4DX సినిమా అంటే ఏమిటి? 3D కంటే ఇది ఎలా భిన్నమైనది?

సినిమా చూసే విధానంలో సాంకేతికత సరిహద్దులను దాటి సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. 4డిఎక్స్ (4-డైమెన్ష‌న‌ల్ అనుభ‌వం) టెక్నాలజీ ఇందులో అధునాత‌న‌మైన‌ది.

Update: 2026-07-02 00:30 GMT

సినిమా చూసే విధానంలో సాంకేతికత సరిహద్దులను దాటి సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. 4డిఎక్స్ (4-డైమెన్ష‌న‌ల్ అనుభ‌వం) టెక్నాలజీ ఇందులో అధునాత‌న‌మైన‌ది. అస‌లు ఈ 4డిఎక్స్ సాంకేతిక‌త అంటే ఏమిటి? అంటే... సాధారణంగా మనం చూసే 2డి లేదా 3డి సినిమాలు కేవలం కంటికి, చెవికి అన‌సంధాన‌మైన‌వి.. అంటే విజువల్స్ -సౌండ్‌కు మాత్రమే పరిమితమవుతాయి. కానీ 4DX టెక్నాలజీ ప్రేక్షకుడిని కేవలం ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసేలా కాకుండా... ఆ సినిమాలో జరుగుతున్న కథలో తానే స్వయంగా ఒక పాత్రలా ఉన్నాననే అద్భుతమైన భ్రమను కలిగిస్తుంది. దీనిని ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ అని అంటారు.

సాధారణ 3D సినిమాలతో పోలిస్తే ఈ 4డిఎక్స్ టెక్నాలజీ ప్రేక్షకులను ఎంతగానో ఎగ్జైట్ చేస్తుంది. 3D టెక్నాలజీలో కేవలం ప్రత్యేకమైన కళ్లద్దాలు పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌పై ఉన్న వస్తువులు మన ముందుకు వస్తున్నట్లు కేవలం `విజువల్` పరంగా మాత్రమే థ్రిల్ ఇస్తుంది. అయితే 4డిఎక్స్ అలా కాదు.. ఇది 3D విజువల్స్‌కు అదనంగా మన శారీరక అనుభూతులను కూడా జోడిస్తుంది. సినిమాలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లేదా వాతావరణ మార్పులను బట్టి థియేటర్ లోపల నిజమైన ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది.

ముఖ్యంగా జపాన్ వంటి అధునాతన దేశాల్లోని 4డిఎక్స్ థియేటర్లలో ఇచ్చే అనుభూతి వేరే లెవ‌ల్ లో ఉంటుంది. అక్క‌డ‌ స్క్రీన్‌పై వచ్చే విజువల్స్‌కు తగ్గట్టుగా థియేటర్ వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. ఉదాహరణకు స్క్రీన్‌పై సముద్రపు భారీ అలలు, తుఫాను వస్తున్నప్పుడు.. థియేటర్ లోపల కూడా నిజంగానే పెద్ద ఎత్తున పొగ, చల్లటి గాలి, నీటి చినుకులు ప్రేక్షకులపై పడతాయి. అంతేకాకుండా.. ఇందులో ఉండే మోషన్ సీట్లు స్థిరంగా ఉండకుండా.. సినిమాలో కారు రేసింగ్, ఫైట్ సీన్స్ లేదా భూకంపం లాంటివి వచ్చినప్పుడు ఆ మూవ్‌మెంట్‌కు సింక్ అవుతూ పైకి, కిందికి, పక్కలకి కదులుతాయి. వీటికి తోడు సినిమాలో ఎవరైనా పరిగెడుతుంటే మొహంపై గాలి కొట్టడం, బాంబులు పేలితే మెరుపులు రావడం, పూల తోటల సువాసనలు రావడం వంటివి 4డిఎక్స్ ప్రత్యేకత.

అయితే చాలామంది అనుకునేలా ఈ 4డిఎక్స్ సినిమాల మేకింగ్ లేదా షూటింగ్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన 4D కెమెరాలను ఉపయోగించరు. సాధారణంగా మనం థియేటర్లలో చూసే సినిమాలను ఏ కెమెరాలతో అయితే తీస్తారో (ఉదాహరణకు: ఐమ్యాక్స్ కెమెరాలు, రెడ్, ఆరీ అలెక్సా వంటి హై-రెజల్యూషన్ డిజిటల్ కెమెరాలు) వాటినే 4డి సినిమాలకు కూడా అవే కెమెరాలను ఉపయోగిస్తారు. ఇక్కడ మ్యాజిక్ అంతా కెమెరాలో కాదు.. పోస్ట్ ప్రొడక్షన్ - థియేటర్ సిస్టమ్‌లోనే దాగి ఉంటుంది.

సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యాక... ఎడిటింగ్ టేబుల్ మీద 4డిఎక్స్ ఎఫెక్ట్స్ ఇచ్చే ప్రత్యేక నిపుణులు (4డిఎక్స్ ఇంజినీర్లు) కూర్చుంటారు. వారు సినిమాలో వచ్చే ప్రతి సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి.. ఏ సెకనుకు సీటు కదలాలి... ఏ సీన్‌కు థియేటర్‌లో గాలి లేదా నీటి చినుకులు పడాలి అనేది సాఫ్ట్‌వేర్ ద్వారా కోడింగ్ చేస్తారు. థియేటర్ లోని మోషన్ సీట్లు.. వాటర్ స్పేయర్స్... విండ్ బ్లోయర్స్ అన్నీ ఈ కోడింగ్‌కు తగ్గట్టుగానే రన్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే 3D సినిమా మనల్ని స్క్రీన్ వైపు చూసేలా చేస్తే... 4DX టెక్నాలజీ మనల్ని నేరుగా ఆ సినిమా ప్రపంచంలోకే తీసుకెళ్లి కూర్చోబెడుతుంది.

Tags:    

Similar News