ఆ హీరోకి వయసుతో పనిలేదు ఎవరైనా ఒక్కటే!
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అంటే? అందులో గ్లామర్, ఎనర్జీకి కొదవ ఉండదు.;
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అంటే? అందులో గ్లామర్, ఎనర్జీకి కొదవ ఉండదు. అయితే గత కొంతకాలంగా అక్షయ్ తన కంటే సగం వయస్సు ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. వీటిని ఇంత వరకూ అక్షయ్ కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. వ్యతిరేకత తీవ్రమైన నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్ వీటిపై స్పందించారు. ఒక నటుడిగా తనకు వయస్సుతో సంబంధం లేదన్నారు. తెరపై పండే కెమిస్ట్రీ మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు. నటనలో వయస్సును ప్రామాణికంగా చూడకూడదని గట్టిగా వాదిస్తున్నారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ యువ నటి వామికా గబ్బితో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌లో ( భూత్ బంగ్లా) నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం దాదాపు 25 ఏళ్లకు పైగానే ఉంది. వామికా గబ్బి ఇప్పుడిప్పుడే స్టార్‌డమ్ అందుకుంటున్న తరుణంలో అక్షయ్ వంటి సీనియర్ హీరోతో ఆమె జోడీ కట్టడం చర్చనీయాంశమైంది. అయితే సినిమా మేకింగ్‌లో పాత్రల అవసరమే తప్ప వ్యక్తిగత వయస్సుతో పనిలేదని చిత్ర యూనిట్ పేర్కొంటోంది.
అక్షయ్ కుమార్ గత సినిమాలను గమనిస్తే మానుషి చిల్లర్, కృతి సనన్, సారా అలీ ఖాన్ వంటి యంగ్ హీరోయిన్లతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఒక హీరోగా తను ఫిట్‌గా ఉన్నంత కాలం ఎవరితోనైనా నటించవచ్చని ఆయన భావిస్తారు. `మేము కథలోని పాత్రలను పోషిస్తున్నాము తప్ప, మా వ్యక్తిగత జీవితాలను కాదు. స్క్రీన్ మీద జోడీ చూడముచ్చటగా ఉంటే చాలు అని అక్షయ్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో వామికా గబ్బి కూడా సాను కూలంగానే ఉన్నారు. అక్షయ్ కుమార్ వంటి లెజెండరీ నటుడితో పని చేయడం తనకు ఒక గొప్ప అవకాశం అని ఆయన సెట్స్‌లో ఇచ్చే ఎనర్జీ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోదని ప్రశంసించారు.
షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య కుదిరిన సింక్ చూస్తుంటే వయస్సు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపితమవుతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఈ ఏజ్ గ్యాప్ ట్రెండ్‌ను తప్పుబడుతున్నారు. సీనియర్ హీరోలు తమ వయస్సుకు తగ్గ హీరోయిన్లతో నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే అక్షయ్ ఫిట్‌నెస్ చూస్తుంటే ఆయన ఏ హీరోయిన్ పక్కనైనా సెట్ అయిపోతారని మరికొందరు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా? అక్షయ్ తన రూటు మార్చుకోకుండా యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేయడానికే మొగ్గు చూపుతున్నారన్నది సుస్పష్టం. మరి అక్షయ్ కుమార్ - వామికా గబ్బి జంట తెరపై ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాతోనైనా అక్షయ్ ప్లాప్ బాట నుంచి బయట పడతారేమో చూడాలి.