బాలుకు పోటీగా వచ్చి...చిరు బాలయ్యకు హిట్లు ఇచ్చి !

తెలుగు సినీ చరిత్రలో సంగీత దర్శకుడు కొమ్మినేని అప్పారావు అలియాస్ చక్రవర్తికి ఒక పేజి కచ్చితంగా ఉంటుంది.

Update: 2026-05-21 04:08 GMT

తెలుగు సినీ చరిత్రలో సంగీత దర్శకుడు కొమ్మినేని అప్పారావు అలియాస్ చక్రవర్తికి ఒక పేజి కచ్చితంగా ఉంటుంది. 70 దశకంలో మెల్లగా మొదలైన ఆయన స్వర ప్రవాహం డెబ్బై దశకం చివరికి వచ్చేసరికి గంగాఝరిగా ఉధృతమైంది. 80 దశకం అంతా ఆయన హవా సాగింది. ఏడాదికి ఏకంగా 55 చిత్రాలకు మించి సంగీత దర్శకత్వం చేశారు అంటే ది గ్రేట్ చక్రవర్తి అని చెప్పాల్సిందే. అలా ఒక ఏడాది కాదు నాలుగైదేళ్ళ పాటు ఆయన ఇదే స్పీడ్ తో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. దాదాపుగా వేయికి దగ్గరగా చిత్రాలకు మ్యూజిక్ అందించిన చక్రవర్తి అందులో తొంబై శాతం హిట్లే కొట్టారు. ఎందరో వర్ధమాన ప్రవర్ధమానులకు తన ద్వారా సినీ జీవితం అందించారు. చక్రవర్తి కొత్త గాయకులకు గేట్ వేగా ఉండేవారు. బాలుతో ఎన్నో పాటలు పాడించినా ఒక సినిమాలో కొత్త గొంతు సైతం వినిపించాలని చక్రవర్తి తాపత్రయపడే వారు. అలా 1980 దశకంలో ఎక్కువ మంది సింగర్స్ ని ఆయన నేపధ్య గాయకులుగా తెరకు పరిచయం చేసిన ఖ్యాతిని అందుకున్నారు.

యువ గాయకుడికి చాన్స్ :

అయితే చక్రవర్తి యువ గాయకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారు. ఆ రోజులలో జి ఆనంద్ కి తన ప్రతీ సినిమాలో ఒక పాటను కచ్చితంగా ఇవ్వడమే కాదు మెలోడీ ప్రదానమైనదిగా చేసి ఎవర్ గ్రీన్ హిట్లు ఇచ్చారు. అలా 80 దశకంలో ఒక యువ గాయకుడిని చక్రవర్తి విశేషంగా ప్రోత్సహించారు ఆ యువ గళమే నందమూరి రాజా. వస్తూనే మంచి హిట్ సాంగ్స్ తో దూకుడు చేస్తూ రాజా తెలుగు సినిమా రంగంలో తన టాలెంట్ చాటుకున్నారు.ఆయన చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించారు. అప్పట్లో ఎస్పీ బాలు హవా సాగుతున్నా కూడా నందమూరి రాజా తన విలక్షణ గాత్రంతో అలరించారు.

బాలయ్యకు చిరంజీవికి :

అటు బాలయ్యకు ఇటు చిరంజీవికి నందమూరి రాజా పాటలు పాడి మెప్పించారు. బాలయ్య నటించిన సింహం నవ్వింది మూవీలో మొత్తం పాటలను నందమూరి రాజా పాడారు. ఆ సినిమా హీరో బాలక్రిష్ణకు అలా మ్యూజికల్ హిట్ ని అందించారు. ఆ సినిమా ఆడకపోయినా పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. అలాగే బాలయ్య మూవీ బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఆయనకు నందమూరి రాజా పాటలు పాడారు. ఇక చిరంజీవి హీరోగా వచ్చిన టింగు రంగడు మూవీలో మొత్తం పాటలను ఆయనకు పాడి హిట్ చేశారు. అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన మరో సినిమా పల్లెటూరి మొనగాడులో కూడా నందమూరి రాజా పాటలు పాడారు. 1980 దశకంలో సినీ రంగంలో ప్రవేశించిన నందమూరి రాజా ఆ సమయంలో వచ్చిన యువ హీరోలకు తాను ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యారు. అయితే కాలక్రమంలో ఆయన గొంతు ఎందుకో వినిపించలేదు. మొత్తం మీద చూస్తే చక్రవర్తి ప్రోత్సాహంతో ఇండస్త్రీలోకి వచ్చిన వారు తమ ప్రతిభను చాటుకున్నా కూడా కాలం కలసి రాకపోవడం వల్లనే వెనకబడ్డారు అని చెప్పక తప్పదు. ఈ రోజుకీ రాజా పాటలు కానీ విన్న వారికి ఆ టాలెంట్ అర్ధమవుతుంది. మరిన్ని చాన్సులు వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయినా ఇది చిత్ర విచిత్రమైన సినీ లోకం కాబట్టి అలాగే చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News