గ్యాప్ తర్వాత G2 ఆపరేషన్.. శేష్ మైండ్‌లో ఏం ఉంది?
టాలీవుడ్‌లో సరికొత్త స్పై థ్రిల్లర్ ట్రెండ్‌కు తెరలేపిన చిత్రం `గూఢచారి`. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న `గూఢచారి 2` (G2) చాలా గ్యాప్ తర్వాత వస్తుండడంపై చర్చ సాగుతోంది.
టాలీవుడ్‌లో సరికొత్త స్పై థ్రిల్లర్ ట్రెండ్‌కు తెరలేపిన చిత్రం `గూఢచారి`. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న `గూఢచారి 2` (G2) చాలా గ్యాప్ తర్వాత వస్తుండడంపై చర్చ సాగుతోంది. అయితే మొదటి భాగానికి ఈ సీక్వెల్ రావడానికి మధ్య ఐదేళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం.. మారుతున్న పాన్ ఇండియా ట్రెండ్...మార్కెట్ సమీకరణాలే. కేవలం ఒక ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందీ, సౌత్ ఆడియన్స్‌కు ఒక అంతర్జాతీయ స్థాయి స్పై యాక్షన్ అనుభూతిని ఇవ్వాలనే కసితో స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ కోసం మేకర్స్ అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది.
ప్రస్తుతం `గూఢచారి 2` శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా విరామం లేకుండా షూటింగ్స్‌తో బిజీగా గడిపిన హీరో కమ్ రైటర్ అడివి శేష్ ప్రస్తుతం అమెరికాలో సుదీర్ఘ సెలవుల్లో ఉన్నారు. డెకాయిట్: ఏక్ ప్రేమ్ కథ , జీ 2 చిత్రాల బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్స్ వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని అందుకే ఈ బ్రేక్ తప్పనిసరి అయిందని శేష్ పేర్కొన్నారు. అమెరికాలో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి క్వాలిటీ టైమ్ గడుపుతూ రీఛార్జ్ అవ్వడానికి ఈ ట్రిప్‌ను ఆయన వాడుకుంటున్నారు.
ఇటీవలే హిందీ, తెలుగు భాషల్లో విడుదలై ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో భారీ వసూళ్లతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న `డెకాయిట్` చిత్రం తెచ్చిన సక్సెస్ వైబ్స్‌ను శేష్ ఈ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విజయవంతమైన ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే తదుపరి భారీ చిత్రానికి సిద్ధమవడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన భావిస్తున్నారు. నిరంతరం డిమాండింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు కాసేపు ఆగి ఆలోచించే సమయం దొరకదు. డెకాయిట్ విజయాన్ని నా కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది అని శేష్ తన ఆనందాన్ని షేర్ చేసారు.
అయితే ఈ విరామం ముగియగానే అడివి శేష్ తన పూర్తి దృష్టిని `జి2` పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే కేంద్రీకరించనున్నారు. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ పనులు అత్యంత ఇంటెన్సివ్‌గా సాగనున్నాయి. ఇందుకోసం సరికొత్త దృక్పథంతో రెట్టింపు ఎనర్జీతో రంగంలోకి దిగాలని శేష్ ప్లాన్ చేస్తున్నారు. మారిన పాన్ ఇండియా మార్కెట్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలనే కసితో ఉన్న శేష్.. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎలాంటి రాజీ పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒక్కోసారి ముందుకు వెళ్లడానికి.. కాస్త వెనక్కి తగ్గి ఆలోచించడం అవసరమని ఈ బ్రేక్ తనకు మరింత బలాన్ని ఇస్తుందని అతడు నమ్మకంగా చెబుతున్నారు.
ఈ హై-వోల్టేజ్ తెలుగు స్పై థ్రిల్లర్ `గూఢచారి 2` లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, క్రేజీ బ్యూటీ వామిక గబ్బి కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ స్టార్ కాస్టింగ్ - పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత ఐదేళ్ల నిరీక్షణకు తగ్గట్టుగానే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.