​'అ' టీమ్ తుపాకీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: సినిమా పోతే ఆడియన్స్‌ మీద నిందలేస్తారా?

ఈ సినిమా కాన్సెప్ట్ గురించి డైరెక్టర్ సాయి బాలి వివరిస్తూ.. ఇది రెగ్యులర్ థ్రిల్లర్స్ కు భిన్నంగా ఉంటుందని చెప్పారు.

Update: 2026-10-19 07:05 GMT

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ(AH)'. సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ 'తుపాకీ.కామ్' కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ విజయ్ చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

ఈ సినిమా కాన్సెప్ట్ గురించి డైరెక్టర్ సాయి బాలి వివరిస్తూ.. ఇది రెగ్యులర్ థ్రిల్లర్స్ కు భిన్నంగా ఉంటుందని చెప్పారు. స్క్రీన్ ప్లే పాటర్న్, ప్యారలల్ స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని, ముఖ్యంగా మేకింగ్ లో డార్క్ బ్లూ టింట్, ఎల్లోయిష్ మూడ్ తో ఒక ఎడ్జ్ ఉంటుందని తెలిపారు. ఈ కథ రాసుకున్నప్పుడు హీరోగా రాహుల్ విజయ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావించి ఆయనకు నేరేట్ చేశానని, సింగిల్ సిట్టింగ్ లోనే ఆయన ఓకే చెప్పేశారని డైరెక్టర్ వివరించారు.

హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర కమర్షియల్ సినిమాల్లో లాగా కేవలం వచ్చి వెళ్లేలా ఉండదని, కథలో తను కూడా ఒక కీలక భాగమని చెప్పారు. దర్శకుడు తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యానని, శ్రీచరణ్ పాకాల లాంటి పాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్, టెక్నికల్ టీమ్ తో పనిచేయడం మంచి ఎక్స్ పీరియన్స్ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఈ ఇంటర్వ్యూలో అందరి దృష్టినీ ఆకర్షించింది రాహుల్ విజయ్ మాటలే. తనకు అండర్ రేటెడ్ యాక్టర్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ.. తాను దాన్ని అంత సీరియస్ గా తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ను పట్టించుకుంటే సైడ్ ట్రాక్ అవుతామని, తన ఫోకస్ అంతా కంటెంట్ మీదే ఉంటుందని చెప్పారు. అయితే పీఆర్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లే తాను వెనకబడ్డానని తన చుట్టూ ఉన్నవాళ్లు చెబుతుంటారని, పది మందిలో ఇద్దరికి నచ్చిన సినిమాను పది మందికి నచ్చిందని నమ్మించే పీఆర్ స్ట్రాటజీల పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని ఆయన ఓపెన్ గానే కౌంటర్ ఇచ్చారు.

మలయాళ సినిమాలు మన వాళ్లకు సెట్ అవ్వవు, స్లోగా ఉంటాయి అని వచ్చే కామెంట్స్ పై రాహుల్ చాలా ఘాటుగా స్పందించారు. "మన తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్లు వేరే ఏ ఇండస్ట్రీలోనూ ఉండరు. చూసిన సినిమాను మళ్లీ మళ్లీ చూసే గొప్ప మనసు వాళ్లది. మనం తీసిన సినిమా వాళ్లకు కనెక్ట్ అవ్వలేదంటే, మనం సరిగ్గా తీయట్లేదనే అర్థం. అంతేతప్ప ఆడియన్స్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు" అని ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.

కంటెంట్ పట్ల ఈ టీమ్ కు ఉన్న కాన్ఫిడెన్స్ ఈ ఇంటర్వ్యూలో క్లియర్ గా కనిపిస్తోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, ఇతర లాంగ్వేజెస్ లోకి డబ్ చేసి ఓటీటీ డీల్స్ కూడా దాదాపు ఫైనలైజ్ చేసే దశలో ఉన్నట్లు డైరెక్టర్ సాయి బాలి తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఒకేఒక్క సినిమా తమదే కాబట్టి కచ్చితంగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది.

Full View
Tags:    

Similar News