శర్వా 'బైకర్'.. ఇంకా ఎంత రావాలి?
యంగ్ హీరో శర్వానంద్ లీడ్ లో రూపొందిన తాజా చిత్రం బైకర్.. స్టేబుల్ రన్ తో కొనసాగుతోంది.;
యంగ్ హీరో శర్వానంద్ లీడ్ లో రూపొందిన తాజా చిత్రం బైకర్.. స్టేబుల్ రన్ తో కొనసాగుతోంది. బైక్ రేసింగ్ నేపథ్యంతో యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి హైప్ సాధించినప్పటికీ, తొలి మూడు రోజుల కలెక్షన్లు చూసిన ట్రేడ్ పండితులు మాత్రం ఆ చిత్రానికి ఇంకా చాలా దూరం ప్రయాణం మిగిలి ఉందని అంచనా వేస్తున్నారు.
సినిమాలో శర్వానంద్ తో పాటు యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి ఆ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చూపించేందుకు ప్రయత్నించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మించారు.
సాంకేతికంగా బైకర్ మంచి రేంజ్ లో రూపొందిందని చెప్పాలి. జిబ్రాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. యువరాజ్ సినిమాటోగ్రఫీ బైక్ రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించగా, అనిల్ పసాల ఎడిటింగ్, పన్నీర్ సెల్వం ఆర్ట్ వర్క్ కథకు అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా చిత్రాన్ని 3డీ, 4డీ ఎక్స్, డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
ఇక బడ్జెట్ విషయానికి వస్తే, బైకర్ సుమారు రూ.45 కోట్లతో రూపొందినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.23 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ప్రాంతాల హక్కులతో కలిపి ఆ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.30 కోట్ల వరకు పూర్తయిందని వినికిడి.
దీంతో సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.31 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే విడుదలైన తొలి మూడు రోజుల్లో బైకర్ సుమారు రూ.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది దాదాపు రూ.9 కోట్ల షేర్ కు సమానం. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇంకా రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉందని సమాచారం.
ఇది సాధించాలంటే వచ్చే రోజుల్లో కలెక్షన్లు బాగా పెరగాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే.. మంచి కాన్సెప్ట్, సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ బైకర్ బాక్సాఫీస్ వద్ద ఇంకా వేగం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది కీలకం. ప్రేక్షకుల నుంచి మరింత మౌత్ టాక్ వస్తే రికవరీ దిశగా అడుగులు వేయగలదని చెప్పాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బైకర్ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కోసం ఇంకా చాలా దూరం వెళ్లాల్సిందే.