ఇదంతా 'పుష్ప' రికార్డుల్ని కొట్టేయడానికేనా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `రాకా`. 2027 చివర్లో విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-20 04:41 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `రాకా`. 2027 చివర్లో విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా `పుష్ప` సాధించిన సంచలన‌ రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల‌ను ఒకే వేదికపైకి తీసుకువస్తూ అట్లీ చేస్తున్న ఈ ప్రయత్నం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రయోగంగా మారనుంది.

ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారేది అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, విల్ స్మిత్ ల అరుదైన‌ కాంబినేషన్ ఫ్రేమ్ అనే చ‌ర్చ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ `కింగ్ ఖాన్` షారుఖ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి పచ్చజెండా ఊపగా.. ప్రధాన విలన్ పాత్ర కోసం హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్రదించారు. విల్ స్మిత్ కనుక ఓకే చెబితే ఇండియన్ స్క్రీన్ పై ముగ్గురు గ్లోబల్ స్టార్లను ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. ఆస‌క్తిక‌రంగా ఈ ముగ్గురూ తమ కెరీర్‌లో `లార్జర్ దాన్ లైఫ్` సూపర్ హీరో తరహా పాత్రల్లో నటించి మెప్పించినవారే కావడం మరో విశేషం.

పాన్-ఇండియా స్థాయి దాటి గ్లోబల్ రీచ్ సాధించాలనే ఆలోచనతోనే అట్లీ ఈ కాంబినేషన్‌ను ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్‌లో `హ్యాంకాక్`, `సూసైడ్ స్క్వాడ్` వంటి చిత్రాల్లో విల్ స్మిత్ సూపర్ పవర్స్ ఉన్న పాత్రలు చేయగా.. షారుఖ్ ఖాన్ `రా-వన్` చిత్రంతో సూపర్ హీరోగా అలరించారు. ఇక అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలో సుకుమార్ మార్క్ సహజత్వంతో కూడిన ఊరమాస్ ఎనర్జీని చూపించి లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు పవర్‌హౌస్ పెర్ఫార్మర్లను తెరపైకి తెచ్చి `రాకా` చిత్రాన్ని అత్యంత అరుదైన విజువల్ వండర్‌గా మార్చాలని దర్శకుడు అట్లీ భావిస్తున్నారు.

అయితే `పుష్ప` రాజ్ పాత్రలో ఉన్న సహజత్వాన్ని ఎక్కడా దెబ్బతీయకుండా సుకుమార్ జాగ్రత్త పడగా.. అట్లీ `రాకా`లో అల్లు అర్జున్‌ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనేది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. సుకుమార్ శైలికి భిన్నంగా అట్లీ దీనిని లార్జర్ దాన్ లైఫ్ మాస్ ఫాంటసీగా తీర్చిదిద్దుతున్నారా లేదా అనేది టీజర్, ట్రైలర్లు వస్తేనే కానీ ఒక స్పష్టత రాదు.

అత్యంత భారీగా వ‌ర‌ల్డ్ వైడ్ విడుద‌ల కానున్న‌ ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని బన్నీ అభిమానులు ధీమాగా ఉన్నారు. అంతిమంగా ఈ భారీ కాంబినేషన్లు ఎన్ని ఉన్నా.. థియేటర్లలో సినిమా విజయం అనేది కంటెంట్ - ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాల్యూపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొనే పాత్ర‌పైనా స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అట్లీ త‌న రెగ్యుల‌ర్ మాస్ యాక్ష‌న్ సినిమాల‌కు భిన్నంగా రాకా ను ఎలా మ‌లుస్తున్నారో చూడాల‌నే ఉత్కంఠ భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో ఉంది. అత‌డు త‌న భారీ ప్ర‌యోగాన్ని ఏ స్థాయికి చేరుస్తాడో వేచి చూడాలి.

Tags:    

Similar News