ట్రెండీ టాక్: అగ్ర హీరోలకు తిట్లు చీవాట్లు
థాంక్ గాడ్ ఈ విషయంలో టాలీవుడ్ స్టార్లు ఎంతో గొప్ప మనసున్న మారాజులు. పోటీలో ఉన్న హీరో సినిమా ఆడినా కలిసి సెలబ్రేషన్ చేసుకునే మంచి కల్చర్ మనకు ఉంది.;
ఒక భారీ విజయం కనువిప్పుగా మారితే, దానిని కంటగింపుగా చూసేవాళ్లు లేకపోలేదు. పరిశ్రమ మూల స్థంభాలు, అగ్ర హీరోలు అని చెప్పుకునేవాళ్లే మరీ ఇలా నాశిరకంగా ప్రవర్తించడం బాలీవుడ్ లోనే చూస్తున్నాం.. థాంక్ గాడ్ ఈ విషయంలో టాలీవుడ్ స్టార్లు ఎంతో గొప్ప మనసున్న మారాజులు. పోటీలో ఉన్న హీరో సినిమా ఆడినా కలిసి సెలబ్రేషన్ చేసుకునే మంచి కల్చర్ మనకు ఉంది.
కానీ బాలీవుడ్‌లో పరిస్థితి అలా లేదు. అక్కడ ఖాన్‌ల త్రయం, కపూర్ లు అలా కనిపించడం లేదు. ఎంతటి భారీ సినిమాలు వచ్చినా.. రికార్డుల మోత మోగినా కొంతమంది అగ్ర నటుల తీరు మాత్రం మారడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా `1దురంధర్` ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా బిగ్ స్టార్స్ అని పిలుపందుకునే వారు ఆ విజయాన్ని గుర్తించడానికి వెనకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా లేదా అవుట్ సైడర్ సినిమా హిట్ అయితే అభినందించే సంస్కృతి ఈ పెద్ద స్టార్లలో మృగ్యమైపోయిందని.. వీరు ఎప్పటికీ తమ సొంత డబ్బా కొట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఈ మంటకు మరింత నెయ్యి పోశాయి. `దురంధర్ 2` సినిమా భారీ విజయం సాధించడంపై స్పందించిన అమీర్ ఆ సినిమా సక్సెస్ గురించి తనకు తెలుసని కానీ తాను ఇంకా ఆ చిత్రాన్ని చూడలేదని వెల్లడించారు. కేవలం `దురంధర్ 2` మాత్రమే కాదు.. మొదటి భాగం `దురంధర్ 1` కూడా తాను చూడలేదని ఆయన చెప్పడం గమనార్హం. దేశమంతా మెచ్చిన ఒక సినిమాను ఇండస్ట్రీలో ఉండి కూడా కనీసం చూడలేదని చెప్పడం అమీర్ అహంకారానికి నిదర్శనమని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో కేవలం అమీర్ ఖాన్ మాత్రమే కాదు.. మిగిలిన ఖాన్‌లు.. కపూర్‌ల తీరు కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ `దురంధర్` సక్సెస్‌పై ఇంతవరకు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. అలాగే బాలీవుడ్ వారసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కపూర్ ఖాందాన్ కూడా ఈ ఫ్రాంచైజీ సాధించిన ఘనతపై పెదవి విప్పడం లేదు. ఈ పెద్ద స్టార్లందరూ కలిసి కావాలనే ఈ సినిమాను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్‌లైన్ వేదికగా అమీర్ ఖాన్‌పై తిట్లు, చీవాట్లు ఫేస్ చేయాల్సి వస్తోంది. ``మీరు సినిమాలు చూసినా చూడకపోయినా ఆ సినిమా సక్సెస్ ఆగిపోదు`` అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అగ్ర తారలు కేవలం తమకు నచ్చిన వర్గం.. తమ కుటుంబ సభ్యుల సినిమాలను మాత్రమే ప్రమోట్ చేస్తారని.. నిజమైన టాలెంట్‌ను గుర్తించే మనసు వీరికి లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తే ఈ ఖాన్‌లు, కపూర్‌లు మాత్రం పాత పంథాలోనే సాగుతూ తమ సంకుచితత్వాన్ని చాటుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి `దురంధర్2` చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తూ.. సంచలనాలు సృష్టించినా బాలీవుడ్ పెద్దల మౌనం చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నా ఈ అగ్ర నటులు పట్టించుకోకపోవడం వారి వ్యక్తిత్వాలపైనే సందేహాల్ని పుట్టించేలా చేస్తోంది. వీరు ఇకనైనా తమ ఇగోలను పక్కన పెట్టి మంచి సినిమాలను ప్రోత్సహించాలని.. లేదంటే కాలక్రమేణా ప్రేక్షకులు వీరిని కూడా పక్కన పెట్టే రోజు వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.