మాస్ మసాలా కొరియోగ్రఫీ: వరుస హిట్లతో జోరు మీదున్న 'ఆట' సందీప్!
ఈ క్రమంలోనే ఆట సందీప్ తన కెరీర్, కొత్త ప్రాజెక్టులు, టాలీవుడ్ ప్రముఖులతో పనిచేసిన అనుభవాలను ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో షేర్ చేసారు.
టాలీవుడ్ లో ఎందరో దిగ్గజ కొరియోగ్రాఫర్లు ఉన్నా తనదైన మార్క్ డ్యాన్సింగ్ ఎబిలిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆట సందీప్. ఈ ఫేమస్ కొరియోగ్రాఫర్ ఇటీవల వరుస విజయాలతో పెద్ద తెరపైనా మంచి జోరు మీదున్నారు. పలు వరుస చిత్రాల్లో ఆయన కంపోజ్ చేసిన పాటలు అందరినీ అలరించడమే గాక ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో అతడి పేరు మార్మోగుతోంది. ఈ క్రమంలోనే ఆట సందీప్ తన కెరీర్, కొత్త ప్రాజెక్టులు, టాలీవుడ్ ప్రముఖులతో పనిచేసిన అనుభవాలను ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో షేర్ చేసారు.
తాజా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తన సినీకెరీర్ లో విభిన్న జానర్లలో పాటలు కంపోజ్ చేసే అవకాశం రావడం తన అదృష్టమని సందీప్ పేర్కొన్నారు. శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ నటవారసుడితో చేసిన సినిమా సాంగ్ నుండి మొదలుకొని `మన శంకర వరప్రసాద్` విజయం వరకు... అలాగే ఇటీవల విడుదలైన `పారడైజ్` చిత్రంలోని స్పెషల్ ఐటమ్ సాంగ్ `గెరె గెరె` వరకు అన్నింటికీ మంచి ఆదరణ లభించిందన్నారు. చిన్న పిల్లలతో మాస్ స్టెప్పులైనా.. హీరోయిన్ ఓరియంటెడ్ పాటలైనా లేదా గ్రాండ్ ఐటమ్ నంబర్స్ అయినా సరే... డాన్స్ మాస్టర్‌గా తన స్థాయిని నిరూపించుకోవడానికి ఇవి తోడ్పడ్డాయని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన అనుభవాన్ని షేర్ చేస్తూ.. ఆయన సెట్స్‌లో ఇచ్చే ఫ్రీడమ్ - కంఫర్ట్ మరెక్కడా చూడలేదని సందీప్ కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్, పెద్ద స్టార్ అయినా తనతో ఎంతో సులభంగా కలిసిపోయారని.. తనకు నచ్చిన రీతిలో డాన్స్ కంపోజ్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని వెల్లడించారు. ఆ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు.
పిల్లలతో కలిసి పనిచేయడంపై స్పందిస్తూ.. వాళ్లతో షూటింగ్ చేయడం చాలా సరదాగా సాగిందని తెలిపారు. అరుణ్ అలాగే తన డాన్స్ క్లాస్ విద్యార్థులు ఎంతో డెడికేషన్ - హార్డ్ వర్క్‌తో పనిచేసారని మెచ్చుకున్నారు. పిల్లలు షూటింగ్‌లో ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ఎంతో క్రమశిక్షణతో కొరియోగ్రఫీని నేర్చుకొని స్క్రీన్ మీద అద్భుతంగా ప్రదర్శించారని.. అంతటి హార్డ్ వర్క్ వెనుక వారి కష్టం ఎంతో ఉందని సందీప్ ప్రశంసించారు.
చివరగా తన డాన్స్ కొరియోగ్రఫీ వెనుక ఉన్న సీక్రెట్ గురించి చెబుతూ.. మ్యూజిక్ వినగానే తన శరీరంలో ఆటోమేటిక్‌గా ఒక ఊపు వచ్చి స్టెప్పులు కదిలిపోతాయని చెప్పారు. ఇది తన సొంత ప్రతిభ కంటే కూడా ఆ భగవంతుడైన పరమశివుడు ఇచ్చిన ప్రత్యేకమైన కానుక అని వినమ్రంగా తెలిపారు. ఒక పాట వినబడగానే ఆటోమేటిక్‌గా స్టెప్పులు ఎలా వస్తాయో తాను కూడా ఎప్పుడూ ఊహించలేనని... ఆ దేవుడి దయతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని సందీప్ ముగించారు.