డైరెక్ట‌ర్ కోసం హీరోనే ప‌క్క‌న పెడ‌తాన‌న్న నిర్మాత‌!

ఆ చిత్రంలో కథానాయకుడిగా రిషి కపూర్ అప్పటికే ఎంపికయ్యారు. అయితే ఓ దర్శకుడితో పనిచేయడానికి రిషి కపూర్ నిరాకరించారని డేవిడ్ గుర్తు చేసుకున్నారు.

Update: 2026-05-25 23:30 GMT

బాలీవుడ్ పరిశ్రమలో దివంగత న‌టుడు రిషి కపూర్ శైలి ఎంతో విలక్షణమైనది. ఆయన నిర్మొహమాటపు వ్యాఖ్యలతో, ముక్కుసూటితనంతో ఎందరినో ఆకట్టుకునేవారు. సినిమా సెట్స్‌లో అయినా? బయట అయినా? ఎవరినైనా ఆటపట్టించడంలో ముందుండేవారు. తాజాగా దర్శకుడు డేవిడ్ ధావన్ ఓ సినిమా ప్ర‌మోష‌న్ లోరిషి కపూర్‌తో ఉన్న పాత జ్ఞాపకాలను - కలిసి పనిచేసిన మొదటి సినిమా వెనుక ఉన్న ఆసక్తికర కథను పంచుకున్నారు. డేవిడ్ ధావన్ కెరీర్ తొలినాళ్లలో ఎడిటర్‌గా పనిచేసేవారు. అటుపై మెల్లగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత నితిన్ మన్మోహన్ తన కొత్త చిత్రం `బోల్ రాధా బోల్`కు దర్శకత్వం వహించాల్సిందిగా డేవిడ్‌ను కోరారు.

ఆ చిత్రంలో కథానాయకుడిగా రిషి కపూర్ అప్పటికే ఎంపికయ్యారు. అయితే ఓ దర్శకుడితో పనిచేయడానికి రిషి కపూర్ నిరాకరించారని డేవిడ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత నితిన్ మన్మోహన్‌కు డేవిడ్ ధావన్ మంచి మిత్రుడు. డేవిడ్ దర్శకత్వం వహించిన `షోలా ఔర్ శబ్నమ్` చిత్రంలోని కొన్ని రీల్స్ చూసిన నితిన్ ధావ‌న్ ప్రతిభను గుర్తించి తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ రిషి కపూర్ మాత్రం ఎవరిని పడితే వారిని దర్శకుడిగా తీసుకొస్తే నేను సినిమా చేయను' అని కుండబద్దలు కొట్టారు. అయినా? కథ అద్భుతంగా ఉండటంతో రిషి కపూర్‌కు ఆ కథ బాగా నచ్చింది.

దీంతో నిర్మాత నితిన్, రిషి కపూర్‌తో `మీరు ఈ సినిమా చేసినా చేయకపోయినా? దీనికి డేవిడ్ మాత్రమే దర్శకత్వం వహిస్తాడు అని స్పష్టం చేశారు. కథపై ఉన్న నమ్మకంతో రిషి కపూర్ చివరకు ఆ ప్రాజెక్ట్‌కు అంగీకరించారు. అలా ప్రారంభమైన `బోల్ రాధా బోల్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ విజ‌యం రిషీ-దావ‌న్ మ‌ధ్య‌ బలమైన స్నేహ బంధానికి పునాది వేసింది. కాల‌క్రమేణా డేవిడ్ ధావన్, రిషి కపూర్‌కు అత్యంత ఇష్టమైన దర్శకుడిగా మారిపోయారు. ఆరంభంలో వచ్చిన మనస్పర్థలు తొలిగిపోయి ఇద్ద‌రి కాంబినేషన్‌లో `చష్మే బద్దూర్`, `యే హై జల్వా`, `యారానా`, `ఈనా మీనా డీకా` వంటి పలు విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రిషి కపూర్ సెట్స్‌లో విపరీతంగా ఆటపట్టించేవారని డేవిడ్ ధావన్ గుర్తు చేసుకున్నారు. తనతో పనిచేసే టెక్నీషియన్లు, తోటి నటీనటులతో పాటు కుమారుడు రణబీర్ కపూర్‌ను కూడా వదిలిపెట్టకుండా ర్యాగింగ్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. రిషీ బయటకు కఠినంగా క‌నిపించినా? మనసంతా వెన్న అని, సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత అమోఘమని కొనియాడారు. ప్రస్తుతం డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ హీరోగా `హై జవానీ తో ఇష్క్ హోనా హై` అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇదే డేవిడ్ ధావ‌న్ చివ‌రి సినిమా. జూన్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News