బాలీవుడ్ 'రామాయణం' పై ఉన్న సవాళ్లు!
భారతీయ చలనచిత్ర చరిత్రలో `రామాయణం` కంటే గొప్ప ఇతిహాసం మరొకటి లేదు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో `రామాయణం` కంటే గొప్ప ఇతిహాసం మరొకటి లేదు. ఈ మహాకావ్యాన్ని బాలీవుడ్ వేదికగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిత్ర బృందం అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది అంతే వాస్తవం. దశాబ్దాలుగా మన సంస్కృతిలో, నమ్మకాల్లో భాగమైన కథను దృశ్యరూపంలోకి మార్చడం కత్తి మీద సామే. ముఖ్యంగా నేటి ఆధునిక ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. భక్తుల విశ్వాసాలను కాపాడటం ఏ దర్శకునికైనా పెద్ద పరీక్ష అనే చెప్పాలి.
రామాయణం అంటే కోట్లాది మంది భారతీయులకు పవిత్రమైన నమ్మకం. కథా గమనంలో కానీ, పాత్రల చిత్రీకరణలో కానీ చిన్నపాటి మార్పులు చేసినా? అది వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి సన్నివేశాన్ని బాధ్యతాయుతంగా, భారతీయ సంప్రదాయ విలువలకు అనుగుణంగా చిత్రీకరించడం మేకర్స్ ముందున్న పెద్ద సవాలు.
రాముడు, సీత, హనుమంతుడు వంటి పాత్రలను ప్రేక్షకులు దైవ సమానంగా చూస్తారు. ఆయా పాత్రల హుందాతనాన్ని, దైవత్వాన్ని వెండితెరపై పండించగల నటులను ఎంచుకోవడం అంత సులభం కాదు. నటుల ఇమేజ్ కంటే వారు పాత్రల్లో ఎంతవరకు పరకాయ ప్రవేశం చేయగలరు? అనేదే కీలకం. తప్పుగా ఎంపిక చేస్తే ప్రేక్షకులు ఆ పాత్రలతో కనెక్ట్ అవ్వలేరు. ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉంటుంది.
రామాయణంలోని అద్భుతమైన ఘట్టాలను, వానర సైన్యాన్ని, లంకాదహనాన్ని, పుష్పక విమానాన్ని నేటి తరం ఆశించే గ్లోబల్ స్టాండర్డ్స్‌లో చూపించాలి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ విషయంలో రాజీ పడితే పౌరాణికతను కోల్పోయి కృత్రిమంగా కనిపిస్తుంది. భారీ బడ్జెట్ ఉన్నా? దానిని సృజనాత్మకంగా ఉపయోగించి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించడం సాంకేతిక నిపుణులపై ఉన్న అతి పెద్ద భారం.
రామాయణం సుదీర్ఘమైన ఇతిహాసం. ప్రతి కాండలోనూ ఎన్నో కీలకమైన మలుపులు, పాత్రలు ఉంటాయి. వీటన్నింటినీ ఆరు గంటల సినిమాగా మలిచేటప్పుడు కథలోని మూల ఎమోషన్స్ దెబ్బతినకుండా ఎడిటింగ్ చేయడం చిన్న విషయం కాదు. ముఖ్యమైన ఘట్టాలకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా కథను నడిపించడం దర్శక, రచయితల ప్రతిభపై ఆధారపడి ఉంటుంది.
చివరిగా భారీ బడ్జెట్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రావాలి. పౌరాణిక కథాంశం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం.. థియేట్రికల్ రన్‌ను కాపాడుకోవడం ఆర్థికంగా సవాలుతో కూడుకున్నది. ఈ సినిమా కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ చేరువవుతుంది. ఈ సవాళ్లన్నింటినీ అధిగమిస్తేనే రామాయణం వంటి ఐకానిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించగలదు.