Bigg Boss Telugu 10: ఏడో వారం 'GOAT' థీమ్ ప్రారంభం!

నాగార్జున ఇచ్చిన శిక్ష ప్రకారం దక్ష ఇప్పటికే రెండు వారాల పాటు నేరుగా నామినేషన్లలో ఉండగా, ఈ వారం షాలినికి నామినేషన్ల నుంచి మినహాయింపు లభించింది.

Update: 2026-10-19 07:05 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం ఎపిసోడ్స్ ముగిసి, ఎంతో ఆసక్తికరంగా 'GOAT' (Greatest of All Time) థీమ్‌తో ఏడో వారం మొదలవ్వబోతుంది. హౌస్‌లో పరిణామాలు మరింత వేగంగా మారుతుండగా, నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ దశలో ఈరోజు మొదటగా వచ్చిన ప్రోమో తో అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, నామినేషన్స్ వాడీ వేడి గా సాగుతున్నాయి.

నాగార్జున ఇచ్చిన శిక్ష ప్రకారం దక్ష ఇప్పటికే రెండు వారాల పాటు నేరుగా నామినేషన్లలో ఉండగా, ఈ వారం షాలినికి నామినేషన్ల నుంచి మినహాయింపు లభించింది. ఆమె ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో నుండి ఆటని గమనిస్తుంది.

ఇక ఇప్పటి వరకు అమాయకుడు అనే ఇమేజ్ ని మూటగట్టుకున్న రామకృష్ణ మాత్రం ఏడో వారం నామినేషన్లలో పూర్తిగా రూటు మార్చాడు. చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. గతంలో షాలిని విషయంలో ఆయన వ్యవహరించిన తీరును ఝాన్సీ తప్పు పట్టగా, రామకృష్ణ తనదైన శైలిలో గట్టిగా కౌంటర్లు ఇచ్చాడు.

"అది ఒక సింపుల్ గేమే కదా" అని ఝాన్సీ ఎదురు దాడి చేయగా.. "మరి మీరెందుకు ఏడ్చి పెద్ద డ్రామా క్రియేట్ చేశారు?" అంటూ రామకృష్ణ తిరగబడటం విశేషం. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన రామకృష్ణ తన ఆటను మరింత దూకుడుగా మలుచుకుంటున్న సంకేతాలు ఈ నామినేషన్లలో స్పష్టంగా కనిపించాయి.

ఇకపోతే ఆరో వారం ఎలిమినేషన్‌లో భాగంగా షాలిని హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు హౌస్‌మేట్స్‌ అందరూ భావించారు. కానీ నిజానికి ఆమెను బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌కు పంపిన సంగతి తెలిసిందే. సీక్రెట్ రూమ్‌లో ఉంటూ హౌస్‌మేట్స్ ఎవరెలా ఆడుతున్నారు? తన వెనుక ఎవరు ఏమనుకుంటున్నారు? అనే విషయాలన్నింటినీ షాలిని గమనిస్తోంది. త్వరలోనే ఆమె మిడ్‌వీక్‌లో తిరిగి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది.

'GOAT' థీమ్‌తో నడుస్తున్న ఈ ఏడో వారంలో హౌస్‌లో సమీకరణాలు ఎలా మారుతాయి, సీక్రెట్ రూమ్ నుంచి షాలిని రీ-ఎంట్రీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది రానున్న ఎపిసోడ్లలో తేలనుంది!

Tags:    

Similar News