చిన్నబోయిన కేన్స్ 2026: క్వీన్ ఐశ్వర్యరాయ్ లేని లోటు అలానే..!
ప్రపంచ ప్రసిద్ధ `కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026` వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైనా.. ఈసారి ఎందుకో ఆ పాత మెరుపు తగ్గినట్లు కనిపిస్తోంది.
ప్రపంచ ప్రసిద్ధ `కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026` వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైనా.. ఈసారి ఎందుకో ఆ పాత మెరుపు తగ్గినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. గత రెండు దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై తన అందచందాలతో మ్యాజిక్ చేస్తున్న `కేన్స్ క్వీన్` ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ ఏడాది వేడుకలకు దూరంగా ఉండటమే. లారియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా హోటల్ మార్టినెజ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్లలో ఐశ్వర్య ఫోటో లేకపోవడం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఐష్ లేని కేన్స్ వేడుకలు కళ తప్పాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఐశ్వర్యారాయ్ కేన్స్‌తో ఉన్న బంధం ఈనాటిది కాదు. 2002లో `దేవదాస్` సినిమా ప్రీమియర్ కోసం షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీలతో కలిసి మొదటిసారి కేన్స్ వేదికపై అడుగుపెట్టిన ఐష్ ఆ తర్వాత ఏడాది నుండి లారియల్ ప్రతినిధిగా దాదాపు 22 ఏళ్ల పాటు నిరంతరాయంగా హాజరవుతూ వచ్చారు. కేన్స్‌లో తను ధరించే దుస్తులు, ఆ పోజులు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచాయి. అందుకే ఐశ్వర్యారాయ్ ను అభిమానులు `కేన్స్ క్వీన్` అని పిలుచుకుంటారు. ఈ ఏడాది ప్రచార చిత్రాల్లో ఐసూ కనిపించకపోవడంతో లారియల్ స్పందిస్తూ.. ``సంవత్సరాలు గడిచినా కేన్స్ వేడుకలు మారినా ఆమె ఎప్పుడూ మిస్ అవ్వదు`` అంటూ ఒక రహస్యమైన వివరణ ఇచ్చింది తప్ప ఐశ్వర్యారాయ్ హాజరుపై స్పష్టతను ఇవ్వలేదు.
ఐశ్వర్య లేని లోటును భర్తీ చేసేందుకు ఈసారి భారత్ నుండి యువ నటీమణులు ఆలియా భట్, తారా సుతారియా వంటి వారు కేన్స్‌లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఆలియా భట్ తన గ్లోబల్ అప్పీల్‌తో కేన్స్ రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లారియల్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఆలియా ధరించిన దుస్తులు..తన మేకప్ స్టైల్ అంతర్జాతీయ మీడియాను సైతం ఆకర్షించాయి. ఆలియా లుక్ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. తనను ఒక అంతర్జాతీయ తారగా ఎదుగుతున్న తీరును కొనియాడుతున్నారు.
మరోవైపు యువ నటి తారా సుతారియా కూడా కేన్స్ 2026లో తన క్యాట్ వాక్ - గ్లామరస్ లుక్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తారా సుతారియా క్లాసిక్ & బోల్డ్ ఫ్యాషన్ ఛాయిస్ గురించి ఫ్యాషన్ విశ్లేషకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది కంటే ఈసారి తారా సుతారియా మరింత ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేస్తూ భారతీయ సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తోంది. ఆలియా, తారాల రాకతో కేన్స్‌లో యువత సందడి పెరిగిన మాట వాస్తవమే అయినా.. సీనియర్ నటి ఐశ్వర్యకున్న ఆ గ్రేస్ .. అనుభవం ముందు వీరు ఇంకా ఎదగాలనే చర్చ కూడా నడుస్తోంది.
ఓవరాల్ గా ఇప్పటివరకూ 2026 కేన్స్ వేడుకలు కొత్త తరం నటీమణుల హవాతో ముందుకు సాగుతున్నా.. ఐశ్వర్యారాయ్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యూటీ ఎయిర్‌పోర్ట్ లుక్స్ నుండి రెడ్ కార్పెట్ అరంగేట్రం వరకు ప్రతిదీ ఒక పండుగలా ఉండేది. ఈ ఏడాది ఐశ్వర్యారాయ్ ప్రచార కార్యక్రమాలకు, యాడ్స్ కి దూరంగా ఉండటం కేన్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆలియా భట్, తారా సుతారియా వంటి వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా.. కేన్స్ క్వీన్ ఐశ్వర్యారాయ్ సృష్టించిన ఆ సుదీర్ఘ చరిత్ర, ప్రభావం ముందు ఈ ఏడాది వేడుకలు కొంచెం నీరసంగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.