ఆ విషయంలో అనుష్క ఎన్నడు చింతించలేదా?
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన భారీ అవకాశాలను తిరస్కరించడం అంటే సాధారణ విషయం కాదు.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన భారీ అవకాశాలను తిరస్కరించడం అంటే సాధారణ విషయం కాదు. `బాహుబలి`, `రుద్రమదేవి` వంటి చిత్రాలతో పాన్-ఇండియా స్టార్‌డమ్ అనుభవిస్తున్న సమయంలో అనుష్క శెట్టికి హిందీ పరిశ్రమ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పటికే తెలుగులో బిజీగా ఉండటం.. ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆ అవకాశాలను పక్కన పెట్టారు. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే టాలీవుడ్ అనుష్కను పక్కనబెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లు కూడా రాలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏ నటి అయినా? అయ్యో బాలీవుడ్ అవకాశాలు అనవసరంగా వదులుకున్నానే అని వాపోతుంటారు. కానీ అనుష్క మాత్రం అలాంటి వాళ్లందరికీ భిన్నమని తెలుస్తోంది. అనుష్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. ఆమె కెరీర్‌ను అవకాశాల సంఖ్యతో కొలవలేదు. నచ్చిన కథ, పాత్రకు ఉండే లోతు మాత్రమే ముఖ్యం. బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు చేయడం కంటే దక్షిణాదిలో తనకంటూ బలమైన ముద్ర వేసే పాత్రలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో బాలీవుడ్ వెళ్లలేదే అని తానెప్పుడు బాధపడలేదన్నారు.
పరిశ్రమలో నటిగా అనుష్క స్థానం ఎంతో గౌరవప్రదమైనది. బాలీవుడ్ ఆఫర్లు రాలేదని ఆమె ఖాళీగా కూర్చోలేదు. తన స్థాయికి తగ్గట్లుగా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలపైనే దృష్టి సారించారు. మాలీవుడ్ లో `కథనార్` వంటి వైవిధ్యభరితమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం చూస్తుంటే? ఆమెకు గ్లామర్ హంగుల కంటే అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే కథలే ముఖ్యమని అర్థమవుతోంది. పాత అవకాశాల గురించి ఆలోచించి వర్తమానాన్ని వదులుకునే రకం కాదని నిరూపిస్తుంది.
నిజానికి బాలీవుడ్ అవకాశాలు రాకపోవడం అనేది అనుష్క కెరీర్ పరంగా వైఫల్యం కాదు. అది అనుష్క ఎంచు కున్న మార్గం. దక్షిణాదిలో ఆమెకు దక్కిన ఆదరణ, అభిమానుల ప్రేమ ఏ బాలీవుడ్ స్టార్‌కు తీసిపోని విధంగా ఉంటాయి. తాను తిరస్కరించిన ఆ బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి తానెప్పుడు పశ్చాత్తాపం చెందలేదు. పైగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకుని ఐకానిక్ నటిగానే నేటికి కొనసాగుతున్నారు.
అనుష్క స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారనిపిస్తుంది. సినిమా అంటే మార్కెట్ విస్తరణ మాత్రమే కాదు. అది ఒక నటిగా తన ఆత్మ సంతృప్తి అని బలంగా నమ్ముతున్నారు. గతాన్ని తలుచుకుని బాధపడటం కంటే ముందున్న కథల గురించి ఆలోచించడంపైనే దృష్టి పెడతానంటోంది. ఈ పక్వత అనుష్కను మిగతా నటీమ ణులకు భిన్నంగా నిలబెడుతోంది. కెరీర్ అంటే అవకాశాల వేట కాదు. అదొక ప్రయాణం. అనుష్క ఆ ప్రయాణంలో తాను కోరుకున్నట్లుగానే ముందుకెళ్తున్నారు.