'మ‌హాన‌టి' కీర్తి సురేష్ అంత పేరొస్తుంది.. తెలుగ‌మ్మాయికి సీనియ‌ర్ న‌రేష్ కాంప్లిమెంట్

మారూతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాలతో టాలీవుడ్‌కు పరిచయమై తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది.

Update: 2026-10-06 16:16 GMT

మారూతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాలతో టాలీవుడ్‌కు పరిచయమై తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది. తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్, ఇప్పుడు మరో సరికొత్త మైలురాయిని అందుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వస్తున్న `గరివిడి లక్ష్మి` చిత్రంలో ఆనంది ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ ఆనంది నటనను ఆకాశానికి ఎత్తేయ‌డం విశేషం. తన 55 ఏళ్ల సినీ ప్రయాణంలో వెయ్యికి పైగా కథలు విన్నానని చెప్పిన నరేష్, `గరివిడి లక్ష్మి` కథ ఎంత అరుదైనదో కొనియాడారు. ముఖ్యంగా ఇందులో టైటిల్ రోల్ పోషించిన ఆనంది అభినయం చూశాక, `మహానటి` చిత్రంలో కీర్తి సురేష్‌కు ఏ విధంగా అయితే అద్భుతమైన పేరు వచ్చిందో ఈ సినిమాతో ఆనందికి కూడా అలాంటి ఘనతే దక్కుతుందని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. షూటింగ్ సమయంలో పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోందని ఎమోషనల్ అయ్యారు.

తమిళంలో `మన్ను వాసన` (మట్టి వాసన) నిండిన సినిమాలు వచ్చినట్లే.. మన తెలుగు గడ్డ మీద కూడా పచ్చని పల్లెటూరి వాతావరణం, అక్కడి మట్టి పరిమళాలు ఉట్టిపడే అచ్చమైన ఫోక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా `గరివిడి లక్ష్మి` రూపుదిద్దుకుంది. కేవలం ఒక బయోగ్రఫీలా కాకుండా.. గుండెల‌కు హత్తుకునే ఎమోషన్స్, అద్భుతమైన సంగీతంతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. గౌరీ నాయుడు దర్శకత్వ ప్రతిభ, రాగమయూర్ నటనతో పాటు ఆనంది అసాధార‌ణ న‌ట‌న‌ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని న‌రేష్ చెప్పారు.

ఈ దసరా బరిలో వ‌స్తున్న‌ సినిమాలలో ఖచ్చితంగా భారీ విజయాలు సాధించే రెండు చిత్రాలు ఉంటాయని, అందులో తమ సినిమా ముందు వరుసలో ఉంటుందని నరేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా సత్తాను చాటేలా.. ప్రాంతీయతను గర్వంగా గ్లోబల్ ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లే చిత్రమిదని ఆయన అభివర్ణించారు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు మూలస్తంభంగా నిలిచాయని ప్రతి టెక్నీషియన్ ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

మొత్తానికి `గరివిడి లక్ష్మి` ట్రైలర్‌తో నటి ఆనంది తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఇలాంటి బలమైన, చారిత్రాత్మక లేదా నేటివిటీ ఉన్న పాత్రలను ఎంచుకోవడం ద్వారా ఆనంది తనలోని అసలైన నటిని మరోసారి నిరూపించుకుంటున్నారు. సీనియర్ నటుల ప్రశంసలు, ట్రైలర్‌లోని విజువల్స్.. ఫోక్ మ్యూజిక్ అందిస్తున్న హైప్ చూస్తుంటే.. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద `గరివిడి లక్ష్మి` అంచనాలను మించి సంచలనం సృష్టించడం పక్కా అనిపిస్తోంది.

Tags:    

Similar News