Begin typing your search above and press return to search.

షర్మిలక్క కేంద్ర మంత్రిగానట...!?

వైఎస్సార్ లెగసీతో కొన్ని ఓట్లు టర్న్ అయినా నోటా మీద గెలిచి ఏపీలో కాంగ్రెస్ ఉనికి పోరులో ఊపిరి తీసుకోవచ్చు అన్న ఏకైన ఆలోచనతోనే ఇదంతా చేశారు.

By:  Tupaki Desk   |   2 May 2024 4:30 PM GMT
షర్మిలక్క కేంద్ర మంత్రిగానట...!?
X

రాజకీయాల్లో అసలు నిజాలు కంటే ఊహాగానాలకే ప్రచారం ఎక్కువ. వైఎస్ షర్మిల అన్న ఆమె ఈ రోజుకు చూస్తే కనుక కేరాఫ్ వైఎస్సార్ అనే చెప్పుకోవాలి. ఆమె కూడా తాను రాజన్న బిడ్డను అని చెప్పుకుంటోంది. ఇక ఆమె చెప్పుకోక పోయినా మరో కేరాఫ్ ఏంటి అంటే ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరిగా ఆమెకు గుర్తింపు. ఈ రెండవ కారణం వల్లనే కాంగ్రెస్ లో ఎంతో మంది ఉద్ధండులు ఈ రోజుకీ పార్టీలో ఇంకా అలా ఉన్నా ఆమెని తెచ్చి ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు.

వైఎస్సార్ లెగసీతో కొన్ని ఓట్లు టర్న్ అయినా నోటా మీద గెలిచి ఏపీలో కాంగ్రెస్ ఉనికి పోరులో ఊపిరి తీసుకోవచ్చు అన్న ఏకైన ఆలోచనతోనే ఇదంతా చేశారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది చర్చకే రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం ఎంత మేరకు పెరుగుతుంది అన్నదే చర్చ. నోటా కంటే తక్కువ ఓట్లు గతసారి తెచ్చుకున్న కాంగ్రెస్ కి ఈసారి ఒకటో రెండో శాతం ఓట్లు వస్తాయని లెక్క వేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మంత్రిగా షర్మిలక్క అని కడపలో ప్రచారం చేస్తున్నారుట.

ఇది నిజమేనా నమ్మబుల్ గా ఉందా అంటే రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారు ఎవరైనా లైట్ గానే తీసుకుంటారు. కడప ఎంపీ సీటు వైసీపీకి అత్యంత బలమైన సీటు. అక్కడ షర్మిల పార్టీకి డిపాజిట్లు రానేరావు అని ఏకంగా ఆమె సొంత అన్న జగన్ అనుమానం వ్యక్తం చేస్తూ ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి.

జగన్ అంచనా చూస్తే అది పెర్ఫెక్ట్ అని కూడా చెబుతారు. ఆయన రాజకీయ అనుభవం తో పాటు సొంత జిల్లాలో ఆయన రాజకీయ అవగాహన విశ్లేషణల నుంచే ఆ మాట వచ్చింది అనుకోవాలి. అలాంటిది చూస్తే ఇపుడు షర్మిలక్క కేంద్ర మంత్రి అంటున్నారు అంటే అది ఎలా సాధ్యం అన్నదే ప్రశ్న.

లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అందులో నాలుగింట అయినా మెజారిటీ ఓట్లు వస్తేనే తప్ప ఎంపీగా నెగ్గలేదు. కడపలో నాలుగు అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓడుతుంది అంటే ఏపీలో ఇక ఆ పార్టీ ఏపీ లో అధికారం అందుకునే రేసులో లేనట్లే. మరి అంత ప్రమాదం ఉపద్రవం జరుగుతుందా అన్నది మరో చర్చ.

ఇంకో వైపు చూస్తే కనుక కడపలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా చితికిపోయింది. నోటా కంటే తక్కువ ఓట్లే గతసారి వచ్చాయి. ఇపుడు కేవలం షర్మిల మాత్రమే అభ్యర్ధిగా అందరికీ తెలిసిన వారుగా ఉన్నారు. ఎన్నికలు అంటే కేవలం ప్రచారం కాదు, నలుగురిని పోగేసి మీటింగులు పెడితే ప్రచారం ఫరవాలేదు అనిపించుకోవచ్చు. కానీ ఎలక్షనీరింగ్ తెలియకపోతే ఎన్నికల్లో ఓట్లు పడవు.

ఎలక్షనీరింగ్ అంటే భారీ సమూహాలనే పోలింగ్ బూత్ ల వద్ద ఉంచాలి. అలాగే ఓటర్లను దగ్గర ఉంచి చేయి పట్టి ఓట్లు వేయించుకోవాలి. పటిష్టమైన యంత్రాంగం ఉన్న టీడీపీయే కడపలో ఎన్నో సార్లు ఓటమి పాలు అవుతోంది. ఇపుడు చూస్తే కాంగ్రెస్ కి ఆ సత్తా ఉందా అన్నది బిగ్ క్వశ్చన్. టీడీపీ సపోర్ట్ చేసినా షర్మిలకు డిపాజిట్లు రావచ్చేమో కానీ గెలిచేటంత ఓట్లు వస్తాయా అంటే డౌటే.

పోనీ అన్నీ హర్డిల్స్ దాటి అద్భుతాలే జరిగి ఆమె గెలిచింది అని అనుకున్నా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కదా. వచ్చిన తరువాత ఆ పార్టీ షర్మిలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా అతి పెద్ద ఊహాగానం ముచ్చట్లుగనె అంతా చూస్తున్నరు. ఏది ఏమైనా ఎన్నికల్లో జనాలకు ఆశ పెట్టడానికి మీ ఓటు మురిగిపోదు అని చెప్పడానికి మేము గెలుపు గుర్రాలం అని ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికే పనికి వస్తాయి తప్ప ఇవి జరిగేవేనా అన్నది చర్చగా ఉంది. సామాన్యులకు కూడా ఏమి జరుగుతుంది అన్నది తెలుసు కాబట్టి వారు కూడా ఇలాంటివి నమ్మే సీన్ ఉండదనే అంటున్నారు.

మొత్తానికి షర్మిలకు రాజకీయ ఆశలు ఉన్నాయన్నది అంతా ఒప్పుకుంటారు. అందులో తప్పు కూడా లేదు. కానీ వాటిని ఫలవంతం చేసుకోవాలంటే తగిన వ్యూహాలు కూడా ఉండాలి. ఏపీ కాంగ్రెస్ దశ తిరిగే రోజులు రావాలి. అప్పటిదాకా ఆమె కీలకమైన స్థానంలో ఉండాలి. ఇలా అన్నీ సమకూరితే ఏమో గుర్రం ఎగరావచ్చు. షర్మిలక్క కేంద్ర మంత్రి ఏమిటి ఏకంగా ఏపీకే సీఎం కూడా కావచ్చు. అంతవరకూ ఊహలుగానే వీటిని అంతా చూస్తున్నారు అంటే అందులో తప్పేమీలేదనే అంటున్నారు.