కవిత్వంతో కొడుకుపై ప్రేమాభిమానాలు చాటుకున్న షెహన్‌షా!

ప్రస్తుతం 83 ఏళ్ల వయసులోనూ విశ్రమించకుండా అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై పాపులర్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` నిష్ణాతుడైన వ్యాఖ్యాతగా నడిపిస్తూ అలరిస్తున్నారు.

Update: 2026-09-28 13:30 GMT

బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్- కుమారుడు అభిషేక్ బచ్చన్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వెండితెరపైనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ తండ్రీ కొడుకులుగా ఇద్ద‌రి బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది. తాజాగా అమితాబ్ బచ్చన్ అధికారిక బ్లాగ్‌లో అభిషేక్‌తో తనకున్న బంధం, రెండు తరాల ఆలోచనా విధానాల మధ్య ఉండే వ్యత్యాసాల గురించి ఆసక్తికరమైన‌ కవితాత్మక భావాలను పంచుకున్నారు. తండ్రీకొడుకుల బంధం గురించి వివరిస్తూ బిగ్ బీ తన బ్లాగ్‌లో..

`పితా పుత్ర దోనో రహే, ఏక్ మంచ్ పర్ బైఠై. విచార్ అలగ్ అలగ్ హో చాహే, మంజిల్ కే హీ ఐఠై` అనే కవితాత్మక లైన్లను రాసుకొచ్చారు. అంటే `తండ్రీకొడుకులు ఒకే వేదికపై కూర్చున్నప్పుడు వారి ఆలోచనలు, దృక్పథాలు వేర్వేరుగా ఉండవచ్చు కానీ వారిద్దరి గమ్యం మాత్రం ఒక్కటే` అని దీని భావం. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ రెండు వేర్వేరు తరాల ఆలోచనలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అమితాబ్ స్పష్టం చేశారు. ఆలోచనల్లో భేదాలు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, అనురాగం ఎప్పటికీ తగ్గవని అమితాబ్ పేర్కొన్నారు.

నవతరం ప్రతినిధుల ఆలోచనా సరళిని తాను ఎప్పుడూ గౌరవిస్తానని వెల్లడించిన ఆయన దారులు, అభిప్రాయాలు వేరైనా అంతిమంగా అందరికీ మేలు చేకూర్చే లక్ష్యం వైపే పయనించాలని ఆకాంక్షించారు. జీవితంలో వేర్వేరు మార్గాలు ఎంచుకున్నా? ఆ మార్గాలన్నీ సరైన గమ్యస్థానానికి చేర్చడమే ప్రధాన ఉద్దేశమని అభిప్రా యపడ్డారు.అభిషేక్‌తో అనుబంధం కేవలం తండ్రీకొడుకుల సంబంధానికే పరిమితం కాదని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కొత్త విషయాలను అన్వేషిస్తూ ముందుకు సాగే ప్రయాణమని సీనియర్ బచ్చన్ తెలిపారు.

ఇద్దరి మధ్యా ఉండే పరస్పర ప్రేమ, గౌరవాలే ఈ బంధానికి బలమైన పునాదులని పునరుద్ఘాటించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమను ఆశీర్వదించే అభిమానులు, శ్రేయోభిలాషుల ఆప్యాయత కూడా ఈ అనుబంధాన్ని మరింత పటిష్టం చేసిందని బిగ్ బీ భావోద్వేగంగా రాసుకొచ్చారు. హిందీ చిత్రసీమలో అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి సొంత గుర్తింపు కోసం అభిషేక్ పడిన కష్టాన్ని, ఆయన నటనను అమితాబ్ పలుమార్లు బహిరంగంగానే ప్రశంసించారు. అభిషేక్ సాధించిన ప్రతి విజయానికి అమితాబ్ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేయడం, ప్రోత్సహించడం సినీ ప్రియులు చూస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం 83 ఏళ్ల వయసులోనూ విశ్రమించకుండా అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై పాపులర్ క్విజ్ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` నిష్ణాతుడైన వ్యాఖ్యాతగా నడిపిస్తూ అలరిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియా బ్లాగ్ ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. జీవిత పాఠాలను, అనుభవాలను కవితాత్మకంగా పంచుకునే బిగ్ బీ తాజాగా చేసిన పోస్ట్ నెటిజన్లను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News