ప్రేక్షకుడు కలుషితం అవ్వడం వల్లే.. అనంత శ్రీరామ్ అలా అనేశారేంటి?
దానికి అనంత శ్రీరామ్ సమాధానమిస్తూ.. ``సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు, అదొక కళాత్మక వ్యాపారం. వ్యాపారాన్ని, కామర్స్‌ని మనం విడివిడిగా చూడలేం.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లోని కంటెంట్, పాటల సాహిత్యంపై తీవ్రస్థాయిలో చర్చలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా `పెద్ది` సినిమాలో అచ్చియ్యమ్మ పాత్ర చుట్టూ అల్లిన వెటకారపు పదజాలం, మహిళలను ఆటవస్తువుగా చూపే సంస్కృతిపై పలువురు సామాజిక కర్తలు, సాంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. ఈ రకమైన విమర్శల వల్ల సదరు చిత్ర కథానాయిక జాన్వీ కూడా కొంత చిన్నబుచ్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. సినిమాల్లోని ఇటువంటి ఘాటైన, అభ్యంతరకర పదజాలంపై ఇప్పుడు సినీ సాహితీవేత్తలు సైతం ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌కు కూడా ఒక ఇంటర్వ్యూలో సరిగ్గా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.
ఒక ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ``ఓటరు అవినీతిపరుడు అవ్వడం వల్లే అవినీతిపరులైన నాయకులు వస్తున్నారు.. అలాగే ప్రేక్షకుడు కలుషితం అవ్వడం వల్లే దర్శకులు కూడా కలుషితం అయ్యారు`` అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ మాటలు అన్నప్పటికీ.. యావత్ ప్రేక్షకులను తప్పుబడుతూ ఆయన మాట్లాడిన విధానం వంద శాతం సమర్థనీయంగా లేదు. సమాజంలో లేదా పరిశ్రమలో మార్పు రావాలంటే విత్తనంలోనే (అంటే సృష్టికర్తల్లోనే) మార్పు రావాలి తప్ప.. ఇలా ప్రేక్షకులను బ్లేమ్ చేయడం సాహసమనే చెప్పాలి.
నిజానికి ప్రేక్షకులు ఏమీ అంత తెలివితక్కువ వారు కారు... అలాగని అందరినీ ఒకే గాటాన కట్టేయడం కూడా తప్పు. సమాజంలో ఒక వర్గం ప్రేక్షకులు కలుషితమైన కంటెంట్‌ను ఇష్టపడుతుండొచ్చు కానీ...మెజారిటీ సెక్షన్లు ఇప్పటికీ నీతి నియమాలను అనుసరిస్తూ, సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఉన్నాయి. అనంత శ్రీరామ్ అందరు ప్రేక్షకులను జనరలైజ్ చేసి మాట్లాడటం వల్లే ఈ వివాదం రాజుకుంది. ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ స్పందిస్తూ.. ``ఐటమ్ సాంగ్స్ సరే, కానీ ఈ మధ్య పాటల్లో ఆడవాళ్లను ఉద్దేశించి సామాన్లు, సరుకు అంటూ వస్తువులుగా చిత్రీకరిస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా రాసేవాళ్లకు మీరేం చెబుతారు?`` అని నిలదీశారు.
దానికి అనంత శ్రీరామ్ సమాధానమిస్తూ.. ``సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు, అదొక కళాత్మక వ్యాపారం. వ్యాపారాన్ని, కామర్స్‌ని మనం విడివిడిగా చూడలేం. ఆ వ్యాపార సూత్రాల ప్రకారమే ఇలాంటివి పుట్టుకొస్తాయి. సొసైటీలో మీలాంటి అభిరుచి ఉన్నవాళ్లు, ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు చాలా చిన్న శాతం మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లు ఈ ప్రశ్నలు అడగరు`` అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అయితే జర్నలిస్ట్ ఇక్కడితో ఆగకుండా.. ``16 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి ఇలాంటి సామాన్లు, సరుకు అనే పదాలను పాడుకుంటుంటే అది కరెక్టేనా? సినిమాలు తీసే మీకు, సమాజాన్ని ప్రభావితం చేసే సూపర్ పవర్ ఉంది కదా!`` అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అనంత శ్రీరామ్ మరింత వివరణ ఇస్తూ.. ``సినిమా వాళ్లయిన మాకేం సూపర్ పవర్స్ లేవండీ. ఈ దేశంలో ఉన్న 150 కోట్ల జనమే ఒక పెద్ద పవర్. వాళ్లు ఏం చేయాలనుకుంటే అదే జరుగుతుంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. అదే నియంతృత్వ వ్యవస్థ అయితే ప్రభుత్వం ఇలాంటివి రాయొద్దు అని ఆర్డర్ వేసి తొక్కేస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిరుచికి తగ్గట్టే వ్యాపారం సాగుతుంది`` అని చెప్పుకొచ్చారు. ఆయన వివరణ ఎలా ఉన్నా సినిమాల్లో మహిళలను కించపరిచే పదజాలం వాడటానికి ప్రేక్షకులనే బాధ్యులను చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.