్లోనే భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం మొత్తం రూ. 36.72 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తొలి వారంలో ఈ చిత్రం 100 కోట్లు వ‌సూలు చేయ‌డం క‌ష్టం కాద‌నే చ‌ర్చ సాగుతోంది.

భారతదేశంలో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. గతంలో అత‌డు అందించిన మాస్టర్ పీస్ చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నోలన్ మైండ్‌బెండింగ్ కాన్సెప్ట్ చిత్రాలైన `ది డార్క్ నైట్` సిరీస్, `ఇన్సెప్షన్`, `ఇంటర్‌స్టెల్లార్`, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ `టెనెట్`, వార్ డ్రామా `డన్‌కిర్క్` వంటి చిత్రాలు ఫుల్ రన్ లో భారతదేశంలో భారీ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా 2023లో విడుదలైన `ఓపెన్‌హీమర్` చిత్రం భారత్‌లో ఏకంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి... ఇక్కడ నోలన్ మార్కెట్ స్టామినాను నిరూపించింది.

గత చిత్రాల సక్సెస్ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే.. నోలన్ బ్రాండ్‌కు భారత్‌లో ఎంతటి ఆదరణ ఉందో స్పష్టమవుతోంది. గ‌తంలో విడుద‌లైన సినిమాలు ఇన్సెప్షన్ లేదా ఇంటర్‌స్టెల్లార్ లాంగ్ రన్ లో సాధించిన నెట్ వసూళ్లను.. ప్రస్తుత `ది ఒడిస్సీ` చిత్రం తన మొదటి వారాంతం (ఫస్ట్ వీకెండ్) ముగిసే సమయానికే దాటేసేలా కనిపిస్తోంది. నోలన్ శైలి మేకింగ్... మైండ్ బ్లోయింగ్ విజువల్స్... అద్భుతమైన స్క్రీన్ ప్లేకి భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో థియేటర్ల వద్ద వీకెండ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

రెండు రోజుల్లోనే 36 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన `ది ఒడిస్సీ` ఆదివారం నాటి వసూళ్లతో కలిపి వీకెండ్ ముగిసేసరికి సరికొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జోరు గనుక కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం చాలా సులభంగా రూ. 100 కోట్ల క్లబ్‌ను దాటి.... భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా.... హాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను లిఖించబోతోందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News