Begin typing your search above and press return to search.

పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు? భారతిని సూటిగా అడిగేశాడు

తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? అని ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:38 AM GMT
పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు? భారతిని సూటిగా అడిగేశాడు
X

కీలకమైన ఎన్నికల వేళలో.. ఉత్సాహంతో ప్రచారానికి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతికి అనూహ్య పరిణామం ఎదురైంది. ఆమెకు ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితి ఎదురుకావటమే కాదు.. నేరుగా తననే అడిగేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. ప్రశ్న అడిగిన పెద్ద మనిషి పార్టీకి చెందిన నాయకుడు కావటంతో ఎలా రియాక్టు కావాలో అర్థం కాని వేళలో.. మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లెలో పర్యటించారు.

తన ప్రచారంలో భాగంగా గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. అందరు ఆమె మాటలకు సానుకూలంగా స్పందిస్తున్న వేళ.. అనూహ్యంగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త కం వైసీపీ నేత భాస్కర్ రెడ్డి నుంచి ఎదురైన ప్రశ్న అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? అని ప్రశ్నించారు. అందుకు బదులుగా రైతుల పాసుపుస్తకాలపై రైతుల ఫోటోలే ఉండేలా చూడాలని కోరారు. అంతేకాదు.. జగన్ ప్రచారంలో పేర్కొనే అంశాలపై తనకున్న అభ్యంతరాల్ని ఆయన ప్రస్తావిస్తూ.. కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటున్నారే తప్పించి ఒక్కసారి కూడా నా రైతన్న అని అనటం లేదన్నారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలో సగం కేంద్రానిదే అన్నఆయన.. ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఆయన.. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. పార్టీ నేత భాస్కర్ రెడ్డి చెప్పిన అంశాల్ని విన్న భారతి.. మౌనంగా విని అక్కడ నుంచి ముందుకు వెళ్లిపోయారు.