తముళ్లతో సినిమాలు చేసి అన్నలను వివాహం చేసుకున్న ముగ్గురు హీరోయిన్స్‌ వీళ్లే..!

సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బిజీ బిజీగా ఉన్న కాల భైరవ ఇటీవల కాలంలో హీరోయిన్‌ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి పలు వేదిక లు పంచుకున్నారు.

Update: 2026-09-01 07:30 GMT

గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజం అయింది. ఎంఎం కీరవాణి తనయుడు కాల భైరవ, నటి కావ్య కళ్యాణ్ రామ్‌లు తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బిజీ బిజీగా ఉన్న కాల భైరవ ఇటీవల కాలంలో హీరోయిన్‌ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి పలు వేదిక లు పంచుకున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ అయ్యాయి. ఆ సమయంలో కూడా వీరిద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు వీరిద్దరూ తమ ప్రేమ వార్తలు నిజమే అని, తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా ప్రకటన చేశారు. తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడం ద్వారా వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ఉన్న సస్పెన్స్‌కి తెర దించినట్లు అయింది. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో ఆసక్తికర విషయం ఒకటి వైరల్‌ అవుతోంది.

కాలభైరవ, కావ్య కళ్యాణ్‌ రామ్‌ లవ్‌ అఫిషియల్‌...

కాల భైరవతో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించిన కావ్య కళ్యాణ్ రామ్‌ ఇంతకు ముందు హీరో సింహాతో కలిసి 'ఉస్తాద్‌' సినిమాలో నటించింది. ఉస్తాద్‌ సినిమాలో తమ్ముడు సింహాతో కలిసి హీరోయిన్‌గా నటించిన కావ్య కళ్యాణ్‌ రామ్‌ ఇప్పుడు ఆయన అన్న కాలభైరవను వివాహం చేసుకోబోతుంది. కీరవాణి కొడుకులు అయిన కాలభైరవ, సింహాలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. సింహాతో సినిమా చేసే సమయంలోనే కాలభైరవతో కావ్య కళ్యాణ్‌ రామ్‌కి పరిచయం అయ్యి ఉంటుందని, ఆ పరిచయం ప్రేమగా మారి ఉంటుందని నెటిజన్స్‌ భావిస్తున్నారు. మొత్తానికి తమ్ముడితో హీరోయిన్‌గా నటించిన తర్వాత అన్నతో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇదే మాదిరిగా గతంలోనూ రెండు సార్లు జరిగింది. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం శ్రీదేవి సైతం ఇలాగే చేసిందని జనాలు గుర్తు చేసుకుంటున్నారు.

శ్రీదేవి, బోనీ కపూర్‌ల వివాహం...

సౌత్‌లో వరుసగా సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి బాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. బాలీవుడ్‌ అప్పటి స్టార్‌ హీరో అనిల్‌ కపూర్‌ తో శ్రీదేవి సినిమా చేసింది. ఆ సినిమా సమయంలోనే అనిల్ కపూర్‌ సోదరుడు బోనీ కపూర్‌తో శ్రీదేవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. బోనీ కపూర్‌కి అప్పటికే పెళ్లి అయినప్పటికీ శ్రీదేవి ఆయనతో పెళ్లికి రెడీ కావడం చర్చనీయాంశం అయింది. ఎంతో మంది వద్దని వారించినా, విమర్శించినా కూడా బోనీ కపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తమ్ముడు అనిల్‌ కపూర్‌తో సినిమాలో హీరోయిన్‌గా చేసి, రొమాంటిక్ సీన్స్ చేసి, ఆయన అన్న బోనీ కపూర్‌తో పెళ్లి పీటలు ఎక్కడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

విశాల్‌ సోదరుడు విక్రమ్‌ రెడ్డి, శ్రియా రెడ్డి వివాహం..

ఈ రెండు పెళ్లిలు తరహాలోనే తమిళనాట ఒక వివాహం జరిగింది. తమిళ హీరో విశాల్‌తో హీరోయిన్‌గా నటించిన శ్రియా రెడ్డి సైతం ఇలాంటి వివాహం చేసుకుంది. విశాల్‌ తో కలిసి నటించిన శ్రియా రెడ్డి ఆయన సోదరుడు విక్రమ్‌ రెడ్డిని వివాహం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. విశాల్‌, శ్రియా రెడ్డి నటించిన సినిమాకు విక్రమ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సమయంలోనే శ్రియా రెడ్డితో విక్రమ్‌ రెడ్డి పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. అలా ఇద్దరూ పెళ్లి పీటలు చేరారు. శ్రీదేవి, బోనీ కపూర్‌ జంటతో పాటు శ్రియా రెడ్డి, విక్రమ్‌ రెడ్డిల సరసన ఇప్పుడు కావ్య కళ్యాణ్‌రామ్‌, కాలభైరవ జంట నిలువబోతుంది. వారి మాదిరిగానే ఈ కొత్త జంట సంతోషంగా ఉండాలని, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలంటూ అభిమానులు, సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News