తెలుగులో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న 'బత్తా'

విజయ్ సేతుపతి ఇటీవల నటించిన 'బత్తా' సినిమా తెలుగులో విడుదల చేయలేదు. తమిళనాడులో అక్టోబర్‌ 1న విడుదలైన బత్తా సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని మొదట భావించారు.

Update: 2026-10-14 05:50 GMT

తమిళ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు సాధించిన దాఖలాలు చాలా ఉన్నాయి. చిన్న తమిళ్‌ సినిమాలు సైతం తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా చాలా మంది తమిళ్ హీరోలు తెలుగు హీరోలకు సమానంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. తెలుగులో మంచి మార్కెట్‌ ఉన్న తమిళ హీరోల్లో విజయ్‌ సేతుపతి ఒకరు అనే విషయం తెల్సిందే. ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో విడుదల కావడంతో పాటు, ఆయన నేరుగా తెలుగు సినిమాల్లోనూ నటించాడు. అందుకే ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో ఏ సినిమాను చేసినా డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అందులో కొన్ని అంతంత మాత్రంగా ఆడుతుంటే కొన్ని మాత్రం మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచాయి.

విజయ్‌ సేతుపతి బత్తా సినిమాతో...

విజయ్ సేతుపతి ఇటీవల నటించిన 'బత్తా' సినిమా తెలుగులో విడుదల చేయలేదు. తమిళనాడులో అక్టోబర్‌ 1న విడుదలైన బత్తా సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని మొదట భావించారు. తమిళ్‌ నిర్మాతలే, తెలుగు నిర్మాతల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని భావించారు. డబ్బింగ్‌ వర్క్‌ కూడా మొదలు పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే అక్టోబర్‌ 2న తెలుగులో పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో బత్తా సినిమాకు ఛాన్స్ ఉండదేమో అనే ఉద్దేశంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో వెంటనే తెలుగులో విడుదల చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారనే వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ రెండు లేదా మూడో వారంకు సినిమాను తీసుకు రావాలని భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేదు, పైగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో అసలు బత్తా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

టాలీవుడ్‌లో విడుదల అయిన...

బత్తా సినిమాను అక్టోబర్‌ 1 న తమిళ్‌ వర్షన్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేసి ఉంటే అన్ని విధాలుగా బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్టోబర్‌ 2న చాలా సినిమాలు వచ్చిన మాట వాస్తవం, అందులో ఎక్కువ శాతం సినిమాలు చెత్త అనే టాక్‌ ను తెచ్చుకున్నాయి. ఆ వారం మొత్తం బాక్సాఫీస్‌ వద్ద మంచి సినిమాకు స్కోప్ ఉంది. కనుక బత్తా సినిమాను తమిళ్‌ లో విడుదల అయిన సమయంలోనే తెలుగులో విడుదల చేయడం వల్ల కచ్చితంగా కలిసి వచ్చేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట బత్తా సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. వసూళ్ల విషయం పక్కన పెడితే విజయ్‌ సేతుపతి నుంచి ఒక మంచి సినిమా వచ్చిందని మౌత్‌ టాక్‌ వచ్చింది. అదే టాక్‌ ఇక్కడ విడుదలై వచ్చి ఉంటే తప్పకుండా ఊహించని వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అనేది బాక్సాఫీస్‌ వర్గాల మాట.

అట్లీ సమర్పణలో వచ్చిన బత్తా సినిమాకు...

విజయ్‌ సేతుపతి హీరోగా లిజోమోల్ జోస్, బేబీ సహస్ర శ్రీ, శాంతి బాలచంద్రన్, హరి కృష్ణన్, మాస్టర్ సాయి పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పించడంతో తమిళనాట అంచనాలు పెరిగాయి. ఇప్పుడు అట్లీ తెలుగులో రాకా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అట్లీ పేరుతో ప్రమోట్‌ చేసి ఉంటే తప్పకుండా తెలుగులో మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యేవి అనేది కొందరి మాట. అందుకే తెలుగులో బత్తా సినిమా అక్టోబర్‌ 1న విడుదల కాకపోవడంతో మంచి అవకాశం మిస్ చేసుకుందనే అభిప్రాయం ను ఎక్కువ శాతం మంది వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా తమిళ బాక్సాఫీస్‌ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దసరా కానుకగా పెద్ద సినిమాలు చాలా తెలుగు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నాయి, కనుక ఈ మధ్య లో బత్తా సినిమాను విడుదల చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. కనుక బత్తాను ఇక తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూసుకోవాల్సిందేనేమో..!

Tags:    

Similar News